మహారాష్ట్రలో మళ్లీ లాక్‌డౌన్‌!

ABN , First Publish Date - 2020-11-23T07:30:59+05:30 IST

పండుగల అనంతరం కేసులు భారీగా పెరుగుతుండటంతో మహారాష్ట్రలో లాక్‌డౌన్‌ విధించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ తెలిపారు...

మహారాష్ట్రలో మళ్లీ లాక్‌డౌన్‌!

  • పరిశీలించి నిర్ణయిస్తామన్న అజిత్‌పవార్‌ 
  • ఢిల్లీ నుంచి వచ్చే వారికి యూపీలో పరీక్షలు
  • దేశంలో 45 వేల కేసులు, 501 మరణాలు

న్యూఢిల్లీ, నవంబరు 22: పండుగల అనంతరం కేసులు భారీగా పెరుగుతుండటంతో మహారాష్ట్రలో లాక్‌డౌన్‌ విధించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ తెలిపారు. దీనిపై సంబంధిత అధికారులతో మాట్లాడుతున్నామని.. రానున్న 8-10 రోజులు పరిస్థితిని సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కాగా, ఢిల్లీ పరిస్థితులు, అహ్మదాబాద్‌ కర్ఫ్యూను ఉదహరిస్తూ మళ్లీ లాక్‌డౌన్‌ విధించకుండా ఉండాలంటే ప్రజలు కొవిడ్‌ నిబంధనలు పాటించాలని సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే సూచించారు. ఢిల్లీ నుంచి రైళ్లు, విమానాల రాకపోకలను నిలిపివేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఢిల్లీలో 21 రోజుల్లోనే 1,759 మంది వైర్‌సతో మృతి చెందారు. శనివారం నాటి 111 మరణాలతో కలిపి గత 11 రోజుల్లో ఐదుసార్లు వంద పైగా మరణాలు నమోదయ్యాయి. దేశంలో శనివారం 45,209 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయుంది. 501 మంది మృతి చెందారు. 45 వేలపైగా కేసులు రావడం మూడు రోజుల్లో ఇది రెండోసారి. గత 15 రోజుల్లో ఇవి రెండో అత్యధిక కేసులు.  ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లకు బృందాలను పంపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.


రైళ్లు, బస్సులు, విమానాల ద్వారా ఢిల్లీ నుంచి వచ్చే ప్రయాణికులకు పరీక్షలు చేయాలని యూపీ, హరియాణ ప్రభుత్వాలు నిర్ణయించాయి. రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌ సహా 8 జిల్లాల్లో రాత్రి కర్ఫ్యూ విధించారు. కరోనా అనంతరం తలెత్తే ఆరోగ్య సమస్యలను అధిగమించేందుకు ఆయుర్వేద వైద్యం, యోగా ఉపయోగపడతాయని కేంద్ర ఆయుష్‌ శాఖ మంత్రి శ్రీపద్‌ నాయక్‌ అన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి సమస్యలను సమర్థంగా ఎదుర్కొనేందుకు.. నివారణ చర్యలకు ప్రాధాన్యమిచ్చే కొత్త ఆరోగ్య విధానం అవసరమని పేర్కొన్నారు. కరోనా అనంతర పరిణామాలపై  వెబ్‌ కాన్ఫరెన్స్‌లో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. 


కఠిన చట్టాలతో బయో టెర్రరిజం కట్టడి

కరోనా అనుభావాల నేపథ్యంలో జీవాయుధ ఉగ్రవాద (బయో టెర్రరిజం) కట్టడికి పటిష్ఠ చట్టాలు చేయాలని పార్లమెంటరీ స్థాయీ సంఘం కేంద్రానికి సూచించింది. శత్రు దేశాలపైకి వైరస్‌ల ప్రయోగం, అవి మహమ్మారులుగా మారే ప్రమాదం ఉన్నందున మానవాళిని కాపాడుకోవాలంటే ఇలాంటి చట్టాలు అవసరమని పేర్కొంది. ఈ మేరకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు నివేదిక సమర్పించింది.


Updated Date - 2020-11-23T07:30:59+05:30 IST