అనుభవాన్ని పంచే గతం.. అప్రమత్తం చేసే వర్తమానం.. ఆశలు పెంచే భవిష్యత్.. స్ఫూర్తిదాయక మహాభారత కథ

ABN , First Publish Date - 2022-05-11T14:32:32+05:30 IST

మహాభారతంలో అర్జునుని కారణంగా...

అనుభవాన్ని పంచే గతం.. అప్రమత్తం చేసే వర్తమానం.. ఆశలు పెంచే భవిష్యత్.. స్ఫూర్తిదాయక మహాభారత కథ

మహాభారతంలో అర్జునుని కారణంగా ఖాండవ వనానికి మంటలు అంటుకున్నాయి. ఆ సమయంలో మాయాసురుడు అనే రాక్షసుడు ఆ మంటల్లో దహనం కాబోతున్నాడు. అయితే దీనిని గమనించిన అర్జునుడు అతని ప్రాణాలను కాపాడాడు. అప్పుడు మాయాసురుడు అర్జునునితో ఇలా అన్నాడు 'నువ్వు నన్ను మంటల నుంచి రక్షించావు. ఈ ఉపకారానికి ప్రతిఫలంగా నేను మీకు ఏమి చేయగలను?’ వెంటనే అర్జునుడు  మాట్లాడుతూ 'నువ్వు నాకు కృతజ్ఞతలు చెప్పావు. 


నా మీద చూపిన నీ అభిమానమే నువ్వు నాకిచ్చే ప్రతిఫలం. ఈ ప్రేమను ఎల్లప్పుడు జాగ్రత్తగా కాపాడుకో' అని అన్నాడు. మాయాసురుడు వెంటనే 'నేను రాక్షసుల విశ్వకర్మను. నాకు నిర్మాణ పనులపై మంచి అవగాహన ఉంది. నేను అద్భుతంగా భవనాలను నిర్మిస్తాను. నేను మీకు ఏదోఒక సేవ చేయాలనుకుంటున్నాను’ అని అన్నాడు. అందుకు అర్జునుడు నిర్మొహమాటంగా నిరాకరించి.. 'నాకు నీ నుండి ఎలాంటి సేవ అవసరం లేదు. నువ్వు సేవ చేయాలనుకుంటే శ్రీ కృష్ణుడిని అడుగు. అతను ఏదైనా పని ఉంటే చెబుతారు’ అని అన్నాడు. శ్రీకృష్ణుడు కూడా అతని సేవలను తిరస్కరిస్తాడని అర్జునుడు మనసులో అనుకున్నాడు. అయితే శ్రీకృష్ణుడు ముందుచూపుతో ఏ నిర్ణయమైనా తీసుకునేవాడు. శ్రీ కృష్ణుడు మాయాసురునితో ఇలా అన్నాడు.. నువ్వు యుధిష్ఠిరుని కోసం ఒక సమావేశ మందిరాన్ని నిర్మించాలి. ఎవరు చూసినా ఆశ్చర్యపోయేలా దానిని నిర్మించాలని చెప్పాడు.  వెంటనే మాయాసురుడు యుధిష్ఠిరునితో మాట్లాడి అద్భుతమైన సమావేశ మందిరాన్ని నిర్మించాడు. దీనిని చూసిన అర్జునునికి.. శ్రీకృష్ణుడు ఎంత ముందు చూపుతో ఆలోచిస్తున్నాడో అప్పుడు అర్థం అయ్యింది. ఆ సమావేశ మందిరం కారణంగానే పాండవుల శక్తి ప్రపంచానికి తెలిసింది. అలాగే పాండవులు నివసించడానికి ఒక అందమైన రాజభవనం కూడా సిద్ధం అయ్యింది. కొంతమంది ఏ నిర్ణయం తీసుకున్నా భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. కాలం ముందుకు కదలడానికి ఎక్కువ సమయం పట్టదు. అందుకే గతం నుండి పాఠాలు నేర్చుకుని, వర్తమానంలో అప్రమత్తంగా ఉండాలి. భవిష్యత్తుకు బంగారుబాటలు వేసుకోవాలని ఈ మహాభారత కథ మనకు చెబుతోంది. 

Read more