Maharashtra political crisis: రెబల్ ఎమ్మెల్యేలకు సుప్రీం కోర్టులో ఊరట.. మహారాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు

ABN , First Publish Date - 2022-06-27T21:08:39+05:30 IST

మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభంపై సుప్రీం కోర్టులో విచారణ జరుగుతోంది. అనర్హత పిటిషన్‌పై శివసేన తిరుగుబాటు నేతలు సుప్రీం కోర్టును..

Maharashtra political crisis: రెబల్ ఎమ్మెల్యేలకు సుప్రీం కోర్టులో ఊరట.. మహారాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు

న్యూఢిల్లీ: మహారాష్ట్రలో (Maharashtra) నెలకొన్న రాజకీయ సంక్షోభంపై సుప్రీం కోర్టులో (Supreme Court) విచారణ జరుగుతోంది. అనర్హత నోటీసులపై (Disqualification Notices) శివసేన తిరుగుబాటు నేతలు (Shivsena Rebel MLAs) సుప్రీం కోర్టును ఆశ్రయించారు. శాసనసభాపక్ష నేతగా తనను తొలగిస్తూ డిప్యూటీ స్పీకర్ (Deputy Speaker) తీసుకున్న నిర్ణయంపై ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde) అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే.. అనర్హత నోటీసులపై ముంబై హైకోర్టును (Bombay High Court) ఎందుకు ఆశ్రయించలేదని సుప్రీంకోర్టు షిండే తరపు న్యాయవాదిని ప్రశ్నించింది. రాష్ట్రంలో పరిస్థితులు సరిగా లేవని, అత్యవసరంగానే సుప్రీంను ఆశ్రయించాల్సి వచ్చిందన్న షిండే న్యాయవాది కోర్టుకు బదులిచ్చారు. నోటీసులు జారీచేసే అధికారం డిప్యూటీ స్పీకర్‌కు లేదని షిండే తరపు న్యాయవాది వాదించారు. ఉద్ధవ్‌ఠాక్రే (Uddhav Thackeray) బెదిరిస్తున్నారని షిండే తరపు న్యాయవాది సుప్రీంకు తెలిపారు. షిండే వర్గం తరపున సీనియర్ అడ్వకేట్ నీరజ్ కిషన్ కౌల్ (Neeraj Kishan Kaul) వాదనలు వినిపిస్తున్నారు. ఉద్ధవ్ వర్గం తరపున సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వీ (Abhishek Manu Singhvi) వాదిస్తున్నారు.



ఈ కేసులో మహారాష్ట్ర ప్రభుత్వానికి (Maharashtra Govt), డిప్యూటీ స్పీకర్‌ (Deputy Speaker), మహారాష్ట్ర అసెంబ్లీ సెక్రటరీకి (Maharashtra Assembly Secretary) సుప్రీం కోర్టు తాజాగా నోటీసులు జారీ చేసింది. ఐదు రోజుల్లోగా కౌంటర్‌ దాఖలు చేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆ తర్వాత 3 రోజుల్లోగా రిజాయిండర్‌ దాఖలు చేయాలని తెలిపింది. తదుపరి విచారణ జులై 11కి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. అంతేకాదు.. జూన్ 27 సాయంత్రం 05.30 లోపు అనర్హత నోటీసులపై సమాధానం ఇవ్వాలని రెబల్ ఎమ్మెల్యేలకు (Rebel MLAs) డిప్యూటీ స్పీకర్ ఇచ్చిన గడువును సుప్రీం కోర్టు (Supreme Court) జులై 12 వరకూ పొడిగించింది. దీంతో.. అనర్హత నోటీసుల విషయంలో రెబల్ ఎమ్మెల్యేలకు ఊరట లభించినట్టయింది. రెబల్ ఎమ్మెల్యేలకు భద్రత కల్పించాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఆ 39 మంది ఎమ్మెల్యేలు, వారి కుటుంబ సభ్యుల భద్రత.. వారి ఆస్తులను కాపాడేందుకు తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అత్యున్నత న్యాయస్థానం ఉద్ధవ్ సర్కార్‌ను (Uddhav Govt) ఆదేశించింది.



రెబెల్‌ ఎమ్మెల్యేలపై (Rebel MLAs) శివసేన (Shivsena) త్రిముఖవ్యూహంతో ముందుకెళ్తోంది. అసమ్మతి నేతలపై ఒకవైపు శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ (Sanjay Raut), సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే (Aditya Thackeray) పరుష పదజాలంతో విరుచుకుపడుతుండగా.. పార్టీ శ్రేణులు రెబెల్స్‌కు వ్యతిరేకంగా తీవ్రస్థాయిలో నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. మరోవైపు ఆయా నేతల భార్యలను బుజ్జగించడానికి ఉద్ధవ్‌ భార్య (Uddhav Wife) రష్మి ఠాక్రే (Rashmi Thackeray) రంగంలోకి దిగారు. ఇంకోవైపు.. రెబెల్‌ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడంతోపాటు, మంత్రులను పదవుల నుంచి తొలగించడానికిపార్టీపరమైన, ప్రభుత్వపరమైన చర్యలను వేగవంతం చేశారు. ఆదివారం పార్టీ శ్రేణులతో మాట్లాడిన సంజయ్‌ రౌత్‌, ఆదిత్య ఠాక్రే.. షిండే శిబిరంపై నిప్పులు చెరిగారు. రెబెల్‌ ఎమ్మెల్యేలు (Rebel MLAs) ఇంకా ఎన్నాళ్లు గువాహటిలో (Gauhati) దాక్కుంటారని రౌత్‌ ప్రశ్నించారు. అసమ్మతి నేతల ఆత్మ, మనసు చనిపోయాయని, వట్టి శరీరాలు మిగిలాయని.. 40 దేహాలు అసోం (Assam) నుంచి వస్తాయని, వాటిని నేరుగా పోస్ట్‌మార్టమ్‌కు పంపుతామని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘రెబెల్స్‌కు దమ్ముంటే రాజీనామా చేసి మళ్లీ పోటీ చేసి ప్రజాతీర్పు కోరాలి’’ అని సవాల్‌ చేశారు.



ఇక.. రెబెల్‌ ఎమ్మెల్యేలకు విపరీత లక్ష్యాలున్నాయని, పార్టీ తలుపులు వారికి మూసుకుపోయాయని ఆదిత్య ఠాక్రే (Aditya Thackeray) ధ్వజమెత్తారు. గువాహటికి (Gauhati) ఎమ్మెల్యేలను ఖైదీలుగా తీసుకెళ్లారని.. ఇప్పటికీ 12 నుంచి 14 మంది ఎమ్మెల్యేలు తమతో సంప్రదింపులు జరుపుతున్నారని ఆదిత్య తెలిపారు. తిరుగుబాటు చేసిన మంత్రుల్లో ఏక్‌నాథ్‌ షిండే (Eknath Shinde), గులాబ్‌రావ్‌ పాటిల్‌, దాదా భూసేతోపాటు, అబ్దుల్‌ సత్తార్‌, శంభూరాజ్‌ దేశాయ్‌ తమ మంత్రి పదవులు కోల్పోనున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. మరోవైపు.. ఉద్ధవ్‌ ఠాక్రే భార్య రష్మి ఠాక్రే తిరుగుబాటు నేతల భార్యలతో మాట్లాడేందుకు రంగంలోకి దిగారు. ప్రతి ఒక్క రెబెల్‌ ఎమ్మెల్యే భార్యకూ ఫోన్‌ చేసి.. ఎలాగైనా నచ్చజెప్పి వారిని వెనక్కి తీసుకురావాల్సిందిగా రష్మి ఠాక్రే వారికి విజ్ఞప్తి చేస్తున్నారు. కారణాలేవైనాగానీ, ప్రస్తుతం రెబెల్‌ ఎమ్మెల్యేల్లో 20 మంది వెనక్కి రావడానికి సిద్ధంగా ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

Updated Date - 2022-06-27T21:08:39+05:30 IST