వైసీపీ తాబేదార్లూ.. ఇకనైనా బుద్ధి తెచ్చుకోండి

ABN , First Publish Date - 2022-05-30T08:58:02+05:30 IST

‘తెలుగుదేశం పార్టీ మహానాడుపై వైసీపీ తాబేదార్లు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. మహానాడుకు వచ్చిన జనాన్ని చూసి వారు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి’ అని

వైసీపీ తాబేదార్లూ.. ఇకనైనా బుద్ధి తెచ్చుకోండి

మహానాడు సూపర్‌ సక్సెస్‌..

ఇది జగన్‌ ప్రభుత్వంపై తిరుగుబాటే..

పొత్తులపై చర్చకు సమయం కాదు: అచ్చెన్నాయుడు స్పష్టీకరణ


ఒంగోలు (కార్పొరేషన్‌), మే 29: ‘తెలుగుదేశం పార్టీ మహానాడుపై వైసీపీ తాబేదార్లు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. మహానాడుకు వచ్చిన జనాన్ని చూసి వారు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి’ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు హితవు పలికారు. ఆదివారమిక్కడ పార్టీ ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రెండ్రోజులపాటు మండువవారి పాలెంలో నిర్వహించిన మహానాడు సూపర్‌ సక్సెస్‌ అయిందన్నారు. దీనిని ఇంతగా విజయవంతం చేసిన నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ‘ఈ మహానాడు సువర్ణాక్షరాలతో చరిత్రలో నిలిచిపోతుంది. జనాల స్పందన చూసి ఒళ్లు పులకించిపోయింది. మండుటెండను సైతం లెక్కచేయకుండా 12 గంటలపాటు నిల్చొని మరీ విజయవంతం చేశారంటే.. ఇది ప్రభుత్వంపై ప్రజల తిరుగుబాటుగా భావించాలి. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ టీడీపీ ధన్యవాదాలు. ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా మహానాడు నిర్వహణకు భూములు ఇచ్చిన మండువవారిపాలెం గ్రామ రైతులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు.


సభకు వచ్చిన ప్రజా స్పందన వైసీపీ పతనానికి నాంది’ అని అచ్చెన్న చెప్పారు.  ప్రజలు మళ్లీ చంద్రబాబు ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతారా అని ఎదురు చూస్తున్నారని అన్నారు. జాతీయ రాజకీయాలు, రాష్ట్రంలో పొత్తులకు సంబంధించిన విషయాలపై చర్చించేందుకు ఇది సమయం కాదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. సమావేశంలో పర్చూరు, కొండపి, అద్దంకి ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, డాక్టర్‌ డోలా బాల వీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవికుమార్‌, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల జనార్దన్‌, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామచర్ల సత్య, ఒంగోలు పార్లమెంటరీ అధ్యక్షుడు నూకసాని బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-30T08:58:02+05:30 IST