మహానాడు తోరణాలు పీకేశారు

ABN , First Publish Date - 2022-05-26T09:27:06+05:30 IST

తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడును అడ్డుకునేందుకు ప్రభుత్వం చేస్తున్న కుట్రలకు అధికారులు దాసోహం అంటున్నారు.

మహానాడు తోరణాలు పీకేశారు

  • టీడీపీ జెండాలు, ఫ్లెక్సీలు కూడా
  • ఒంగోలులో అధికారుల అత్యుత్సాహం
  • టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడి ఆగ్రహం


ఒంగోలు (కార్పొరేషన్‌), మే 25: తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడును అడ్డుకునేందుకు ప్రభుత్వం చేస్తున్న కుట్రలకు అధికారులు దాసోహం అంటున్నారు. ఈనెల 27, 28 తేదీల్లో ప్రకాశం జిల్లా మండువవారిపాలెంలో   మహానాడు నిర్వహించనున్నారు. దీని కోసం ఒంగోలు నగరాన్ని పసుపు తోరణాలు, జెండాలు, ఫ్లెక్సీలతో అందంగా ముస్తాబు చేశారు. అయితే, అనుమతులు లేవంటూ వాటిని మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు బుధవారం తొలగించారు. స్థానిక ప్రకాశం భవనం ఎదుట, కొప్పోలు రోడ్‌లో ఫ్లెక్సీలు తొలగించడంతో తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారపార్టీ కార్యక్రమాలకు ఎలాంటి అనుమతులు లేకున్నా  ఇష్టారాజ్యంగా వదిలేసి, కళ్లు మూసుకున్న కార్పొరేషన్‌ అధికారులు టీడీపీ మహానాడుకు మాత్రం ఉద్దేశపూర్వకంగా అడ్డంకులు సృష్టిస్తున్నారని తప్పుపడుతున్నారు. దీనిపై టీడీపీ శ్రేణులు మున్సిపల్‌ కమిషనర్‌ ఎం.వెంకటేశ్వరరావుతో మాట్లాడగా, కలెక్టర్‌ ఆదేశాల మేరకే తొలగించామని సమాధానమిచ్చారు.


నేనే వచ్చి తోరణాలు కడతా: అచ్చెన్న.. 

మహానాడుకు ప్రభుత్వం, అధికారులు కల్పిస్తున్న అడ్డంకులపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘అవసరమైతే నేనే రోడ్డుపైకి వచ్చి తోరణాలు, జెండాలు కడతా. ఎలా అడ్డుకుంటారో చూస్తా’’ అన్నారు. ఎన్టీఆర్‌ శత జయంతి వేడుకల ప్రారంభోత్సవం, మహానాడు కార్యక్రమాల ఏర్పాట్లను పరిశీలించేందుకు ఆయన బుధవారం ఒంగోలు వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ‘‘మహానాడు జరగకుండా చేసేందుకు ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తాం. మహానాడు కోసం మొదట ఒంగోలు మినీస్టేడియం ఇవ్వాలని కలెక్టర్‌ను కోరాం. అందుకు డబ్బులు కూడా చెల్లించాం. అయినా..అనుమతులు ఇవ్వకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. కలెక్టర్‌ను, కార్పొరేషన్‌ కమిషనర్‌ను గుర్తుపెట్టుకుంటాం. ప్రైవేటు, ఆర్టీసీ బస్సులు ఇవ్వకుండా చేస్తే మహానాడు ఆగుతుందనుకోవడం జగన్‌రెడ్డి అవివేకం. అవసరమైతే బైక్‌లు, ట్రాక్టర్లు, ఎడ్లబండ్లు, ఇంకా కాదంటే నడిచి అయినా లక్షలాది మంది మహానాడుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. వైసీపీ కుట్రలకు తెలుగుదేశం పార్టీ భయపడదు’’ అని తేల్చిచెప్పారు. మహానాడు సన్నాహాల్లో భాగంగా గురువారం విజయవాడ నుంచి ఒంగోలుకు భారీ బైక్‌ ర్యాలీ నిర్వహిస్తామని చెప్పారు.

Updated Date - 2022-05-26T09:27:06+05:30 IST