కోటపై కుట్ర

ABN , First Publish Date - 2020-11-01T10:17:07+05:30 IST

విద్యల నగరంగా విజయనగరానికి పేరుంది. శతాబ్దాల కిందట పూసపాటి రాజవంశీయుల దూరదృష్టితోనే ఇది సాధ్యమైంది. వారి విశాల దృక్పథం...

కోటపై కుట్ర

తొలుత మూడు లాంతర్ల తొలగింపు

ఇప్పుడు మహారాజా కళాశాల వంతు

విద్యల నగరం చరిత్రను నిర్వీర్యం చేసే ప్రయత్నం

మాన్సాస్‌, ప్రభుత్వ పెద్దల తీరుపై జనాగ్రహం


 రాజుల ఆనవాళ్లు లేకుండా చేయాలని కుతంత్రానికి తెరతీశారా? విద్యల నగర గురుతులను చేరిపే ప్రయత్నం చేస్తున్నారా? ఘనమైన చరిత్రను పుటల నుంచి తొలగించాలనుకుంటున్నారా?...అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇటీవల విజయనగరంలో వరుసగా జరుగుతున్న ఘటనలు  అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. ఓవైపు ఆధునికీకరణ పేరిట చారిత్రక కట్టడాలు కూల్చేస్తు స్తున్నారు. మరోవైపు వేలాది మంది పేద విద్యార్థుల చదువుకు అండగా నిలిచిన మహారాజా కళాశాలను  ప్రైవేటు బాట పట్టిస్తున్నారు. ప్రభుత్వ  పెద్దల చర్యలు మేథావులు, విద్యాధికులు, పూర్వ విద్యార్థులను కలవరపాటుకు గురిచేస్తున్నాయి.


(విజయనగరం-ఆంధ్రజ్యోతి)

విద్యల నగరంగా విజయనగరానికి పేరుంది. శతాబ్దాల కిందట పూసపాటి రాజవంశీయుల దూరదృష్టితోనే ఇది సాధ్యమైంది. వారి విశాల దృక్పథం... ముందుచూపుతోనే చారిత్రక కట్టడాలు, భవనాలు వెలిశాయి. వాటిలోనే ఇప్పటివరకూ  విద్య, సాంస్కృతిక, సంగీత, నృత్య, సాహిత్య సంస్థలు కొనసాగుతున్నాయి. ప్రస్తుత ప్రభుత్వం ఈ గురుతులను చెరిపేయాలని భావిస్తోందన్న వాదన అందరి నోటా వినిపిస్తోంది. ఇప్పటికే మూడు లాంతర్లను తొలగించారు. ఆధునీకరించాలంటే పురాతన నిర్మాణ ఆనవాళ్లు పోకుండా చేపట్టాలి. అలా కాకుండా ఏకంగా పురాతన కట్టడాన్ని కూల్చేశారు. కొత్త నిర్మాణాన్ని చేపట్టి ప్రభుత్వ పెద్దల పేర్లు లిఖించుకున్నారు. మరోవైపు నిబంధనలకు విరుద్ధంగా ‘మాన్సాస్‌’ నియామకాలు... వివాదాస్పద నిర్ణయాలతో ముందుకు సాగుతున్నారు.


తెరవెనుక తతంగం

 విద్యాసంస్థలు, కోట, గంటస్తంభం, మూడు లాంతర్లు వంటి వాటి చుట్టూ వ్యాపార, వాణిజ్య సంస్థలు వెలిశాయి. ఆ చుట్టుపక్కల భూములు చదరపు గజం రూ.లక్షల్లో పలుకుతోంది. దీంతో కొంత మంది పెద్దల కళ్లు మహారాజా కళాశాలపై పడింది. ప్రధాన మార్కెట్‌, గంటస్తంభం, కోట ఇలా మహారాజా కళాశాల  చుట్టూ విజయనగరం నడి బొడ్డుగా ఉంది. వందల ఏళ్లుగా పట్టణానికి కీలక ప్రాంతంగా అభివృద్ధి చెందింది. మహారాజా కళాశాల 6 ఎకరాల్లో విస్తరించి ఉంది. అంటే ప్రధాన కూడలిలో ఇంత కంటే విలువైన స్థలం విజయనగరంలో వేరొకటి లేదనే చెప్పాలి. ఇటువంటి స్థలంపై పెద్దల కన్ను పడింది.  దీన్ని ఎలాగైనా ప్రైవేట్‌ పరం చేసి కోట్లు దండుకునే పనిలో పడ్డారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆడిస్తున్నారు. మహారాజా కళాశాల వ్యవహారం రాజుల కుటుంబ వ్యవహారంగా చెబుతూనే... ప్రభుత్వ పెద్దలు తెరవెనుక తతంగాన్ని నడిపిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం విద్యార్థులను ప్రభుత్వ జూనియర్‌ కళాశాలకు తరలించే పన్నాగం.


నిరసనలు పెల్లుబికుతున్నా..

మాన్సాస్‌ నిర్ణయంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. విద్యావేత్తలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, పూర్వ విద్యార్థులు, కళాశాలలో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బంది వివిధ రూపాల్లో నిరసన తెలుపుతున్నారు. నిరవధిక దీక్షలు కొనసాగిస్తున్నారు. రాజకీయ పక్షాలు సంఘీభావం తెలుపుతున్నాయి. రోజురోజుకు నిరసన సెగ పెరుగుతున్నా ప్రభుత్వ పెద్దలు దిగి రావడం లేదు. ఇంటర్‌ మొదటి సంవత్సరం ప్రవేశాలను నిలిపేశారు. రెండో సంవత్సం విద్యార్థులను ప్రభుత్వ జూనియర్‌ కళాశాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. అటానమస్‌ డిగ్రీ కళాశాల కావడంతో... డిగ్రీ విద్యార్థులను ఏం చేయాలి అన్నదానిపై ప్రభుత్వ పెద్దలు ఆలోచిస్తున్నారు.


కార్పొరేట్‌ సంస్థల కన్ను

తొలుత ప్రైవేటుపరం చేస్తారని ప్రచారం చేశారు. ప్రైవేటు యాజమాన్యం కిందకు కళాశాలకు వెళ్తుందని భావించారు. కానీ విద్యార్థులను ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలో చేర్పించి..భవననాలను కూల్చాలన్నది లక్ష్యంగా తెలుస్తోంది. విలువైన ప్రాంతం, నగరం నడిబొడ్డున ఉండడంతో కార్పొరేట్‌ సంస్థలకు అప్పగించి వందల కోట్లు తెరచాటున దండుకునే ప్రయత్నం జరుగుతోందన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఐనాక్స్‌లు, షాపింగ్‌ మాల్స్‌ వంటి కార్పొరేట్‌ వాణిజ్య సంస్థలు ఈ ప్రాంతంలో పాగా వేయడానికి సన్నద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. మూడు లాంతర్ల తొలగింపు కూడా హైడ్రామా నడుమ సాగింది. రాత్రిపూటే తొలగింపునకు పూనుకున్నారు. మహారాజా కళాశాల విషయంలో అటువంటి నిర్ణయం ఏమైనా ఉంటుందా అన్న అనుమానం ప్రజల్లో ఉంది.

 

సుదీర్ఘ చరిత్ర సొంతం..

మహారాజ కళాశాలకు సుదీర్ఘ చరిత్ర ఉంది. ఇక్కడ చదువుకున్న ఎంతో మంది వివిధ రంగాల్లో స్థిరపడ్డారు. 1857లో మిడిల్‌ స్కూల్‌గా ప్రారంభమైంది. 1868లో ఉన్నత పాఠశాలగా, 1879లో డిగ్రీ కళాశాలగా అభివృద్ధి చెందింది.  1987 నుంచి స్వయం ప్రతిపత్తిగల విద్యా సంస్థగా కొనసాగుతోంది. యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ గుర్తింపు సాధించింది. ఎంతో మంది ఉన్నత పౌరులను జాతికి అందించింది. 1862లో జన్మించిన మహాకవి, సంఘ సంస్కర్త గురజాడ అప్పారావు కూడా ఇదే విద్యాసంస్థలో విద్యనభ్యసించారు. రాజకీయాల్లో రాణిస్తున్న, శాసిస్తున్న అనేక మంది ఈ కళాశాలలో చదువుకున్న వారే. మహారాజా కళాశాలలో చదువుకుంటున్నామని గర్వంగా చెప్పుకునే పరిస్థితి ఉంది. ఉత్తరాంధ్ర విద్యార్థులకు పెద్ద దిక్కుగా ఉండేది. అటువంటి విద్యాసంస్థను నిర్వీర్యం చేయడాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎవరు ఏమనుకున్నా మాకేంటి అన్న అన్న రీతిలో మాన్సాస్‌, ప్రభుత్వం వ్యవహరిస్తుండడం అగ్నికి ఆజ్యం పోస్తోంది.

Updated Date - 2020-11-01T10:17:07+05:30 IST