పితృ రుణం తీర్చే పక్షమిది

ABN , First Publish Date - 2020-09-11T05:30:00+05:30 IST

మానవ జీవితం దైవ ప్రసాదమైతే, మానవ విజ్ఞానం ఋషుల అనుగ్రహమని అనాది విశ్వాసం. దైవం, ఋషులతో పాటు జన్మనిచ్చిన తల్లితండ్రులకు కూడా మనిషి రుణపడి ఉంటాడు. ఈ మూడు రుణాలనూ తీర్చకొనే అవకాశాన్ని భాద్రపద మాసం అందిస్తుంది...

పితృ రుణం తీర్చే పక్షమిది

  • 17న మహాలయ అమావాస్య

    కొన్ని వర్ణాలవారికి అబ్దికాల లాంటి విధులు ఉన్నాయి. మరికొన్ని వర్ణాల వారికి ఉండవు. కానీ అన్ని వర్ణాల వారూ తమ పెద్దలను స్మరిస్తూ మహాలయ పక్షంలో పిండ ప్రదానాలు చేస్తారు. తర్పణాలు వదులుతారు. మరో విశేషం ఏమిటంటే, సొంత కుటుంబానికి చెందిన పెద్దలతో పాటు స్వర్గస్తులైన బంధు మిత్రులకు కూడా మహాలయ పక్షంలో పిండ ప్రదాన, తర్పణాది విధులు నిర్వర్తించవచ్చు. 


      మానవ జీవితం దైవ ప్రసాదమైతే, మానవ విజ్ఞానం ఋషుల అనుగ్రహమని అనాది విశ్వాసం. దైవం, ఋషులతో పాటు జన్మనిచ్చిన తల్లితండ్రులకు కూడా మనిషి రుణపడి ఉంటాడు. ఈ మూడు రుణాలనూ తీర్చకొనే అవకాశాన్ని భాద్రపద మాసం అందిస్తుంది. అన్ని వర్ణాల వారు తమ పూర్వీకులను తలచుకోవడానికి అవకాశం కల్పించేది ఈ మాసంలోని ద్వితీయార్ధమైన మహాలయ పక్షం. దానిలో అత్యంత విశిష్టమైనది ‘మహాలయ అమావాస్య’!

      ఆది పూజ్యుడు గణపతిని కొలిచే వినాయక చవితి మొదలుకొని భాద్రపద మాసంలోని మొదటి పక్షం దైవ కార్యాలకు, వినాయక చవితి మరుసటి రోజైన ఋషి పంచమిని ఋషుల రుణం తీర్చుకోవడానికి పూర్వులు నిర్దేశించారు. అన్నిటికన్నా ముఖ్యమైనది కన్నవారి రుణం తీర్చుకోవడం. దాని కోసం భాద్రపద మాస కృష్ణ పక్షాన్ని నిర్ణయించారు. అదే ‘మహాలయ పక్షం’. 


      • అమావస్యే దినే ప్రాప్తే గృహద్వారాయే సమాశ్రితః
      • వాయుభూతాః ప్రవాంఛతి శ్రాద్ధాం పితృగణానృణామ్‌ 

      ప్రతి అమావాస్యకూ వాయువు రూపంలో పితృ దేవతలు తమ వారసుల ఇళ్లకు వస్తారనీ, వారు నిర్వహించే శ్రార్ధ కర్మలకూ, అన్నదానాలకూ సంతృప్తులై, ఆయురారోగ్యాలతో, సర్వ సంపదలతో, పిల్లాపాపలతో వర్ధిల్లమని మనసారా ఆశీస్సులు అందించి వెళ్తారనీ గరుడ పురాణం చెబుతోంది. ప్రతి అమావాస్యకూ ఇలా చేయడం సాధ్యం కానివారు మహాలయ పక్షంలోనైనా పితృ కర్మలు నిర్వర్తించాలనేది శాస్త్రవచనం. 


      • కుర్తుం మహాలయ శ్రాద్ధం యదిశక్తిర్నవిద్యతే 
      • యాచిత్వాపి నరః కుర్యాత్‌ పితౄణాం తన్మహాలయం 


      ‘మహాలయ పక్షంలో శ్రార్థకర్మలు తప్పనిసరిగా నిర్వహించాలి. దానికి శక్తి, స్థోమత లేనప్పుడు యాచించైనా చేయాలి’ అని పూర్వులు నిర్దేశించారు. 

      భాద్రపద శుక్ల పక్ష పాడ్యమి నుంచి అమావాస్య వరకూ... పదిహేను రోజులను ‘మహాలయ పక్షం’ లేదా ‘పితృ పక్షం’ అంటారు. ఈ పక్షంలో చివరి రోజైన అమావాస్యను ‘మహాలయ అమావాస్య’ అంటారు. ఈ పదిహేను రోజులూ పితృ కర్మలకు అత్యంత పవిత్ర దినాలు. ఈ రోజుల్లో తల్లితండ్రుల తిధి రోజున, లేదంటే మహాలయ అమావాస్య రోజున తర్పణాలు, పిండ ప్రదానాలు చేయాలి. దీనివల్ల వంశాభివృద్ధి కలుగుతుందనీ, పితృ దేవతల పట్ల తెలిసో తెలియకో చేసిన అపరాధాలకు క్షమాపణ లభిస్తుందనీ, వారి ఆశీస్సులతో సర్వ శుభాలూ చేకూరుతాయనీ పురాణాలు చెబుతున్నాయి. 

      కొన్ని వర్ణాలవారికి అబ్దికాల లాంటి విధులు ఉన్నాయి. మరికొన్ని వర్ణాల వారికి ఉండవు. కానీ అన్ని వర్ణాల వారూ తమ పెద్దలను స్మరిస్తూ మహాలయ పక్షంలో పిండ ప్రదానాలు చేస్తారు. తర్పణాలు వదులుతారు. మరో విశేషం ఏమిటంటే, సొంత కుటుంబానికి చెందిన పెద్దలతో పాటు స్వర్గస్తులైన బంధు మిత్రులకు కూడా మహాలయ పక్షంలో పిండ ప్రదాన, తర్పణాది విధులు నిర్వర్తించవచ్చు. అన్న దానాలతో పాటు బియ్యం తదితర సరుకులు, ధన వస్తు రూపంలో దానాలు చేయడం వల్ల శ్రేయస్సు కలుగుతుందన్నది పెద్దల మాట.

      దేవుడిని పూజించడం కన్నా తల్లితండ్రులనూ, పెద్దలనూ పూజించడం గొప్పదని ధర్మరాజుకు భీష్ముడు చెప్పిన సందర్భం ఒకటి ఉంది. దీనివల్ల పితృ దేవతలకు సంతృప్తి కలుగుతుందనీ, దేవతలు కూడా ఆనందిస్తారనీ, దైవ పూజ పరిపూర్ణం కావాలంటే పితృ పూజ చేయాల్సిందేననీ భీష్ముడు పేర్కొన్నాడు. పితృ కార్యాలను ప్రతి మాసంలో అమావాస్యనాడు నిర్వహిస్తే ఏడాదంతా వాటిని జరిపిన ఫలం చేకూరుతుందని తెలిపాడు. మహాలయ పక్షంలో ఈ పితృ యజ్ఞాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయో తెలిపే ఒక కథ ఉంది. మహా భారత యుద్ధంలో మరణించిన కర్ణుడు స్వర్గానికి ప్రయాణిస్తూండగా, అతనికి ఆకలి దప్పులు కలిగాయి. దారిలో పండ్లనూ, నీటినీ తీసుకుందామంటే అవి బంగారమైపోయాయి. తన జన్మకారకుడైన సూర్యుణ్ణి కర్ణుడు ప్రార్థించగా, సూర్యుడు ప్రత్యక్షమై ‘‘ఎన్ని దానాలు చేసినా అన్నదానం చేయకపోవడం వల్లనే ఈ పరిస్థితి ఎదురైంది. కాబట్టి అన్నదానం చెయ్యి’’ అని చెబుతాడు. ఆ ప్రకారం కర్ణుడు భూమిపైకి తిరిగి వచ్చి, పదిహేను రోజుల పాటు అన్నదానాలూ, పితృ కర్మలూ ఆచరించి స్వర్గానికి చేరుకున్నాడు. ఆ పదిహేను రోజులే ‘మహాలయ పక్షం’గా స్థిరపడ్డాయి. ఈ పక్షంలో వారసులు విడిచిపెట్టే తర్పణాలు అతని పూర్వులైన పితృ దేవతల ఆకలినీ, దాహాన్నీ తీరుస్తాయనీ, వారు సంతృప్తి చెందితే వారసులకు ఉన్నతి కలుగుతుందనీ శాస్త్రాలు చెబుతున్నాయి.







      Updated Date - 2020-09-11T05:30:00+05:30 IST