Maharashtra: హలో వద్దు..వందేమాతరమే ముద్దు: ఉద్యోగులకు సర్కార్ ఆదేశాలు

ABN , First Publish Date - 2022-10-03T01:15:03+05:30 IST

ఫోన్ రింగయితే 'హలో' అని స్పందించడం ఇక గతకాల ముచ్చటే కాబోతోందా? హలోకు బదులుగా ''వందేమాతరం'' అనడం..

Maharashtra: హలో వద్దు..వందేమాతరమే ముద్దు: ఉద్యోగులకు సర్కార్ ఆదేశాలు

ముంబై: ఫోన్ రింగయితే 'హలో' అని స్పందించడం ఇక గతకాల ముచ్చటే కాబోతోందా? హలోకు బదులుగా ''వందేమాతరం'' అనడం  తప్పనిసరి కానుందా? అవుననే చెబుతోంది ఏక్‌నాథ్ షిండే-దేవేంద్ర ఫడ్నవిస్ సారథ్యంలోని మహారాష్ట్ర ప్రభుత్వం. అనడమే కాదు...గవర్న్‌మెంట్ రిజల్యూషన్‌ (GR)తో రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేసింది. ఆ ప్రకారం, ప్రభుత్వ ఉద్యోగులు ఇక నుంచి తమ సిబ్బంది ఫోన్  కాల్స్‌ను  కానీ, ప్రజల నుంచి వచ్చే ఫోన్ కాల్స్‌ని కానీ రిసీవ్ చేసుకునేటప్పుడు ''హలో''కు బదులు ''వందేమాతరం''అని అనాలి. 'ఆజాదీ కి అమత్ మహోత్సవ్‌' జరుపుకొంటున్న తరుణంలోనే మహాత్మాగాంధీ జయంతి కూడా ఆదివారంనాడు రావడంతో ఇందుకు సంబంధించిన ప్రచారానికి మహారాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టుంది. షిండే సారథ్యంలోని జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ ఈ తాజా 'జీఆర్‌'ను జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులతో పాటు, సెమీ గవర్నమెంట్, స్థానిక సంస్థలు, ఎయిడెడ్ స్కూళ్లు, కాలేజీలు, ఇతర సంస్థలకు కూడా ఈ ఆదేశాలు వర్తిస్తాయి.


ప్రజలను ఉద్దేశించి ప్రభుత్వ సిబ్బంది మాట్లాడేటప్పుడు, బహిరంగ ప్రకటనలు చేసేటప్పుడు కూడా 'హలో'కు బదులు 'వందేమాతరం' అంటూనే సంబంధించాలని ప్రభుత్వ తీర్మానం (GR)లో పేర్కొన్నారు. కాగా, ఇందుకు సంబంధించిన ప్రచారాన్ని ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి సుధీర్  ముంగంటివార్ లాంఛనంగా వార్దాలో ప్రారంభించారు.


ఆదేశాలా? విజ్జప్తా?

'హలో' స్థానే 'వందేమాతరం' అనాలనే తీర్మానాన్ని ఆదేశంగా భావించాలా? విజ్ఞప్తిగా భావించాలా? అని మంత్రి ముంగటివార్‌ను మీడియా ప్రశ్నించగా, గాంధీ జయంతి సందర్భంగా తాము చేపట్టిన ప్రచారమని సమాధానమిచ్చారు. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ''వందేమాతరం'' నినాదం  కీలక పాత్ర వహించిందని, భగత్ సింగ్ చివరి మాట కూడా వందేమాతరమేనని, ఇవాల్టి నుంచి వందేమాతరాన్ని మన జీవితంలో ఒక భాగంగా చేసేందుకే వందేమాతరం ఉద్యమాన్ని ప్రారంభించామని హోం శాఖ బాధ్యతలు కూడా నిర్వహిస్తున్న  ముంగంటివార్ సమాధానం  ఇచ్చారు.


భగ్గుమన్న విపక్షాలు

కాగా, ప్రభుత్వ చర్యపై విపక్ష పార్టీల నుంచి, ఒక వర్గానికి చెందిన పలువురి నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి. ప్రభుత్వ నిర్ణయం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని సమాజ్‌వాదీ పార్టీ మహారాష్ట్ర విభాగం అధ్యక్షుడు అబు అసీమ్ అజ్మి అన్నారు. తాము 'సారే జహా సే అచ్చా' అంటామే కానీ  ''వందేమాతరం'' అనేది లేదని, ఇది తమ మత విశ్వాసాలకు విరుద్ధమని చెప్పారు. ముఖమంత్రి షిండే ''జై మహారాష్ట్ర'' అనే నినాదానికి బదులు వందేమాతరం నినాదం ఎత్తుకోవడం వెనుక బీజేపీ ఒత్తిడి ఉందని ఆయన ఆరోపించారు. గతంలో తాను బాలాసాహెబ్ థాకరేను పలుమార్లు కలిసినప్పుడు కూడా ''జై మహారాష్ట్ర'' అనగానే అదే మాటతో శివసైనికులు స్పందించేవారని తెలిపారు.


తప్పుపట్టిన 'మహా వికాస్ అఘాడి'

ప్రభుత్వ చర్యను మహా వికాస్ అఘాడి (MVA) కూడా తప్పుపట్టింది. శివసేన (ఉద్ధవ్ థాకరే వర్గం) ప్రతినిధి, రైతు నేత కిషోర్ తివారీ దీనిపై మాట్లాడుతూ, వందేమాతరం అనడం స్వాగతించదగిన పరిణామమే అయినప్పటికీ, రైతుల గౌరవార్ధం జై కిసాన్, అవినీతి రహతి ప్రభుత్వం కోసం ''జై సేవ'' నినాదాలు ముందుకు తీసుకురావాలని అన్నారు.


ఐచ్ఛికంగా ఉండాలి: ఎన్‌సీపీ

ఉద్యోగులు ప్రైవేటు టెలిఫోన్ కాల్స్ మాట్లాడాలన్నా వందేమాతరం సంబోధనతో మాట్లాడాలనడం వారి భావ ప్రకటనా స్వేచ్ఛను హరించడమేనని, ఒక నిర్దిష్ట భావజాలంతో చేస్తున్నదేనని ఎన్‌సీపీ జాతీయ ప్రతినిధి క్లైడే క్రస్టో విమర్శించారు. గర్వంగా వందేమాతరం అని నినదించాలనే కానీ, చెప్పితీరాలంటూ బలవతం చేయరాదని అన్నారు.


'ఈడీ' ప్రభుత్వ కుట్ర

మహారాష్ట్ర ఈడీ (ఏక్‌నాథ్-దేవేంద్ర ఫడ్నవిస్) ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ కేవలం ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, రూపాయి విలువ పతనం వంటి అసలైన సమస్యల నుంచి ప్రజలను దారి మళ్లించేందుకు జరుగుతున్న కుట్రగా ముంబై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చరణ్ సింగ్ సప్రా అభివర్ణించారు. ఇది పోలరైజేషన్ దిశగా జరుగుతున్న వ్యవహారమని అన్నారు. పూర్తిగా గాంధీ జయంతినాడు బాపూ సిద్ధాంతాలకు తిలోదకాలు ఇచ్చే చర్య అంటూ తప్పు పట్టారు.

Updated Date - 2022-10-03T01:15:03+05:30 IST