తెలంగాణలో హరితహారం భేష్: మహారాష్ర్ట అటవీ అధికారి

ABN , First Publish Date - 2021-07-26T23:27:09+05:30 IST

తెలంగాణ రాష్ట్రంలో హరితహారంతో పాటు అటవీ సంరక్షణలో తెలంగాణ అటవీ శాఖ సమర్థవంతగా పనిచేస్తోందని మహారాష్ట్ర అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్)సాయి ప్రకాష్ ప్రశంసించారు.

తెలంగాణలో హరితహారం భేష్: మహారాష్ర్ట అటవీ అధికారి

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో హరితహారంతో పాటు అటవీ సంరక్షణలో తెలంగాణ అటవీ శాఖ సమర్థవంతగా పనిచేస్తోందని మహారాష్ట్ర అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్)సాయి ప్రకాష్ ప్రశంసించారు. రెండు రోజుల పర్యటన కోసం హైదరాబాద్ వచ్చిన ఆయన అరణ్య భవన్ లో తెలంగాణ పీసీసీఎఫ్ శోభ, ఇతర ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. తెలంగాణలో అత్యంత విజయవంతంగా అమలవుతున్న హరితహారం, మొక్కల సంరక్షణ కోసం పంచాయితీ రాజ్, మున్సిపల్ చట్టాల్లో తెచ్చిన మార్పులు, సామిల్లులు, జూ పార్కుల నిర్వహణ, టైగర్ రిజర్వుల పరిధిలో ఉన్న మానవ ఆవాసాలను బయటకు తరలించే విధానాలపై ప్రధానంగా సమావేశంలో చర్చించారు. 


తెలంగాణలో హరితహారం విజయవంతంగా అమలుకావటం, ఆశించిన రీతిలో పచ్చదనం పెరగటం అభినందనీయమని సాయి ప్రకాష్ అన్నారు. హరితహారం లక్ష్యాలు, సాధించిన ప్రగతిపై సమావేశంలో సోషల్ ఫారెస్ట్రీ పీసీసీఎఫ్ ఆర్.ఎం. దోబ్రియల్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ముఖ్యమంత్రితో సహా మంత్రులు అన్ని శాఖల అధికారులు, విభిన్న వర్గాలు పచ్చదనం పెంపుకు కట్టుబడి ఉండటంతో మంచి ఫలితాలు వస్తున్నాయని పీసీసీఎఫ్ శోభ తెలిపారు. నాటిన మొక్కల సంరక్షణ, 85 శాతం బతకటం కోసం పంచాయితీ రాజ్, మున్సిపల్ చట్టాల్లో తెచ్చిన మార్పులను తెలుసుకునేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ఆసక్తిగా ఉందని సాయి ప్రకాశ్ వెల్లడించారు.


దీనిపై స్పందించిన తెలంగాణ పీసీసీఎఫ్ హరితహారం విజయానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరించారు. పల్లె, పట్టణ ప్రగతిలో భాగంగా గ్రామానికి ఒక నర్సరీ, ట్రాక్టర్, ట్యాంకర్, ప్రతీ నెలా గ్రీన్ బడ్జెట్,  మొక్కలు బతికే శాతం కచ్చితంగా అమలు చేసేందుకు పంచాయితీ సెక్రటరీ, సర్పంచ్ తో సహా అన్ని స్థాయిల్లో అధికారులను బాధ్యులుగా చేయటం, నిర్లక్ష్యంగా ఉన్నవారిపై చర్యలు, మొక్కలను కొట్టేసినా, పెంపుడు జంతువులు తిన్నా ఫైన్ వేయటం, ఇంటికి ఆరు మొక్కలు పంపిణీ చేయటం, అటవీ సంపద రక్షణ కోసం నిరంతర పర్యవేక్షణ వంటివి మంచి ఫలితాలు ఇచ్చాయని పీసీసీఎఫ్ శోభ వెల్లడించారు. మహారాష్ట్రలో మరితంగా పచ్చదనం పెంచేందుకు తెలంగాణ విధానాలను కొన్నింటిని అమలుచేసే దిశగా ఆలోచిస్తున్నామని ఆ రాష్ట్ర పీసీసీఎఫ్ఈ సందర్భంగా అన్నారు. 


ఇక నాగపూర్ జూ లో ఉన్న ఒకే జీన్స్ కు చెందిన రెండు సింహాలను పరస్పర మార్పిడి కింద తెలంగాణకు ఇచ్చి మరో రెండు సింహాలను మహారాష్ట్రకు ఇచ్చేందుకు అంగీకారం కుదిరింది. రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో పులుల సంచారం, నియంత్రణ, అటవీ సంపద అక్రమ రవాణా నియంత్రణకు చెక్ పోస్టులు, పులులు సంరక్షణ కేంద్రాల్లో ఉన్న మానవ ఆవాసాల తరలింపులో మహారాష్ట్ర అనుసరిస్తున్న విధానాలపై సమావేశంలో చర్చ జరిగింది.రాబందుల సంరక్షణకు రెండు రాష్ట్రాల్లో తీసుకుంటున్న చర్యలుఅధికారులు వివరించారు. సమావేశంలో పీసీసీఎఫ్ (కంపా) లోకేష్ జైస్వాల్, పీసీసీఫ్ (అడ్మిన్) స్వర్గం శ్రీనివాస్, అదనపు పీసీసీఎఫ్ లు ఎం.సీ పర్గెయిన్, సిద్దానంద్ కుక్రేటీ, వినయ్ కుమార్, ఏకే సిన్హా,రంగారెడ్డి సీసీఎఫ్ సునీతా భగవత్,  ఓఎస్డీ శంకరన్, జూ క్యూరేటర్ సుభద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు.  


Updated Date - 2021-07-26T23:27:09+05:30 IST