మహానాడుకు అడ్డంకులు సృష్టిస్తే ఖబడ్దార్‌

ABN , First Publish Date - 2022-05-24T08:28:34+05:30 IST

మహానాడు సమావేశాలకు అడ్డంకులు సృష్టించాలని చూస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు హెచ్చరించారు

మహానాడుకు అడ్డంకులు సృష్టిస్తే ఖబడ్దార్‌

అధికారులు అతి చేస్తే గుర్తు పెట్టుకొంటాం... అధినేత చంద్రబాబు హెచ్చరిక

ప్రభుత్వ వ్యతిరేకతతో మహానాడుకు ఘన స్పందన

తెలుగుదేశం పార్టీ నేతలతో ఏర్పాట్లపై సమీక్ష


అమరావతి, మే 23 (ఆంధ్రజ్యోతి): మహానాడు సమావేశాలకు అడ్డంకులు సృష్టించాలని చూస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. ఈ నెల 27, 28 తేదీల్లో ఒంగోలులో జరగనున్న ఈ సమావేశాల ఏర్పాట్లపై సోమవారం ఆయన సంబంధిత కమిటీలతో సమీక్ష నిర్వహించారు. మహానాడు సందర్భంగా నిర్వహి స్తున్న బహిరంగ సభ కోసం చేసే జన సమీకరణకు అధికార పార్టీ నేతలు ఆటంకాలు సృష్టిస్తున్నారని, రవాణా శాఖ అధికారులను అడ్డుపెట్టుకొని ఎవరూ వాహనాలు ఇవ్వవద్దని ఒత్తిడి తెస్తున్నారని కొందరు పార్టీ నేతలు ఈ సందర్భంగా ఆయనతో చెప్పారు. ‘‘అధికారులేమీ అధికార పార్టీ నేతల ప్రైవేటు ఉద్యోగులు కాదు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా సభలు, సమావేశాలు పెట్టుకొనే హక్కుంది. జగన్‌ రెడ్డి ఏడాదిపాటు పాదయాత్ర చేశారు. అప్పుడు మనం ఇలాగే చేశామా? అనవసరంగా మనల్ని రెచ్చగొడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. వాళ్ల బస్సు యాత్రలను మన శ్రేణులు అడ్డుకోలేవా? అదే గట్టిగా చెప్పండి. అధికారులు ఎవరైనా అతి చేస్తే వారిని గుర్తు పెట్టుకొంటాం. అధికారులైనా... ప్రభుత్వంలోని వారైనా భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోక తప్పదు’’ అని ఆయన అన్నారు. అయితే అతి చేయడం లేదా అసలు పట్టించుకోకపోవడం పోలీసు శాఖలో చూస్తున్నానని, తన రాయలసీమ పర్యటనలో కనీసం బందోబస్తు కూడా చేయకుండా గాలికి వదిలేశారని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వం అడ్డంకులు సృష్టించినంత మాత్రాన మహానాడు ఆగదని, దానిని ఎవరూ ఆపలేరని ఆయన అన్నారు. అణిచివేతకు గురవుతున్న అనేక వర్గాల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెల్లుబుకుతోందని, మహానాడు సమావేశాల్లో ఈ వ్యతిరేకత ప్రభంజనం కనిపించబోతోందని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘మహానాడు తెలుగుదేశం పార్టీ పండుగ అయినా ఈసారి ప్రజల నుంచి భారీ మద్దతు లభిస్తోంది. మహానాడుకు సౌకర్యాల కల్పన, వేదిక నిర్మాణం, భోజనాలు, ఇతర వసతులు సమకూర్చడంలో భాగస్వాములు అయ్యేందుకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు.


ప్రజల్లో వ్యక్తమవుతున్న స్పందన రాష్ట్రంలో రాజకీయ ముఖ చిత్రం మారబోతోందనడానికి ప్రత్యక్ష సూచిక’’ అని ఆయన అన్నారు. మహానాడు నిర్వహణకు పోలీసులు సహకరించే అవకాశం కనిపించడం లేదని, పార్టీ కార్యకర్తల సహకారంతో కార్యక్రమం పటిష్ఠంగా నిర్వహించుకోవాలని ఆయన సూచించారు. దీని కోసం పార్టీ వలంటీర్ల వ్యవస్ధను వినియోగించుకోవాలని ఆయన నాయకులను ఆదేశించారు. పార్టీ 40 ఏళ్ల ప్రస్ధానాన్ని చాటేలా మహానాడు ఉండాలని, అదే సమయంలో భవిష్యత్‌ ప్రయాణంపై దిశా నిర్దేశం చేసేలా కార్యక్రమం నిర్వహించాలని ఆయన పేర్కొన్నారు. కమిటీల వారీగా మహానాడు ఏర్పాట్లపై ఆయన సమీక్ష జరిపి పలు సూచనలు చేశారు. మొదటి రోజు జరిగే ప్రతినిధుల సభకు పన్నెండువేల మందికి ఆహ్వానాలు పంపుతున్నట్లు ఆహ్వాన కమిటీ తెలిపింది. రెండో రోజు అదే ప్రాంగణంలో బహిరంగ సభను నిర్వహిస్తున్నామని, దానికి ప్రజల హాజరు లక్షల్లో ఉంటుందని ఆశిస్తున్నామని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వివరించారు. మహానాడులో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పదిహేను తీర్మానాలు ఉంటాయని తీర్మానాల కమిటీకి నేతృత్వం వహిస్తున్న టీడీపీ సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు తెలిపారు. తాజా రాజకీయ పరిణామాలతో వాటిని రూపొందిస్తున్నట్లు ఆయన వివరించారు. 

Updated Date - 2022-05-24T08:28:34+05:30 IST