హుస్నాబాద్‌ బైపాస్‌ రోడ్లకు మహర్దశ

ABN , First Publish Date - 2022-05-18T05:21:45+05:30 IST

ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న హుస్నాబాద్‌ పట్టణంలోని బైపాస్‌ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు అయ్యాయి.

హుస్నాబాద్‌ బైపాస్‌ రోడ్లకు మహర్దశ
అధ్వానంగా తయారైన పట్టణంలోని బైపాస్‌ రోడ్డు

రూ.4 కోట్లతో చేపట్టనున్న పనులు

హుస్నాబాద్‌, మే 17 : ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న హుస్నాబాద్‌ పట్టణంలోని బైపాస్‌ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు అయ్యాయి. పట్టణంలోని సిద్దిపేట ప్రధాన రహదారి నుంచి నాగులమ్మ ఆలయం మీదుగా రామవరం రోడ్డులోని మున్సిపల్‌ నల్లల బావి, వైశ్యభవన్‌ నుంచి అక్కన్నపేట రోడ్డు వరకు ఉన్న బైపాస్‌ రోడ్లు పూర్తి అధ్వానంగా మారాయి. రూ.4కోట్లతో వీటి నిర్మాణం చేపట్టనున్నారు. పట్టణంలోని ఎల్లమ్మ చెరువు వద్ద జరిగే వార సంతకు ఈ రోడ్లు ఎంతో ఉపయోగపడుతున్నాయి. ఇటీవల హుస్నాబాద్‌ పర్యటనకు వచ్చిన మంత్రి హరీశ్‌రావు పట్టణాభివృద్ధికి రూ.12 కోట్లను మంజూరు చేయించారు. ఇందులో రూ.2కోట్లు మున్సిపల్‌ కార్యాలయ భవనానికి, సిద్దిపేట ప్రధాన రోడ్డు నుంచి మున్సిపల్‌ నల్లల బావి బైపాస్‌ రోడ్డుకు రూ. 2కోట్లు, వైశ్యభవన్‌ నుంచి అక్కన్నపేట బైపాస్‌ రోడ్డుకు రూ.2 కోట్లను వెచ్చిస్తున్నారు. టెక్నికల్‌ సాంక్షన్‌ వచ్చిన తరువాత టెండర్లు పిలిచి పనులు తొందరగా పూర్తి చేయిస్తామని కమిషనర్‌ రాజమల్లయ్య తెలిపారు. అలాగే పట్టణంలోని తహసీల్దార్‌ కార్యాలయంలో రూ.2 కోట్లతో చేపట్టిన సమీకృత మార్కెట్‌ పనులు ప్రారంభమయ్యాయి.  ఇక్కడ ఉన్న తహసీల్దార్‌, రెవెన్యూ డివిజన్‌ కార్యాలయాలను కిషన్‌నగర్‌లో ఉన్న సమీకృత ప్రభుత్వ కార్యాలయాల సముదాయానికి తరలించనున్నారు. 

Updated Date - 2022-05-18T05:21:45+05:30 IST