మహాధర్నా సక్సెస్‌

ABN , First Publish Date - 2022-01-26T04:23:49+05:30 IST

మహాధర్నా సక్సెస్‌

మహాధర్నా సక్సెస్‌
కలెక్టరేట్‌ వద్ద బైఠాయించిన ఉద్యోగులు

కదంతొక్కిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు

కలెక్టరేట్‌ ఎదుట నిరసన కార్యక్రమాలు

పీఆర్సీ చీకటి జీవోలు రద్దు చేయాలని డిమాండ్‌

గుజరాతీపేట, జనవరి 25: ఉపాధ్యాయ, ఉద్యోగులు గర్జించారు. పీఆర్సీ చీకటి జీవోలను రద్దు చేయాలని నినదించారు. పీఆర్సీ విషయంలో ప్రభుత్వం అవలంభిస్తున్న మొండి వైఖరికి నిరసనగా సాధన సమితి ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్‌ వద్ద ఉద్యోగులు, ఉపాధ్యాయులు మహాధర్నా నిర్వహించారు. పోలీసులు ఆంక్షలు విధించినప్పటికీ జిల్లా నలుమూలల నుంచి వేలాది మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు తరలివచ్చారు. అరసవల్లి జంక్షన్‌లో గల పసగడ సూర్యనారాయణ మిల్లు కూడలి నుంచి ర్యాలీగా కలెక్టరేట్‌ వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వైఖరికి నిరసనగా ప్లకార్డులు ప్రదర్శించారు. పాటలు, నృత్యాలతో హోరెత్తించారు. మరికొంతమంది శీర్షాసనాలు వేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు మాట్లాడుతూ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. పాతజీతాలనే కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. చీకటి జీవోలను రద్దు చేసే వరకూ పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు. ప్రజల్లో ఉద్యోగులను దోషులుగా నిలిపే ప్రయత్నాలను ప్రభుత్వ పెద్దలు మానుకోవాలని హితవుపలికారు. లేకుంటే మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేక.. తప్పును ఉద్యోగులపై నెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. వారంరోజుల్లో సీపీఎస్‌ రద్దు చేస్తామన్న సీఎం హామీ ఏమైందని నిలదీశారు. ఐక్య పోరాటాలతోనే సమస్యలు పరిష్కారమవుతాయన్న విషయాన్ని ఉద్యోగులు, ఉపాధ్యాయులు గుర్తించాలని సంఘ నేతలు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏపీ జేఏసీ, ఏపీజేఏసీ(అమరావతి), ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా చైర్మన్లు హనుమంతు సాయిరాం, కంచరాన శ్రీరాములు, టి.జగన్మోహన్‌, ఐ.నారాయణరావు, ఏపీఎన్జీవో రాష్ట్ర సహాధ్యక్షుడు చౌదరి పురుషోత్తంనాయుడు, ఏపీటీఎఫ్‌-257 రాష్ట్ర అధ్యక్షుడు కొప్పల భానుమూర్తి, ఫ్యాప్టో జిల్లా కార్యదర్శి కొమ్ము అప్పలరాజు, సంఘాల ప్రతినిధులు టి.బలరాం, మదన్‌మోహన్‌, టెంక చలపతిరావు, పి.ప్రభాకరరావు, గోవిందరాజులు, పి.వసంతరావు, ఎస్‌.పాపారావు, శంకరరావు, పెన్షనర్ల అసోసియేషన్‌ ప్రతినిధులు పార్వతీశం, ఎం.ఆదినారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-26T04:23:49+05:30 IST