గ్రామీణ రోడ్లకు మహర్దశ

ABN , First Publish Date - 2021-04-21T05:38:13+05:30 IST

జిల్లాలోగల ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లోని తొమ్మిది రహదారులకు మహర్దశ పట్టనున్నది.

గ్రామీణ రోడ్లకు మహర్దశ
పెద్దపల్లి మండలంలోని రాగినేడు నుంచి కుర్మపల్లి గ్రామానికి వేస్తున్న తారు రోడ్డు

- పీఎంజీఎస్‌వై ద్వారా బీటీ రోడ్లుగా మారనున్న రోడ్లు

- 48.181 కిలోమీటర్ల 9 రోడ్లకు రూ. 26.03 కోట్లు మంజూరు

- త్వరలో టెండర్లకు ఆహ్వానం, మొదలుకానున్న పనులు

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

జిల్లాలోగల ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లోని తొమ్మిది రహదారులకు మహర్దశ పట్టనున్నది. మట్టి రోడ్లుగా ఈ రోడ్లు బీటీ రోడ్లుగా మారనున్నాయి. ఈ రహదారిపై ప్రయాణానికి ఇబ్బందిపడ్డ ప్రజలకు కష్టాలు తప్పనున్నాయి. 2021 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో 192 రహదారులు, 95 వంతెనల నిర్మాణాల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసి కేంద్రానికి పంపింది. అందుకు ఆమోదం తెలిపిన కేంద్రం పనుల నిర్మాణాలకు నిధులను మంజూరుచేసింది. అందులో భాగంగా జిల్లాలో 48.181 కిలోమీటర్ల నిడివి గల తొమ్మిది రహదారుల నిర్మాణానికి గాను 26 కోట్ల 3లక్షల రూపాయలు మంజూరయ్యాయి. ఈ పనులను చేపట్టేందుకు గాను త్వరలోనే టెండర్లను ఆహ్వానించి పనులను చేపట్టనున్నారు. మంథని నియోజకవర్గంలోని ఆమ్రాబాద్‌ నుంచి వయా ముత్తారం, పారుపెల్లి, పోతారం మీదుగా మైదంబండ బస్టాండ్‌ వరకుగల 6.3 కిలోమీటర్ల రోడ్డుకు 3కోట్ల 67 లక్షల 49 వేల రూపాయలు మంజూరయ్యాయి. రామగుండం నియోజకవర్గంలోని అంతర్గాం మండలం బ్రాహ్మణపల్లి క్రాస్‌రోడ్‌ నుంచి వయా అకెనపల్లి మీదుగా ఈసంపేట వరకుగల 4.53 కిలోమీటర్ల రోడ్డుకు ఒక కోటి 55 లక్షల 29 వేల రూపాయలు, ధర్మపురి నియోజకవర్గ పరిధిలోని ధర్మారం మండలం బొట్లవనపర్తి నుంచి వయా గొల్లపల్లి, కానంపల్లి మీదుగా పైడి చింతలపల్లి వరకుగల 5.8 కిలోమీటర్ల రోడ్డుకు 3 కోట్ల 34 లక్షల 70వేల రూపాయలు, ధర్మారం మండలం ఖిలావనపర్తి నుంచి కుమ్మరికుంట వరకు గల 5.8 కిలోమీటర్ల రోడ్డుకు 3 కోట్ల 34 లక్షల 39 వేల రూపాయలు మంజూరయ్యాయి. పెద్దపల్లి నియోజకవర్గలోని ఎలిగేడు మండలం ధూళికట్ట నుంచి వయా లాలపల్లి, ఎలిగేడు మీదుగా నాగలింగేశ్వరస్వామి టెంపుల్‌ వరకు గల 4.22 కిలోమీటర్ల రోడ్డుకు కోటి 87 లక్షల 99 వేల రూపాయలు, సుల్తానాబాద్‌ మండలం కనుకుల నుంచి ఓదెల మండలం గుంపుల వరకు, కనగర్తి నుంచి కాల్వశ్రీరాంపూర్‌, పొత్కపల్లి మీదుగా బీమరపల్లి వరకు గల 5.02 కిలోమీటర్ల రోడ్డుకు 2 కోట్ల 75 లక్షల 60 వేల రూపాయలు, ధర్మారం రోడ్డు నుంచి వయా రాగినేడు మీదుగా కుర్మపల్లి వరకు గల 4.27 కిలోమీటర్ల రోడ్డుకు 2 కోట్ల 48 లక్షల రూపాయలు, కాల్వశ్రీరాంపూర్‌ మండలం చినరాతుపల్లి నుంచి వయా తారుపల్లి, మల్యాల, కొత్తపల్లి మీదుగా మీర్జంపేట వరకు గల 6.95 కిలోమీటర్ల రోడ్డుకు 3 కోట్ల 97 లక్షల 19 వేల రూపాయలు, సుల్తానాబాద్‌ నుంచి వయా సుద్దాల మీదుగా రేగడిమద్దికుంట వరకుగల 5.23 కిలోమీటర్ల రోడ్డుకు 3 కోట్ల 2 లక్షల 69 వేల రూపాయలు మంజూరయ్యాయి. ఈ రోడ్లు మంజూరయ్యేందుకు గాను రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌, జడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌, పెద్దపల్లి, రామగుండం ఎమ్మెల్యేలు దాసరి మనోహర్‌రెడ్డి, కోరుకంటి చందర్‌లు పంపించిన ప్రతిపాదనల మేరకు నిధులు మంజూరయ్యాయి. తమ గ్రామాల్లోని మట్టి రోడ్లు బీటీ రోడ్లుగా మారనుండడంతో ఆయా గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో ఈ రహదారులన్నీ గుంతలమయం అవుతుండడంతో వాటిపై ప్రయాణించేందుకు తీవ్ర ఇబ్బందులుపడ్డారు. ఆ రోడ్లను బీటీ రోడ్లుగా మార్చేందుకు నిధులు మంజూరుకావడంతో ఆ రహదారులపై వాహనదారుల కష్టాలు తప్పనున్నాయి. 

Updated Date - 2021-04-21T05:38:13+05:30 IST