అడ్డుకోవాలని చూస్తే అంతు తేలుస్తాం

ABN , First Publish Date - 2022-05-25T09:07:45+05:30 IST

‘‘వైసీపీ ప్రభుత్వంలోని పెద్దలు కుట్రలు, కుతంత్రాలతో మహానాడును అడ్డుకోవాలని చూస్తే అంతు తేలుస్తాం.

అడ్డుకోవాలని చూస్తే అంతు తేలుస్తాం

మహానాడుకు వాహనాలు ఇవ్వద్దని అధికారులతో బెదిరిస్తున్నారు

అయినా ప్రజలు చీమల దండులా రావడం ఖాయం


అమరావతి, మే 24(ఆంధ్రజ్యోతి): ‘‘వైసీపీ ప్రభుత్వంలోని పెద్దలు కుట్రలు, కుతంత్రాలతో మహానాడును అడ్డుకోవాలని చూస్తే అంతు తేలుస్తాం. వైసీపీ ప్రభుత్వం గడప గడప కార్యక్రమంలో ప్రజల నిలదీతలు... టీడీపీ నాయకులకు లభిస్తున్న స్వాగతాలతో అధికార పార్టీ నేతలకు కడుపు మంట, ఓర్వలేని తనం పెరిగిపోయాయి. కక్షతో మహానాడును అడ్డుకొనే ప్రయత్నం చేస్తున్నారు’’ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. మంగళవారం ఆయన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ‘‘మహానాడుకు ఎవరూ ఎలాంటి వాహనాలు సమకూర్చవద్దని, ఆర్టీసీ బస్సులు అద్దెకు ఇవ్వవద్దని ప్రభుత్వ పెద్దలు ఆదేశించారు. కొంత మంది అధికారులు డూడూ బసవన్నల మాదిరిగా తలూపుతూ విద్యా సంస్థల యాజమాన్యాలు, ఇతరులకు మహానాడుకు బస్సులు, ఇతర వాహనాలు ఇవ్వవద్దని ఫోన్లు చేస్తున్నారు. బస్సులిస్తే చర్యలు తీసుకొంటామని బెదిరించడానికి రవాణాశాఖ అధికారులు ఎవరు? ఆర్టీసీ బస్సులు అద్దెకు తీసుకొంటామంటే ఇవ్వనంటున్నారు. ప్రైవేటు బస్సులు ఇవ్వడానికి వీల్లేదని విద్యా సంస్థలు, ట్రావెల్స్‌ సంస్ధలను బెదిరిస్తున్నారు. అధికారులు వైసీపీ పాలెగాళ్లా? సీఎం జగన్‌రెడ్డి చెప్పగానే వాహనాలు ఇవ్వడానికి వీలు లేదని హెచ్చరికలు జారీ చేయడం ఏమిటి? దీనిని మేం చూస్తూ ఊరుకోం. ఒంటెత్తు పోకడతో అధికార పార్టీ నేతల సేవలో మునిగి తేలుతున్న అధికారుల చిట్టా తయారు చేస్తున్నాం. వారి భరతం పడతాం. మహానాడుకు రాకుండా అడ్డుకోవాలని చూస్తే టీడీపీ శ్రేణులు, ప్రజలు ప్రతిఘటించడం ఖాయం. వాహనాలు ఇవ్వకుండా అడ్డుకొంటే నడుచుకొంటూ అయినా చీమల దండు మాదిరిగా వస్తారు. మహానాడును విజయవంతం చేస్తారు’’ అని పేర్కొన్నారు. 


ఒంగోలుకు మారిన పొలిట్‌బ్యూరో సమావేశం

ఈ నెల 26న అమరావతిలో నిర్వహించదల్చిన టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశం ఒంగోలుకు మారింది. ఆ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు ఒంగోలులో దీనిని నిర్వహించాలని ఆ పార్టీ నాయకత్వం నిర్ణయించింది. పార్టీ అధినేత చంద్రబాబు మహానాడుకు ఒక రోజు ముందుగానే ఒంగోలు చేరుకొని ఈ సమావేశాన్ని నిర్వహిస్తారు. 27, 28 తేదీల్లో మహానాడు సమావేశాలు అక్కడ జరగనున్నాయి. 


ఓర్వలేకే మహానాడుకు అడ్డంకులు: వర్ల

ఒంగోలు (కార్పొరేషన్‌), మే 24: ప్రజల నుంచి తెలుగుదేశం పార్టీకి లభిస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక మహానాడుకు అడ్డంకులు సృష్టించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ధ్వజమెత్తారు. ఒంగోలు నగర శివారు మండువవారిపాలెంలో జరగనున్న మహానాడు పనులను మంగళవారం సాయంత్రం పరిశీలించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో సభలు, సమావేశాలు నిర్వహించుకునే హక్కు ఏ రాజకీయ పార్టీకైనా ఉందన్నారు.

Updated Date - 2022-05-25T09:07:45+05:30 IST