మదనపల్లెలో మహనీయుడు

ABN , First Publish Date - 2022-08-11T04:29:17+05:30 IST

జాతీయోద్యమంలో బాపూజీ ఖాదీ నినాదం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ప్రతిధ్వనించింది.

మదనపల్లెలో మహనీయుడు
మదనపల్లెలోని గాంధీ రోడ్డు

ప్రతిధ్వనించిన ఖాదీఖద్దర్‌ నినాదం

ప్రజల నుంచి రూ.2475 విరాళాల సేకరణ


మదనపల్లె, ఆగస్టు 10: జాతీయోద్యమంలో బాపూజీ ఖాదీ నినాదం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ప్రతిధ్వనించింది. ఈ ఉద్యమానికి ప్రజలు సంపూర్ణ మద్దతు ఇవ్వడంతో పాటు తమ శక్తి మేర విరాళాలు అందజేశారు. ఖాదీ ఉద్యమంలో భాగంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 1929 మే 15, 16, 17వ తేదీలలో చిత్తూరు, తిరుపతి, పుత్తూరు, పలమనేరు, పుంగనూరు, మదనపల్లెల్లో పర్యటించారు. బాపూజీ పర్యటనలో భాగంగా మదనపల్లెలో మొదట నిర్ణయించిన ప్రకారం మే 17వ తేదీ ఉదయం చేరుకుని, సాయంత్రం బహిరరంగ సభలో ఉపన్యసించాల్సి ఉంది. కానీ మే 16వ తేదీ ఉదయాన్నే గాంధీ ఇక్కడికి చేరుకున్నారు. అప్పటికే వేలమంది చేరుకున్న సమావేశంలో గాంఽధీజీ ఖాదీ ఉద్యమ ఆర్థిక ప్రాముఖ్యతను వారికి వివరించారు. ఆంగ్లేయులకు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమాన్ని విశ్వవ్యాప్తం చేసే క్రమంలో మహాత్ముడు ఇక్కడికి విచ్చేశారు. స్థానిక మిషన్‌ కాంపౌండ్‌లో నిర్వహించిన బహిరంగ సభకు భారీగా జనం హాజరయ్యారు. ప్రజానీకాన్ని ఉద్దేశించి గాంధీజీ ‘విదేశీయుల నుంచి మన భరతమాతను విడిపించడానికి ప్రతిపౌరుడు నడుం బిగించి ముందుకు నడవాలి. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రాణాలను బలిచ్చి అయినా సరే దేశ మాత దాస్యశృంఖాలు పటాపంచలు చేయాలని ఉద్భోదించారు’. అలాగే విదేశీ వస్త్రాలను బహిష్కరించాలని, ఖద్దరు, ఖాదీ దుస్తులు ధరించాలని, వాటినే కొనగోలు చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మరోవైపు పత్తి నుంచి నూలు ఒడికే గుజరాత్‌ చర్కాను పరిచయం చేసిన గాంధీ ప్రతిఒక్కరూ ఖాదీ ఖద్దర్‌ను ధరించాలని పిలుపునిచ్చారు. ఖాదీ నిధికి విరాళాలు సేకరిస్తున్నామని, అందుకు ప్రతిఒక్కరూ తన వంతు దోహదపడాలన్న మహాత్ముడి పిలుపు మేరకు పట్టణ ప్రజలు స్పందించారు. తమకు తోచిన సాయాన్ని అందజేశారు. రూ.2475 విరాళాల రూపంలో వచ్చింది. జిల్లాలోని ఇతర ప్రదేశాల లోటును జాతీయోద్యమానికి కేంద్రంగా నిలిచిన మదనపల్లె పూడ్చిందని గాంధీజీ సంతోషం వ్యక్తం చేశారు. 

దక్షిణ భారతదేశంలోను ఉద్యమాన్ని తీవ్రతరం చేయడంలో భాగంగా కార్యకర్తలను ఉత్తేజపరిచే క్రమంలో మద్రాస్‌ నుంచి తిరుపతి మీదుగా మదనపల్లెకు రైలులో విచ్చేశారు. సీటీఎం రైల్వేస్టేషన్‌లో దిగిన గాంధీజీ రోడ్డుమార్గాన పట్టణానికి చేరుకుని, స్థానిక మిషన్‌ కాంపౌండ్‌లో జరిగిన సమావేశంలో ఉద్యమాన్ని గురించి ప్రజలకు వివరించారు. అప్పటికే ఆంగ్లేయ వనిత అనీబిసెంట్‌..ప్రముఖ విద్యాకేంద్రం బిసెంట్‌ థియోసాఫికల్‌ కాలేజ్‌(బి.టి.కళాశాల)ను స్థాపించి విద్యార్థులకు విద్యాభాగ్యం కల్పించారు. ఈ క్రమంలో అనీబిసెంట్‌తో కలిసి బి.టి.కళాశాలలోని బీసెంట్‌హాలులో విద్యార్థులతో సమావేశమయ్యారు. జాతీయోద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని వారికి సూచించారు. విదేశీ వస్తువులను నిషేధించి స్వదేశీ వస్తువులనే వాడాలని మహాత్మాగాంధీ విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాడుతున్న జాతిపిత..పరదేశీయురాలైన అనీబిసెంట్‌ స్వదేశీయుల విద్యాభివృద్ధికి చేస్తున్న సేవలను కొనియాడారు. ఉద్యమంలో పాలు పంచుకోవాలన్న గాంధీ కోరిక మేరకు ఆమె కూడా గాంధీ అడుగుజాడల్లో నడుస్తూ తాను ఉద్యమంలో పాల్గొన్నారు. బి.టి.కళాశాల విద్యార్థులను కార్యోన్ముఖులను చేశారు. గాంధీ చేస్తున్న ఉద్యమాలకు ఆకర్షితులై స్థానికంగా ఉంటున్న నూతి రాధాకృష్ణయ్య, పెద్దమురాద్‌షా, టి.ఎన్‌.రామకృష్ణారెడ్డి, కట్టుబాయి సుబ్బారావు తదితరులు గాంధీ వెంట నడిచారు. అనంతరం గాంధీజీ ఇక్కడి నుంచి అనంతపురం వెళ్లారు. పట్టణంలో నడియాడిన గాంధీజీకి చిహ్నంగా పట్టణంలో గాంధీరోడ్డు, గాంధీపురాలను ఆయన పేరిట నామకరణం చేశారు. దేశంలోనే అతిపెద్ద రెవెన్యూ డివిజన్‌ కేంద్రమైన బ్రిటీష్‌ పాలకులు నిర్మించిన మదనపల్లె సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం ఆవరణంలో గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. గాంధీ వెంట నడిచిన వారిలో నూతి రాధాకృష్ణయ్యను అప్పట్లో మదనపల్లె గాంధీగా పిలిచేవారు. అలాగే ఉద్యమకారుల్లో ఒకరైన పెద్దమురాద్‌షా మహాత్ముడి పర్యటన అనంతరం ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు. ఈ క్రమంలో బ్రిటీషు పాలకులు పెద్దమురాద్‌షాపై రెండుసార్లు షూటింగ్‌ ఆర్డర్‌ కూడా జారీ చేసినట్లు చెబుతున్నారు. జాతిపిత ఇక్కడికి రావడానికి బీటీ కళాశాల ఏర్పాటు.. ఉద్యమం వైపు నడుస్తున్న కార్యకర్తలు (గాంధేయవాధులు) ఉండటమే కారణమని చెప్పవచ్చు. మూడు రోజులపాటు సాగిన ఉమ్మడి చిత్తూరు జిల్లా పర్యటనలో వచ్చిన విరాళాలను కదిరిలో లెక్కించగా రూ.7814 వచ్చినట్లు గుర్తించారు. మదనపల్లె నుంచి మహాత్ముడు అనంతపురం జిల్లా పర్యటనకు వెళ్లగా కదిరి సమీపంలోని నాగిరెడ్డిపల్లెకు చేరుకోగా అక్కడ ప్రజలు ఘనస్వాగతం పలికారు.



Updated Date - 2022-08-11T04:29:17+05:30 IST