మహానాడు అక్కడే!

ABN , First Publish Date - 2022-05-17T06:39:04+05:30 IST

తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా జరుపుకొనే మహానాడు కార్యక్రమాన్ని తొలుత అనుకున్నట్లుగా ఒంగోలుకు సమీపంలో గుంటూరు రోడ్డులోనే నిర్వహించాలని నిర్ణయించారు.

మహానాడు అక్కడే!

మినీస్టేడియం రద్దుపై ఫైట్‌ చేయండి 

టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశం

రేపు భూమిపూజ కార్యక్రమం 

పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు రాక 

(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)

తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా జరుపుకొనే మహానాడు కార్యక్రమాన్ని తొలుత అనుకున్నట్లుగా ఒంగోలుకు సమీపంలో గుంటూరు రోడ్డులోనే నిర్వహించాలని నిర్ణయించారు. ఆ మేరకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇచ్చిన సూచనలతో అక్కడ ఏర్పాట్లు చేసేందుకు బుధవారం భూమిపూజ నిర్వహించనున్నారు. ఆ కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు రానున్నారు. సోమవారం చంద్రబాబునాయుడు మహానాడు నిర్వహణ కోసం నియమించిన పదహారు కమిటీల సభ్యులతో నిర్వహించిన జూమ్‌ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒంగోలు నుంచి గుంటూరు వెళ్లే రోడ్డులో బృందావనం, విష్ణుప్రియ కల్యాణ మండపాలకు వెనుక ఉన్న పొలంలో మహానాడు నిర్వహణకు నిర్ణయించిన విషయం తెలిసిందే. వర్షం వస్తే మినీస్టేడియంలో నిర్వహించేందుకు అనుమతి కోరటం ప్రభుత్వం నిరాకరించటం, తదనుగుణంగా గుండ్లాపల్లి వద్ద ప్రత్యామ్నాయ స్థలం చూడటం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం అటు రాష్ట్ర, ఇటు జిల్లాకు చెందిన ముఖ్య నాయకులతో జూమ్‌ సమావేశంలో సమీక్ష చేసిన చంద్రబాబునాయుడు తుదినిర్ణయం తీసుకున్నారు. తొలుత అనుకున్న చోటనే మహానాడు నిర్వహించాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. 


మినీస్టేడియం కోసం పోరాటం

వర్షం వస్తే ఇబ్బందిలేకుండా ప్రత్యా మ్నాయంగా మినీస్టేడియం కోసం చేసిన ప్రయత్నాన్ని కొనసాగించాలని, అవసర మైతే అన్నిరకాలుగా ఫైట్‌ చేయాలని ఆయన సూచించారు. మినీస్టేడియంలో కార్యక్రమ నిర్వహణకు అనుమతి ఇవ్వాలని కలెక్టర్‌కు ఆ పార్టీ నాయకుడు దామచర్ల జనార్దన్‌ లేఖ ఇవ్వటం, అనంతరం నాలుగు రోజులకు ప్రభుత్వం నిర్ణయించిన లీజు మొత్తాన్ని చెల్లించటం కూడా జరిగింది. దీనిపై ప్రభుత్వ స్థాయిలో తర్జనభర్జనల అనంతరం లీజు కి ఇవ్వటానికి నిరాకరించారు.  అక్కడ జరగాల్సిన వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు వచ్చేనెల 2వరకు జరుగుతాయని కారణంగా చూపారు. ఇది కావాలని చేసిన పనే. అలాంటప్పుడు లీజు మొత్తం కింద డబ్బులు ఎందుకు కట్టించు కున్నారని చంద్రబాబు ప్రశ్నించినట్లు తెలిసింది. తదనుగుణంగా డబ్బు కట్టించుకున్నందున మినీస్టేడియం ఇవ్వాలని ప్రభుత్వంపై ఫైట్‌ చేయాలని, అవసరమైతే న్యాయపరంగా కూడా ముందుకుపోవాలని చంద్రబాబు సూచించారు.  .


రేపటి నుంచి ఏర్పాట్లు ప్రారంభం 

బృందావనం కల్యాణ మండపం వెనుక స్థలంలో ఏర్పాట్లు చేసేందుకు బుధవారం ఉదయం 11.20 నిమిషాలకు శాస్త్రోక్తంగా భూమిపూజ  నిర్వహించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు హాజరుకానున్నారు. సోమవారం చంద్రబాబు నిర్వహించిన జూమ్‌ సమావేశానికి అచ్చెన్నాయుడు, ఇతర రాష్ట్ర నాయకులతోపాటు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు రవికుమార్‌, సాంబశివరావు, స్వామి, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల జనార్దన్‌, ఇన్‌చార్జ్‌లు ఉగ్రనరసింహారెడ్డి, పమిడి రమేష్‌, అశోక్‌రెడ్డి, ఎరిక్షన్‌బాబు, కొండయ్యయాదవ్‌, పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామచర్ల సత్య తదితరులు పాల్గొన్నారు. 


ఎన్ని అడ్డంకులు సృష్టించినా మహానాడు నిర్వహిస్తాం 

మాజీ ఎమ్మెల్యే దామచర్ల 

 ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా మహానాడును దిగ్విజయంగా నిర్వహించి తీరతామని మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ స్పష్టం చేశారు. మహానాడుకు ప్రత్యామ్నాయ వేదికగా ఒంగోలులోని మినీస్టేడియం కోసం గతనెల 25న కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశామన్నారు. స్టేడియంలో ఏర్పాటు చేసిన సమ్మర్‌ క్రీడా తరగతులు ఈనెల 24తో ముగుస్తున్నప్పటికీ శిక్షణ తరగతులను 30వ తేదీ వరకు పొడిగిస్తూ తమకు వేదిక ఇవ్వకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారన్నారు. ఇది ప్రభుత్వ కుట్ర అని విమర్శించారు. 


Updated Date - 2022-05-17T06:39:04+05:30 IST