జోష్‌ నింపిన మహానాడు

ABN , First Publish Date - 2020-05-29T09:20:22+05:30 IST

వర్చ్యువల్‌ మహానాడు జిల్లా కార్యకర్తల్లో జోష్‌ నింపింది. జూమ్‌ యాప్‌లో నాయకులు, కార్యకర్తలు మహానాడును వీక్షించి నాయకుల ప్రసంగాలను విని ఉత్తేజితులయ్యారు.

జోష్‌ నింపిన మహానాడు

యాప్‌లో వీక్షించిన నాయకులు


గుంటూరు, పిడుగురాళ్ల, మే 28(ఆంధ్రజ్యోతి): వర్చ్యువల్‌ మహానాడు జిల్లా కార్యకర్తల్లో జోష్‌ నింపింది. జూమ్‌ యాప్‌లో నాయకులు, కార్యకర్తలు మహానాడును వీక్షించి నాయకుల ప్రసంగాలను విని ఉత్తేజితులయ్యారు.  గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మహానాడు రెండవ రోజు కార్యక్రమాన్ని జూమ్‌ య్యాప్‌ ద్వారా తిలకించారు. గుంటూరులోని ఆయన నివాసంలో ఎన్టీఆర్‌ 97వ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్‌ స్థాపించిన తెలుగుదేశంతో పేదవాడికి పట్టెడు అన్నం, మహిళలకు ఆస్థిలో సమానహక్కు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రాజకీయంగా రిజర్వేషన్లు ఉన్నస్థానాలు కేటాయింపు చేయటం జరిగిందన్నారు.


అన్ని సామాజిక వర్గాలకు ప్రతి బడ్జెట్‌లో పెద్దపీట వేస్తూ కొనసాగిన సంక్షేమ పథకాలతో ఎంతో మందికి మేలు చేకూరిందని ఆయన గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలమని ఆయన తెలిపారు. రానున్న రోజుల్లో ప్రతి కార్యకర్త సైనికుడిలాగా పనిచేసి, పార్టీ అధికారంలోకి వచ్చేందుకు పోరాటం చేయాలన్నారు. మహానాడు జూమ్‌ య్యాప్‌ ద్వారా యరపతినేని తనయుడు నిఖిల్‌ కూడా పాల్గొన్నారు.


 అమరావతిపై తప్పుడు ప్రచారం చేశారు..

 అమరావతిపై ఒకటికి పదిసార్లు అబద్ధాలను ప్రచారం చేసి రాష్ట్రాన్ని నాశనం చేశారని మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌ కుమార్‌ మండిపడ్డారు. మహానాడులో గురువారం ఆయన రాజధాని అమరావతిపై తీర్మానం ప్రవేశపెట్టారు. రైతుల భాగస్వామ్యంతో రాజధాని నిర్మాణానికి శ్రీకారం చుట్టి ప్రపంచానికే ఆదర్శంగా నిలిచామన్నారు. అయితే అమరావతికి రూ.లక్షకోట్లు ఖర్చు అవుతుందని వైసీపీ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని విమర్శించారు. కులం, మతం అంటూ ప్రజల్ని నమ్మించి అధికారంలోకి వచ్చి అభివృద్ధి చేతకాక విచ్చిన్నం చేస్తున్నారని వైసీపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.


నాడు సైబరాబాద్‌ నిర్మాణ సమయంలోనూ ఇదే విధమైన ఆరోపణలు చేశారని.. కానీ ఇప్పుడు సైబరాబాద్‌ వల్ల కలిగిన ఉపాధి, ఉద్యోగాలు, ఆదాయం చూడండి అంటూ సవాలు విసిరారు. అమరావతికి భూములిచ్చిన రైతులు 162 రోజులుగా ఆందోళన చేస్తున్నారని వారికి టీడీపీ పూర్తిగా అండగా ఉంటుందని తెలిపారు. 

Updated Date - 2020-05-29T09:20:22+05:30 IST