మహానాడు వేదిక మార్పు..!

ABN , First Publish Date - 2022-05-15T08:23:17+05:30 IST

మహానాడు వేదిక మార్పు..!

మహానాడు వేదిక మార్పు..!

గుళ్లాపల్లి మహి ఆగ్రోస్‌ను ఓకే చేసిన ముఖ్య నాయకులు

అచ్చెన్న పరిశీలన తరువాత తుది నిర్ణయం 


ఒంగోలు, మే 14(ఆంధ్రజ్యోతి): అకాల వర్షం వచ్చినా ఇబ్బంది లేకుండా ఉండేలా మహానాడు వేదికను గుళ్లాపల్లి వద్ద గల మహి ఆగ్రోస్‌ ఆవరణలోకి మార్చాలని టీడీపీ నాయకులు ప్రాథమికంగా నిర్ణయించారు. శనివారం పలువురు ముఖ్య నాయకులు, వేదిక నిర్మాణ పనులు చేసే సంస్థ ప్రతినిధులు, ఆ స్థలాన్ని పరిశీలించిన తర్వాత ఈ నిర్ణయానికి వచ్చారు. ఒంగోలు బైపా్‌సలోని ఖాళీ స్థలంలో నిర్వహించాలని తొలుత నిర్ణయించుకోవటం, వర్షం వస్తే ప్రత్యామ్నాయంగా మినీ స్టేడియంను అధికారికంగా బుక్‌ చేసుకోవడానికి ప్రయత్నించడం, దానిని లీజుకిచ్చేందుకు ప్రభుత్వం నిరాకరించటం తెలిసిందే. దీంతో ప్రత్యామ్నాయంగా గుళ్లాపల్లి వద్ద ఉన్న మహి ఆగ్రోస్‌ స్థలాన్ని శనివారం పరిశీలించారు. దామచర్ల కుటుంబానికి భాగస్వామ్యం ఉన్న ఈ కంపెనీ ప్రస్తుతం ఖాళీగా ఉంది. తొలిరోజు 10 వేల మంది ప్రతినిధులతో నిర్వహించే కార్యక్రమానికి అనువైన గోడౌన్‌ అందులో ఉంది. ఆ పక్కనే సుమారు 25 ఎకరాలకు పైగా స్థలం ఖాళీగా ఉంది. దానిని చదును చేసి బహిరంగ సభ నిర్వహించుకోవచ్చని భావించారు. ఒంగోలులో బస సౌకర్యం తక్కువగా ఉన్నందున రాత్రికి గుంటూరు, విజయవాడ వెళ్లేవారిని కూడా దృష్టిలో ఉంచుకుని మొత్తం మహానాడు కార్యక్రమాన్ని అక్కడే నిర్వహిస్తే అనువుగా ఉంటుందని భావిస్తున్నారు. అయితే బుధవారం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వచ్చి చూసి అధినేత చంద్రబాబుతో మాట్లాడిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటారు.  


అమెరికాలో 20, 21న టీడీపీ మహానాడు

అమరావతి, మే 14 (ఆంధ్రజ్యోతి): అమెరికాలోని బోస్టన్‌ బెస్ట్‌ వెస్ట్రన్‌ రాయల్‌ ప్లాజా హోటల్‌లో ఎన్నారై టీడీపీ, యూఎ్‌సఏ ఆధ్వర్యంలో ఈనెల 20, 21 తేదీల్లో మహానాడును నిర్వహించనున్నట్లు ఎన్నారై టీడీపీ యూఎ్‌సఏ సమన్వయకర్త జయరామ్‌ కోమటి శనివారం తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌ లైవ్‌లో ప్రసారం చేస్తున్నామన్నారు.  

Updated Date - 2022-05-15T08:23:17+05:30 IST