మహా షాక్‌

ABN , First Publish Date - 2022-01-29T06:21:18+05:30 IST

కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రాల్లో చేపట్టే పనులకు సంబంధించి ఆర్థిక శాఖ తాజాగా జారీచేసిన ఆదేశాలు మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) అధికారుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.

మహా షాక్‌

నగరంలో ప్రాజెక్టులపై నీలినీడలు

రాష్ట్రాల వాటా ముందు ఖర్చు పెట్టాలని కేంద్రం షరతు

ఆ తర్వాతే తమ వాటా విడుదల చేస్తామని స్పష్టీకరణ

ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితుల కారణంగా

ప్రాజెక్టులు ఆలస్యమయ్యే అవకాశం



(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రాల్లో చేపట్టే పనులకు సంబంధించి ఆర్థిక శాఖ తాజాగా జారీచేసిన ఆదేశాలు మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) అధికారుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ఆయా ప్రాజెక్టుల్లో ముందుగా రాష్ట్రాలు తమ వాటాను ఖర్చుపెట్టి, వాటి వివరాలను పంపించాలని, అప్పుడే కేంద్రం వాటాను విడుదల చేస్తామని ఆర్థిక శాఖ స్పష్టంచేసింది. ఈ నిర్ణయం ప్రభావం జీవీఎంసీ పరిధిలో జరుగుతున్న పలు ప్రాజెక్టులపై పడే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.

కేంద్రంతోపాటు విదేశీ బ్యాంకుల ఆర్థిక సహాయంతో జీవీఎంసీ పరిధిలో పలు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అందులో ప్రధానంగా స్మార్ట్‌ సిటీ, అమృత్‌, ఏపీడీఆర్‌పీ, సిటీస్‌, 14, 15 ఆర్థిక సంఘాల నిధులను చెప్పుకోవచ్చు. స్మార్ట్‌ సిటీ మిషన్‌ కింద గత ఆరేళ్లలో కేంద్రం రూ.450 కోట్లు, రాష్ట్రం రూ.400 కోట్లు కేటాయించాయి. ఆ నిధులతో కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ఏర్పాటు, స్మార్ట్‌ రోడ్లు, వీధి దీపాలు, స్మార్ట్‌ పార్కులు, పాఠశాలల అభివృద్ధి వంటి పనులను చేపట్టారు. వీటిలో కొన్ని ఇప్పటికే పూర్తికాగా, మరికొన్ని  వేర్వేరు దశలలో ఉన్నాయి. ఇంకా కొన్ని ప్రారంభించాల్సి ఉంది. కేంద్రం నుంచి రూ.50 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.100 కోట్లు రావాల్సి ఉంది. ఈ ఏడాదికి సంబంధించి కేంద్ర, రాష్ట్రాల నుంచి చెరో రూ.100 కోట్లు చొప్పున కేటాయించాల్సి ఉంది. తాజాగా కేంద్ర ఆర్థిక శాఖ జారీచేసిన ఆదేశాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా ఇప్పటికే బకాయిపడిన రూ.100 కోట్లతోపాటు, ఈ ఏడాదిలో కేటాయించాల్సిన రూ.100 కోట్లను విడుదల చేస్తేనే కానీ కేంద్రం నుంచి రావాల్సిన రూ.50 కోట్లు, ఈ ఏడాదికి రూ.100 కోట్లు విడుదలయ్యే అవకాశం ఉండదు. స్మార్ట్‌ సిటీ కింద జరుగుతున్న పనులతోపాటు కొత్తగా ప్రారంభించాల్సిన పనులపై దీని ప్రభావం పడుతుందని అధికారులు ఆందోళన చెందుతున్నారు.

అలాగే ‘అమృత్‌’ పథకం కింద రూ.35 కోట్లతో మల్కాపురం ప్రాంతంలో నిరంతర నీటి సరఫరా కోసం 26 వేల ఇళ్లకు కొళాయి కనెక్షన్లు ఇచ్చే పనులు ప్రారంభించారు. ఇందులో కేంద్రం వాటా రూ.8.8 కోట్లలో ఇంకా రూ.3.5 కోట్లు విడుదల కావాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద రావాల్సిన నిధుల్లో కొంత మొత్తమే విడుదల చేసింది. ఇంకా సగానికిపైగా రాష్ట్రం నుంచి రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రం తన వాటాను పూర్తిగా ఖర్చు చేసేంత వరకూ కేంద్రం వాటా నిధులు విడుదలయ్యే అవకాశం ఉండదని అధికారులు చెబుతున్నారు. ‘అమృత్‌’లో భాగంగానే నగరంలోని పలు ప్రాంతాల్లో 65 వేల ఇళ్లకు కొళాయి కనెక్షన్‌ ఇచ్చే పనులు  రూ.120 కోట్లతో చేపట్టారు. ఇవి చివరిదశలో ఉన్నాయి. ఇప్పటివరకూ కేంద్రం తన వాటా కింద రూ.90 కోట్లు అందజేయగా, మరో రూ.30 కోట్లు రావాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం వాటాగా కూడా మరో రూ.30 కోట్లు వరకూ రావాల్సి ఉంది. రాష్ట్రం నిధులను విడుదల చేసేంత వరకూ కేంద్రం రూ.30 కోట్లను విడుదల చేయకపోవచ్చునంటున్నారు. అలాగే ‘అమృత్‌’ పథకం కింద 25 వేల ఇళ్లకు కొత్తగా యూజీడీ కనెక్షన్లు ఇచ్చే పనులు జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించి కేంద్రం నుంచి కొంత నిధులు విడుదల కావాల్సి వుందని అధికారులు పేర్కొంటున్నారు. ఇవికాకుండా పాఠశాలల అభివృద్ధి, ఆధునిక సదుపాయాల కల్పన కోసం ‘సిటీస్‌’ పేరుతో పనులు ప్రారంభించారు. దీనికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరో రూ.26 కోట్లు చొప్పున వ్యయం చేసేలా ఒప్పందం కుదిరింది. దీనికి సంబంధించి చెరో రూ.ఐదు కోట్లు చొప్పున ఖర్చు చేసినట్టు సమాచారం. మిగిలిన నిధులను కేంద్రం విడుదల చేయాలంటే ముందుగా రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులను ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకా 14, 15 ఆర్థిక సంఘం నిధులతో జీవీఎంసీ పరిధిలో పెద్దఎత్తున పనులు జరుగుతున్నాయి. వీటికి సంబంధించిన వివరాలను వెల్లడించేందుకు ఇంజనీరింగ్‌ అధికారులు సుముఖత వ్యక్తం చేయడంలేదు. కేంద్రం తాజా ఆదేశాలతో ఆర్థిక సంఘాల నిధులతో చేపట్టే పనులపై కూడా ప్రభావం పడుతుందంటున్నారు. అయితే 14వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టిన పనులకు సంబంధించి ఇప్పటికీ బిల్లులు చెల్లించకపోవడంతో 15వ ఆర్థిక సంఘం నిధులతో అభివృద్ధి పనులకు ఎన్నిసార్లు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ముందుకురావడం లేదు. దీనిపై మాట్లాడితే ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారుల నుంచి చీవాట్లు తినాల్సి వస్తుందని అధికారులు నోరువిప్పడం లేదు. 


Updated Date - 2022-01-29T06:21:18+05:30 IST