మహా జోష్‌!

ABN , First Publish Date - 2020-05-31T10:05:47+05:30 IST

మహానాడు తీసుకున్న నిర్ణయాలతో తెలుగుదేశం పార్టీ వర్గాల్లో జోష్‌ పెరిగింది. యువతకు ప్రాధాన్యత ఇవ్వడంతోపాటు బీసీ వర్గాలకు

మహా జోష్‌!

  • మహానాడుతో టీడీపీలో ఉత్సాహం
  • ఇక యువత కు, మహిళలకు ప్రాధాన్యం
  • బీసీలకు మరింత చేరువయ్యే ప్రయత్నం  టీడీపీలో సంస్థాగత మార్పులు
  • జిల్లా అధ్యక్ష పదవికి ఇక కాలంచెల్లు
  • పార్లమెంటరీ వారీ కమిటీల   నియామకానికి కసరత్తు
  •  

 (రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి)

మహానాడు తీసుకున్న నిర్ణయాలతో తెలుగుదేశం పార్టీ వర్గాల్లో జోష్‌ పెరిగింది. యువతకు ప్రాధాన్యత ఇవ్వడంతోపాటు బీసీ వర్గాలకు మరింత చేరువకావడానికి నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇంతవరకూ  యువతకు సరైన ప్రాతినిధ్యం లేదనే విమర్శలకు ఇక చెక్‌ పెట్టినట్టే. ఈసారి యువ నాయకత్వాన్ని పెంచడానికి మహానాడులో ప్రధానంగా నిర్ణయం తీసుకున్నారు.


ఇటీవల దూరమైనట్టు కనిపిస్తున్న బీసీ వర్గాలను మరింత దగ్గరగా తీసుకుని, పార్టీలో వారికి అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. మహిళలకు కూడా సరైన గుర్తింపు ఇవ్వనున్నారు. వాస్తవానికి జిల్లాలో బీసీ వర్గాలకు ప్రాధాన్యం బాగా ఉంది. పార్టీలో కీలక నేతగా ఉన్న యనమల రామకృష్ణుడు, మండలి డిప్యూటీ చైర్మన్‌ రెడ్డిసుబ్రహ్మణ్యం, పిల్లి అనంతలక్ష్మి, వనమాడి కొండబాబు, ఆదిరెడ్డి అప్పారావు, ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని వంటి వారంతా బీసీలే. కానీ జిల్లాలో 50 శాతం వరకూ బీసీలు ఉన్నారు. వారికి మరింత ప్రాధాన్యం కల్పించవలసి ఉంది. అలాగే జిల్లాలో బీసీల్లో అనేక వర్గాలు ఉన్నాయి. ఈసారి నుంచి ఆయా వర్గాలకు ఏదోవిధంగా ప్రాధాన్యత కల్పించడంతోపాటు, చట్టసభలకూ ఎక్కువ సంఖ్యలో బీసీలను పంపించేటట్టు తెలుగుదేశం పార్టీ ఆలోచన చేస్తోంది. అధికార వైసీపీ బీసీలకు ప్రాధాన్యం కల్పించినట్టు చెబుతున్నప్పటికీ, ఇటీవల ఈ వర్గాల నేతలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడంలేదనే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కూడా బీసీలను దగ్గర చేసుకునే ప్రయత్నంలో టీడీపీ నిమగ్నమైంది.


  ఇక పార్టీలో జిల్లా అధ్యక్ష పదవి సంప్రదాయం లేనట్టే. ప్రస్తుతం మాజీ జడ్పీ చైర్మన్‌ నామన రాంబాబు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. కానీ కొంతకాలంగా ఆరోగ్యకారణాల రీత్యా విస్తృతంగా పర్యటించలేని పరిస్థితి ఉంది. ఈ క్రమంలో కొత్త అధ్యక్షుడిని ఎన్నిక చేస్తారంటూ, ఫలానా నేత అధ్యక్షుడు కాబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే తాజా నిర్ణయాల నేపథ్యంలో కొద్దిరోజుల్లో జిల్లాలో మూడు  పార్లమెంటరీ నియోజకవర్గాలకు ముగ్గురు అధ్యక్షులను నియమించే అవకాశం ఉంది. కొత్త జిల్లాలు ఏర్పడితే మూడు పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షులు ఆయా జిల్లాలకు అధ్యక్షులవుతారు. ఈసారి మూడు పార్లమెంటరీ నియోజకవర్గాలకు బీసీ, ఎస్సీ, ఓసీ వర్గాల నుంచి అధ్యక్షులను నియమించే అవకాశం ఉన్నట్టు అప్పుడే చర్చ మొదలైంది. అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గం అధ్యక్ష పదవి ఎస్సీ వర్గాలకు వచ్చే అవకాశమే ఎక్కువ కనిపిస్తోంది.


రాజమహేంద్రవరం, కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గాలకు ఓసీ, బీసీ వర్గాలను నియమించే అవకాశం ఉంది. ఇవన్నీ సంస్థాగత ఎన్నికలు పూర్తయిన తర్వాత  జరుగుతాయి. ఇప్పటికే 55 శాతం సంస్థాగత ఎన్నికలు పూర్తయ్యాయి. గ్రామ కమిటీలు పూర్తయ్యాయి. మండల, అర్బన్‌ కమిటీల నియామకం చురుగ్గా జరుగుతున్న సమయంలో కరోనా వచ్చింది. దాని ప్రభావం తగ్గిన తర్వాత కమిటీలను పూర్తి చేసి, వారి పార్లమెంటరీ కమిటీలను కూడా నియమించనున్నట్టు ఒక ముఖ్య నేత తెలిపారు. స్థానిక ఎన్నికలు ఆలస్యమైతే, ఈలోపు సంస్థాగత ఎన్నికలు పూర్తిచేస్తారు.

Updated Date - 2020-05-31T10:05:47+05:30 IST