మహారాష్ట్రలో 41 వేలు, ఢిల్లీలో 20 వేలకు పైగా కేసులు

ABN , First Publish Date - 2022-01-09T02:11:13+05:30 IST

దేశంలో కరోనా వైరస్ తీవ్రస్థాయిలో చెలరేగిపోతోంది. ఆందోళనకరస్థాయిలో కేసులు పెరిగిపోతున్నాయి.

మహారాష్ట్రలో 41 వేలు, ఢిల్లీలో 20 వేలకు పైగా కేసులు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ తీవ్రస్థాయిలో చెలరేగిపోతోంది. ఆందోళనకరస్థాయిలో కేసులు పెరిగిపోతున్నాయి. రోజురోజుకు కేసుల పెరుగుదలలో భారీ వ్యత్యాసం కనబడుతోంది. విచ్చలవిడిగా పెరిగిపోతున్న వైరస్‌కు అడ్డకట్ట వేసేందుకు ఇప్పటికే పలు రాష్ట్రాలు ఆంక్షలను అమల్లోకి తెచ్చాయి.


పశ్చిమ బెంగాల్‌లో ఇప్పటికే లాక్‌డౌన్ తరహా ఆంక్షలు అమల్లో ఉండగా, తమిళనాడు ప్రభుత్వం ప్రతి ఆదివారం లాక్‌డౌన్ ప్రకటించింది. అయినప్పటికీ కరోనా మాత్రం తన పని అది చేసుకుని పోతోంది. ఫలితంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున కేసులు నమోదవుతున్నాయి.


తాజాగా, గత 24 గంటల్లో మహారాష్ట్రంలో 41,434 కేసులు నమోదయ్యాయి. 9,671 మంది కోలుకోగా 13 మంది మరణించారు. 1,73,238 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. తాజా మరణాలతో కలుపుకుని ఇప్పటి వరకు కరోనాకు బలైన వారి సంఖ్య 1,41,627కు పెరిగింది. ఇక, ఒమైక్రాన్ కేసుల సంఖ్య కూడా వెయ్యి మార్కు దాటి 1,009కు చేరుకుంది. ఒక్క ముంబైలోనే దాదాపు సగం కేసులు వెలుగు చూశాయి. ఇక్కడ గత 24 గంటల్లో 20,318 కేసులు నమోదయ్యాయి. ఐదుగురు మరణించారు.


దేశ రాజధాని ఢిల్లీలో 20,181 కేసులు నమోదు కాగా, ఏడుగురు మరణించారు. ఉత్తరాఖండ్‌లో 1,560 నమోదయ్యాయి. బీహార్‌లో 4.526, పశ్చిమ బెంగాల్‌లో 18,802, కేరళలో 5,944, ఉత్తరప్రదేశ్‌లో 6.411, చండీగఢ్‌లో 541 కేసులు వెలుగుచూశాయి.

Updated Date - 2022-01-09T02:11:13+05:30 IST