ఫలితం కాదు.. ప్రయత్నమే విజయం

ABN , First Publish Date - 2020-08-14T09:13:33+05:30 IST

మహాభారత యుద్ధంలో ద్రోణుడు మరణించాక దుర్యోధనుడు తన ఆప్తులతో ఆంతరంగిక సమావేశం నిర్వహించాడు. అందులో అశ్వత్థామ దుర్యోధనుడితో..

ఫలితం కాదు.. ప్రయత్నమే విజయం

రాగో యోగస్తథా దాక్ష్యాం నయశ్చేత్యర్థ సాధకాః

ఉపాయాః పండితైః ప్రోక్తాస్తే తు దైవముపాశ్రితాః

మహాభారత యుద్ధంలో ద్రోణుడు మరణించాక దుర్యోధనుడు తన ఆప్తులతో ఆంతరంగిక సమావేశం నిర్వహించాడు. అందులో అశ్వత్థామ దుర్యోధనుడితో.. ‘‘కార్యరంగంలో దిగేటప్పుడే మన శక్తియుక్తులు, బలాలు, బలహీనతలు, ఎదురవబోయే అడ్డంకులు, మనకున్న అవకాశాల గురించి విస్తృతంగా ఆలోచించాలి. అంతేతప్ప, నిర్ణయం తీసుకున్నాక వెనక్కి తగ్గడం సమంజసం కాదు’’ అని చెప్పాడు. కార్యనిర్వహణ జయప్రదం కావాలంటే మంచి స్నేహితులు, సాధన సంపత్తి, వ్యవహార దక్షత, రాజనీతి కుశలత... ఈ నాలుగు ముఖ్య సాధనాలుగా పండితులు చెబుతారు. వాటిని సమకూర్చుకున్నా.. కార్యనిర్వహణ ప్రయోజనాన్ని సాధిస్తామనే నమ్మకంలేదు. విజయం ఎప్పుడూ దైవాధీనమే. కానీ ప్రయత్నం చేయడం తప్పనిసరి. ప్రయత్నశీలి తాను చేయవలసిన పనిని నిస్సందేహంగా చేయాల్సిందే. 

దుర్యోధనుడు 18 అక్షౌహిణుల సైన్యాన్ని సిద్ధం చేసుకున్నాడు. తన కోసం ప్రాణాలివ్వడానికి సిద్ధపడ్డ స్నేహవర్గాన్నీ సంపాదించాడు. అవసరమైన సాధన సంపత్తినీ అధికంగానే సమకూర్చుకున్నాడు. ఏ లోటూ కనిపించకుండా వనరులు, వసతులు ఏర్పాటు చేసుకున్నాడు. స్వయంగా తాను వ్యవహార దక్షుడు. కర్ణుడు, శకుని లాంటి వారి సలహాలు తనకెప్పుడూ ఉండనే ఉన్నాయి. అయినా భీష్మద్రోణుల వంటి యోధులను యుద్ధంలో పోగొట్టుకున్నాడు. ఆ సందర్భంలో అశ్వత్థామ భావి కార్య నిరూపణ చేస్తూ దుర్యోధనునికి చెప్పిన మాటలు లక్ష్యసాధనలో శ్రమించేవారందరికీ శిరోధార్యం. 

‘‘దుర్యోధనా! బాగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నాక దానిని సాధించేందుకు పూర్తి సమయాన్ని వినియోగించి అవిశ్రాంతంగా శ్రమించాలి. అప్పుడే.. అదెంత కష్టమైన పనైనా జరిగి తీరుతుంది. జరిగిన నష్టం అపారమైనదే. జరిగిపోయిన కార్యాన్ని గూర్చి ఎంతగా విచారించినా ఫలితాన్ని మార్చలేము. దానికి తోడు ఆ చింత మరింతగా కుంగదీస్తుంది. ఆత్రుత, తొందరపాటు, అవివేకం వల్ల పనులు చెడిపోతాయి. ఇప్పుడు శక్తియుక్తులనన్నింటినీ లక్ష్యంపైన కేంద్రీకరించి నిర్విరామంగా ప్రయత్నించాల్సిన సమయం వచ్చింది. నీవు విజ్ఞుడవు. శారీరకంగా మానసికంగా దృఢమైన వ్యక్తుల ఆలోచనలలో పరిణతి ఉంటుంది. ఒకే బాణంతో రెండు లక్ష్యాలను ఛేదించలేం. ఆలోచనలు దారి మళ్లితే లక్ష్యం చెదిరిపోతుంది. ఒకే లక్ష్యంపై దృష్టిని కేంద్రీకరించి దానిని సాధించే దాకా ప్రయత్నాన్ని కొనసాగించడం వల్ల విజయం తప్పక లభిస్తుంది. విస్తృతి, విస్తరణ కన్నా ఏకాగ్రత, ఏకీకరణ విలువైనవి. పరిమాణం కన్నా పరిణామం ఉన్నతమైనది. తప్పెక్కడ జరుగుతోందో పరిశీలించి దాన్ని సరిచేయడం వల్ల ఫలితం ఉంటుంది. ఆలోచించు. కత్తిని పట్టుకునే విధానం తెలియాలి. అంచును పట్టుకుంటే గాయపడతాము. అదే పిడిని పట్టుకుంటే.. ప్రయోజనం సిద్ధిస్తుంది. ఆలోచించి సరైన నిర్ణయం తీసుకో’’ అని నాడు అశ్వత్థామ చెప్పాడు. అశ్వత్థామ ఆనాడు పలికిన పలుకులు ఈనాటికి, ఏనాటికీ కూడా యువతకు మార్గదర్శకాలే!

- పాలకుర్తి రామమూర్తి

Updated Date - 2020-08-14T09:13:33+05:30 IST