తబ్లీగీ సభ్యులతో కరోనా వైరస్ వ్యాప్తి అయ్యేట్లు కేంద్రం చేస్తోంది : మహారాష్ట్ర హోంమంత్రి

ABN , First Publish Date - 2020-04-09T00:51:08+05:30 IST

నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వంపై మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ బుధవారం సంచలన ఆరోపణలు చేశారు.

తబ్లీగీ సభ్యులతో కరోనా వైరస్ వ్యాప్తి అయ్యేట్లు కేంద్రం చేస్తోంది : మహారాష్ట్ర హోంమంత్రి

ముంబై : నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వంపై మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ బుధవారం సంచలన ఆరోపణలు చేశారు. తబ్లీగీ మర్కజ్ సదస్సుకు హాజరైన వారితో అన్ని రాష్ట్రాల్లో కరోనా వైరస్ వ్యాప్తి అయ్యేట్లుగా కేంద్ర ప్రభుత్వం చేస్తోందని తీవ్రంగా ఆరోపించారు. ‘‘దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రబలడానికే బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం తబ్లీగీ జమాతే సదస్సుకు అనుమతినిచ్చింది’’ అని ఆరోపించారు.


మార్చి 13,14 తేదీల్లో వసాయిలో జరగాల్సిన మర్కజ్ సమావేశానికి అనుమతి కావాలంటూ ఆ సంస్థ తమ ప్రభుత్వానికి ఫిబ్రవరి 5 న అనుమతిని కోరిందని, కరోనా నేపథ్యంలో తమ ప్రభుత్వం సదస్సు నిర్వహణకు అనుమతిని నిరాకరించామని పేర్కొన్నారు. మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో పాటు జాతీయ భద్రతా సలహాదారు, ఢిల్లీ పోలీసులకు పది ప్రశ్నలను సంధించారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మర్కజ్ చీఫ్‌ను కలవడానికి వెళ్లారని, ఆయనతో దోవల్‌కు గానీ, ఢిల్లీ పోలీసులకు గానీ పనేముందని సూటిగా ప్రశ్నించారు.


ఈ భేటీపై ఇప్పటి వరకూ అటు దోవల్ గానీ, ఇటు ఢిల్లీ పోలీసులు గానీ ఎందుకు వివరణ ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు. వీరిద్దరి మధ్య జరిగిన చర్చలేమిటో ప్రజలకు వివరించాలని ఆయన డిమాండ్ చేశారు. దోవల్‌తో భేటీ జరిగిన తర్వాత మర్కజ్ చీఫ్ మౌలానా సాద్ కనిపించకుండా పోయారని, దోవల్‌కు, ఆయనక గల సంబంధమేందని ప్రశ్నించారు. అలాగే ఢిల్లీ పోలీసులపై కూడా దేశ్‌ముఖ్ ప్రశ్నించారు. నిజాముద్దీన్ లోని మర్కజ్ సమావేశానికి ఢిల్లీ పోలీసులు ఎందుకు అనుమతినిచ్చారో తెలపాలని, వెంటనే ఆ సమావేశాన్ని ఎందుకు నిలుపుదల చేయలేదని అనిల్ దేశ్‌ముఖ్ మండిపడ్డారు. 

Updated Date - 2020-04-09T00:51:08+05:30 IST