మొదట మన దేశ అవసరాలు చూడండి : రాజేశ్ తోపే చురకలు

ABN , First Publish Date - 2021-04-08T19:55:22+05:30 IST

కేంద్రంపై మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేశ్ తోపే మరోసారి విరుచుకుపడ్డారు. మహారాష్ట్రకు ప్రతి వారం 40 లక్షల డోసులు అవసరమవుతాయని

మొదట మన దేశ అవసరాలు చూడండి : రాజేశ్ తోపే చురకలు

ముంబై : కేంద్రంపై మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేశ్ తోపే మరోసారి విరుచుకుపడ్డారు. మహారాష్ట్రకు ప్రతి వారం 40 లక్షల డోసులు అవసరమవుతాయని పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వం వ్యాక్సిన్లను ఇతర దేశాలకు సప్లై చేస్తోందని, కానీ మొదట మన దేశ అవసరాలను చూసుకోవాలని ఎద్దేవా చేశారు. కేంద్రం వ్యాక్సిన్ల విషయంలో తమకు సహాయం చేస్తున్న మాట వాస్తవమేనని, అయితే ఎంత చేయాలో అంత మోతాదులో మాత్రం చేయడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. తప్పొప్పులను తొందర్లోనే సవరించుకుంటామని కేంద్ర మంత్రి హర్షవర్ధన్ తమకు హామీ ఇచ్చారని, అందుకు తాము వేచిచూస్తున్నామని అన్నారు. ప్రతి నెలా 1.6 కోట్ల వ్యాక్సిన్ డోస్‌లు అవసరమవుతాయని, వారానికి 40 లక్షలు అవసరమని ఆయన వివరించారు. ప్రతి రోజూ రాష్ట్రంలో 6 లక్షల మందికి వ్యాక్సిన్లు వేస్తున్నామని తెలిపారు.


‘‘వ్యాక్సిన్ల విషయంలో నేను, ఎన్సీపీ అధినేత పవార్ కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌తో మాట్లాడాం. మా రాష్ట్రంపై కేంద్రం చూపిస్తున్న వివక్షను ఎత్తిచూపాం. మా రాష్ట్రంలో కరోనా తీవ్రంగా ఉంది. అయినా కేంద్రం కొంత మోతాదులోనే వ్యాక్సిన్లను ఎందుకు పంపుతోంది?’’ అంటూ రాజేశ్ తోపే విరుచుకుపడ్డారు. తాజా లెక్కల ప్రకారం తమకు ఇప్పటి వరకూ 7.5 లక్షల డోసేజులను మాత్రం కేంద్రం పంపిణీ చేసిందని వెల్లడించారు. అదే యూపీ, మధ్యప్రదేశ్, గుజరాత్, హర్యానాకు తమ కంటే ఎక్కువ మోతాదులో వ్యాక్సిన్లను పంపిణీ చేశారని ఆరోపించారు. 7 లక్షల నుంచి 17 లక్షలకు వ్యాక్సిన్ డోసేజులను పెంచాలని తాము కేంద్రానికి సూచించామని, ఇది కూడా తక్కువేనని, వారానికి తమకు 40 లక్షల డోసులు అవసరమని రాజేశ్ తోపే పేర్కొన్నారు. 

Updated Date - 2021-04-08T19:55:22+05:30 IST