మినీ మహానాడు.. వాయిదా

ABN , First Publish Date - 2022-10-08T05:36:58+05:30 IST

నరసరావుపేటలో 12న నిర్వహించ తలపెట్టిన టీడీపీ పల్నాడు జిల్లా మినీమహానాడు వాయిదా పడింది.

మినీ మహానాడు.. వాయిదా
మహానాడు ప్రాంగణాన్ని పరిశీలిస్తున్న జీవీ, అరవిందబాబు, జూలకంటి బ్రహ్మారెడ్డి, గోనుగుంట్ల

ఏర్పాట్లకు ఆటంకంగా వాతావరణం

వర్షాలతో ప్రాంగణం బురదమయం 

12, 13న కార్యక్రమాలు తాత్కాలికంగా వాయిదా

వాతావరణశాఖ వాన హెచ్చరికలతో నేతల నిర్ణయం  

ఈ నెలఖరులోగా నిర్వహించాలని అధిష్ఠానం యోచన 

నరసరావుపేట, అక్టోబరు 7: నరసరావుపేటలో 12న నిర్వహించ తలపెట్టిన టీడీపీ పల్నాడు జిల్లా మినీమహానాడు వాయిదా పడింది. మహానాడు కార్యక్రమం జరిగే 12వ తేదీన కూడా వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో పార్టీ అధిష్ఠానం తాత్కాలికంగా వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. మినీ మహానాడుతో పాటు 13న చిలకలూరిపేటలో నిర్వహించాల్సిన నియోజకవర్గాల సమీక్షను కూడా వాయిదా వేశారు. రెండు రోజులు కురిసిన వర్షాలకు మహానాడు ప్రాంగణం బురదమయంగా మారింది. వర్షాలు, బురదతో ఏర్పాట్లకు ఆటంకంగా మారాయి.  ప్రాంగణాన్ని పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు, నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ చదలవాడ అరవిందబాబు, మాచర్ల ఇన్‌చార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి తదితరులు శుక్రవారం పరిశీలించారు. వర్షాలు కురిస్తే స్థలంలో మహానాడు నిర్వహించలేమని వారు అధిష్ఠానం దృష్టికి తీసుకువెళ్లారు. ఈ పరిస్థితుల్లో నియోజకవర్గ ఇన్‌చార్జిలతో రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మహానాడు నిర్వహణపై చర్చించారు. 11, 12 తేదీల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణశాఖ హెచ్చరికలపై వారితో చర్చించారు. సభకు లక్ష మంది వస్తారని అంచనా వేశారు. ఈ పరిస్థితుల్లో వర్షాలు కురిస్తే జనం రావడానికి ఇబ్బందికరంగా ఉంటుందని నేతలు తెలిపారు. ఈ నేపథ్యంలో మహానాడుతో పాటు నియోజకవర్గాల సమీక్ష కార్యక్రమాలను తాత్కాలికంగా వాయిదా వేయాలని  నిర్ణయం తీసుకున్నారు. ఈ అంశాన్ని జీవీ ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, డాక్టర్‌ అరవిందబాబు శుక్రవారం ధృవీకరించారు. మహానాడును తిరిగి ఎప్పుడు నిర్వహించే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. వాతావరణం అనుకూలంగా ఉన్న తేదీల్లో మహానాడు నిర్వహించాలని నేతలు భావిస్తున్నారు. ఈ నెలాఖరులోగా మహానాడు నిర్వహించాలని పార్టీ అధిష్ఠానం యోచిస్తున్నది. ఈ మేరకు నియోజకవర్గాల ఇన్‌చార్జిలు సిద్ధంగా ఉండాలని అధిష్ఠానం ఆదేశించింది.   మహానాడు వాయిదాతో పార్టీ శ్రేణులు నిరుత్సాహానికి లోనయ్యాయి.  


Updated Date - 2022-10-08T05:36:58+05:30 IST