- ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై
బెంగళూరు: గోవా రాష్ట్రంతో ఉన్న మహదాయి జల వివాదాన్ని పరస్పరం చర్చలతో సామరస్య పూరితంగా పరిష్కరించుకునేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ సుముఖత వ్యక్తం చేశారు. గోవాలోని పనాజీలో సోమవారం నూతన ముఖ్యమంత్రిగా ప్రమోద్‌సావంత్ ప్రమాణస్వీకారానికి హాజరైన రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ప్రత్యేకంగా శుభాకాంక్షలు అందచేశారు. ఈ సందర్భంగా ఉభయులు కొద్దిసేపు చర్చలు జరిపారు. కర్ణాటకతో ఉన్న జ లవివాదాలకు సంబంధించి పరస్పరం చర్చలు జరుపుకోవాలని ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సూచించినట్టు తెలుస్తోంది. ఈ సూచన అనంతరమే ప్రాథమికంగా ఉభయరాష్ట్రాల ముఖ్యమంత్రులు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. గోవా ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన హామీ మేరకు కర్ణాటక భవన్‌ను నిర్మించేందుకు సహకరించాలని కూడా నూతన ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశానని, ఆయన సానుకూలంగా స్పందించారని బొమ్మై మీడియాకు తెలిపారు. సావంత్ ప్రమాణ స్వీకారానికి హాజరై రాజధానికి తిరిగొచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ జలవివాదాలు ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులందరితోనూ తాను చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. అయితే రాష్ట్ర ప్రయోజనాలను భంగం ఏర్పడకుండా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి