చిత్తూరు జిల్లా: అమరావతి రైతులు న్యాయస్థానం టూ దేవస్థానం వరకు ప్రారంభించిన మహాపాదయాత్ర నెల్లూరు జిల్లాలో ముగిసి.. మంగళవారం చిత్తూరు జిల్లాలో ప్రవేశించింది. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో రైతుల పాదయాత్ర 37వ రోజు కొనసాగుతోంది. అన్ని వర్గాల నుంచి వచ్చిన ప్రజలు పాదయాత్రకు మద్దతు తెలుపుతున్నారు. బీజేపీ నేతలు, కార్యకర్తలు ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ బీజేపీ నేత ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ ప్రజల్లో విపరీతమైన ఆదరణ కనిపిస్తోందన్నారు. ఆనాడు ఎన్టీఆర్ చెప్పినట్లు.. సముద్రం ఉప్పొంగిందా...అన్నట్టుగా ఈ జన సమూహంలో సీఎం జగన్ కొట్టుకుపోవడం ఖాయమన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడితే ఎంత పెద్ద నాయకుడికైనా పతనం తప్పదన్న విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తించాలన్నారు. జగన్ ఓ ఉన్మాదిలా ప్రవర్తిస్తున్నారని, పాదయాత్రను అడ్డుకోడానికి పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగించుకోవడం చట్ట వ్యతిరేకమని బీజేపీ నేత అన్నారు. కాగా నెల్లూరు జిల్లాలో పాదయాత్రకు సహకరించిన అందరికీ రైతులు కృతజ్ఞతలు తెలిపారు.