మహా దుబారా

ABN , First Publish Date - 2022-05-22T06:59:02+05:30 IST

మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) పరిధిలో గల రెండు ఫస్ట్‌ రిఫరల్‌ యూనిట్‌ (ఎఫ్‌ఆర్‌యూ)ల నిర్వహణను తిరిగి ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించాలనే నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మహా దుబారా
ఆరిలోవలోని ఫస్ట్‌ రిఫరల్‌ యూనిట్‌ భవనం

ఫస్ట్‌ రిఫరల్‌ యూనిట్‌ (ఎఫ్‌ఆర్‌యూ)ల నిర్వహణ బాధ్యతలు మరోమారు ఏజెన్సీలకు అప్పగించేందుకు జీవీఎంసీ సన్నద్ధం

కౌన్సిల్‌ ఆమోదానికి అజెండాలో చేర్చిన అధికారులు

ఏటా రూ.2 కోట్ల చెల్లింపు

యూపీహెచ్‌సీలు అందుబాటులోకి వస్తే వాటికి రోగులు వెళ్లని పరిస్థితి

ఇప్పటికే అరకొర సేవలు అందుతున్నాయని ఫిర్యాదులు

అయినప్పటికీ జీవీఎంసీ స్వాధీనం చేసుకోకుండా ప్రైవేటు సంస్థలను కొనసాగించడంపై అనుమానాలు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) పరిధిలో గల రెండు ఫస్ట్‌ రిఫరల్‌ యూనిట్‌ (ఎఫ్‌ఆర్‌యూ)ల నిర్వహణను తిరిగి ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించాలనే నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆరిలోవ, శ్రీహరిపురంలలో గల రిఫరల్‌ యూనిట్ల నిర్వహణను ప్రైవేటు ఏజెన్సీలు చూస్తున్నాయి. ఆ గడువు మొన్న మార్చి 31తో ముగిసింది. అయితే తిరిగి వారికే ఏడాది పాటు బాధ్యతలను అప్పగించేందుకు జీవీఎంసీ అధికారులు, పాలకవర్గం పెద్దలు ప్రతిపాదనలు తయారుచేశారు. ఇందుకు దాదాపు రూ.రెండు కోట్లు చెల్లించేందుకు సిద్ధమయ్యారు. ఈనెల 26న కౌన్సిల్‌ ఆమోదం కోసం దీనిని అజెండాలో చేర్చారు.

జీవీఎంసీ పరిధిలో 11 డిస్పెన్సరీలు, రెండు ఫస్ట్‌ రిఫరల్‌ యూనిట్లు (ఎఫ్‌ఆర్‌యూ) ఉన్నాయి. గత టీడీపీ ప్రభుత్వం డిస్పెన్సరీలను జిల్లా వైద్య, ఆరోగ్య శాఖకు అప్పగించింది. దాంతో వాటి నిర్వహణ, మందులు కొనుగోలు కోసం ఏటా కోట్లాది రూపాయలు వెచ్చించాల్సిన బాధ్యత జీవీఎంసీకి తప్పినట్టయింది. ఇక ఆరిలోవ ఎఫ్‌ఆర్‌యూను రెడ్‌క్రాస్‌ సంస్థకు, శ్రీహరిపురంలోని ఎఫ్‌ఆర్‌యూను సీడ్‌ (ఎస్‌ఈఈడీ) అనే స్వచ్ఛంద సంస్థకు జీవీఎంసీ అప్పగించింది. 24 గంటలు వైద్య సేవలు అందించడం, అవసరమైన రోగులకు మందులు ఇవ్వడం, ల్యాబ్‌ పరీక్షలు చేయడం కోసం ఆరిలోవ ఎఫ్‌ఆర్‌యూకు ఏడాదికి రూ.97.8 లక్షలు, శ్రీహరిపురంలోని ఎఫ్‌ఆర్‌యూకు రూ.1.03 కోట్లు ఇచ్చేలా జీవీఎంసీ ఒప్పందం కుదుర్చుకుంది. అంటే ఏడాదికి దాదాపు రూ.రెండు కోట్లుపైనే వెచ్చిస్తోందన్నమాట. అయితే ఎఫ్‌ఆర్‌యూల్లో పగటిపూట మాత్రమే వైద్య సేవలు అందుబాటులో ఉంటున్నాయని, స్పెషాలిటీ వైద్యులు కొంతమంది పరిమిత సమయం వచ్చి వెళ్లిపోతున్నారని, మందులు కూడా బయట కొనుక్కోమని చెబుతున్నారని, సిబ్బందికి సక్రమంగా జీతాలు ఇవ్వడం లేదనే ఫిర్యాదులు జీవీఎంసీ ప్రజారోగ్య విభాగం అధికారులకు అందుతున్నాయి. వీటికి ఓపీ అంతంతమాత్రంగానే ఉంటున్నప్పటికీ, నిర్వాహకులు అదనపు పేర్లను రిజిస్టర్‌లో నమోదుచేసి, కాస్త ఎక్కువ ఓపీ వచ్చినట్టు జీవీఎంసీకి నివేదిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ అధికారులు ఎందుకనో పట్టించుకోకుండా ఏటా వారికి కాంట్రాక్టు పొడిగిస్తూ వస్తున్నారు. ఇటీవల సీపీఎం ఫ్లోర్‌లీడర్‌ బి.గంగారావు ఇదే విషయాలను ప్రస్తావిస్తూ మేయర్‌ గొలగాని హరివెంకటకుమారికి ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ వాటి నిర్వాహకులను పిలిచి కనీసం వివరణ కోరే ప్రయత్నం కూడా జరగకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

ఇదిలావుండగా వీటి నిర్వహణ కాంట్రాక్టు ఈ ఏడాది మార్చి 31తో ముగిసింది. జీవీఎంసీ పరిధిలో ప్రస్తుతం కొత్తగా 42 అర్బన్‌ ప్రైమరీ హెల్త్‌సెంటర్ల (యూపీహెచ్‌సీ)ల నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. కొన్ని భవనాలను ఒకటి, రెండు నెలల్లో ప్రారంభించే అవకాశం వుందని ఇంజనీరింగ్‌ అధికారులు చెబుతున్నారు. 42 యూపీహెచ్‌సీలు అందుబాటులోకి వస్తే వాటి చుట్టుపక్కల ప్రాంతాల వారంతా వాటినే ఆశ్రయించడం ఖాయం. ఈ నేపథ్యంలో ఎఫ్‌ఆర్‌యూలను ప్రైవేటు సంస్థలకు అప్పగించి ఏటా రూ.రెండు చెల్లించడం అనవసరమని జీవీఎంసీ అధికారులే అభిప్రాయపడుతున్నారు. ఆరిలోవ ప్రాంతంలో కొత్తగా నాలుగు యూపీహెచ్‌సీలు వస్తున్నాయని, అవి అందుబాటులోకి వస్తే ఇప్పటికే అంతంతమాత్రం ఓపీతో నడుస్తున్న అక్కడి ఎఫ్‌ఆర్‌యూకు ఆదరణ పూర్తిగా తగ్గిపోతుందని చెబుతున్నారు. అలాగే మల్కాపురం ప్రాంతంలో ఏడు యూపీహెచ్‌సీలు వస్తున్నందున, అక్కడ ఎఫ్‌ఆర్‌యూ పరిస్థితి కూడా అలాగే ఉంటుందంటున్నారు. అసలే ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్న జీవీఎంసీ వాటిని స్వయంగా నిర్వహించడం లేదంటే యూపీహెచ్‌సీలు అందుబాటులోకి వచ్చేంత వరకూ రెండు, మూడు నెలలు మాత్రమే ప్రైవేటు ఏజెన్సీలకు ఇచ్చేలా ఒప్పందం చేసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. కానీ వీటి నిర్వహణ ఏజెన్సీలకు అప్పగించడం వల్ల కొంతమంది అధికారులకు, పాలకవర్గంలోని పెద్దలకు జేబులు నిండుతాయని, అందుకే ఆ దిశగా ఆలోచన చేయడం లేదని ఆరోపిస్తున్నారు. 

Updated Date - 2022-05-22T06:59:02+05:30 IST