సర్వం శివమయం!

ABN , First Publish Date - 2020-02-21T06:02:32+05:30 IST

శివుడు ధ్యానంలో ఎన్నో వేల సంవత్సరాలు ఉన్న తరువాత ఒకరోజు ఆయన కదలికలన్నీ ఆగిపోయి, సంపూర్ణంగా నిశ్చలుడయ్యాడు. ఆ రోజే మహాశివరాత్రి! అందుకనే దీన్ని యోగ సాధకులు నిశ్చలత్వానికి ప్రతీక అయిన రాత్రిగా పరిగణిస్తారు.

సర్వం శివమయం!

శివుడు ధ్యానంలో ఎన్నో వేల సంవత్సరాలు ఉన్న తరువాత ఒకరోజు ఆయన కదలికలన్నీ ఆగిపోయి, సంపూర్ణంగా నిశ్చలుడయ్యాడు. ఆ రోజే మహాశివరాత్రి! అందుకనే దీన్ని యోగ సాధకులు నిశ్చలత్వానికి ప్రతీక అయిన రాత్రిగా పరిగణిస్తారు.


శివుడంటే ఎవరంటే...

‘శివ’ అనే పదానికి భాషా పరంగా ‘ఏది లేదో... అది’ అని అర్థం. నేడు ఆధునిక విఙ్ఞాన శాస్త్రం కూడా అన్నీ శూన్యం నుంచే వచ్చి శూన్యంలోనే కలిసిపోతాయని నిరూపిస్తోంది. ఈ సృష్టి మూలం, ఈ విశ్వ మౌలిక లక్షణం కూడా ఈ విశాలమైన శూన్యమే! ఈ నక్షత్ర మండలాలు కేవలం దానిలోని చిన్న భాగమే. మిగతాదంతా విశాలమైన శూన్యం. దాన్నే ‘శివ’ అంటారు. అంటే అదే గర్భం. ప్రతిదీ దీని నుంచే పుడుతుంది. తిరిగి దానిలోనే లయమై పోతుంది. అన్నీ శివుడి నుంచే వచ్చి, తిరిగి శివుడిలోనే కలిసిపోతాయి.


యోగపరంపరకు మూలం

యోగ సంప్రదాయంలో శివుణ్ణి  ఒక దేవుడిగా చూడరు. ఆయన హిమాలయ ప్రాంతంలో నివసించినవాడు. ఈ భూమి మీద నడచినవాడు. యోగ పరంపరకు మూలంగా ఆయన మానవ చైతన్యానికి చేసిన సహాయం అద్భుతమైనది, స్మరణీయమైనది! ఈ మానవ యాంత్రికత ఎన్ని విధాలుగా పరమోత్తమ స్థాయికి తీసుకురావచ్చో ఆ సాధానాలన్నిటి అన్వేషణ కొన్ని వేల సంవత్సరాల క్రితమే జరిగింది. ఈ  దేశంలో ప్రాచీన కాలంలో దేవాలయాలు కేవలం శివుడికి మాత్రమే కట్టేవారు, వేరేవరికీ కాదు. దాదాపు గత వెయ్యి సంవత్సరాలలోనే మిగతా ఆలయాలు వచ్చాయి. ‘శివ’ అనే పదానికి ‘ఏది కాదో... అది’ అని అర్థం. అంటే ఆలయాలను ‘ఏది కాదో’ దాని కోసం కట్టేవారు. ‘ఏది ఉందో’ దానికి ఒక భౌతిక అభివ్యక్తీకరణ ఉంటుంది. ‘ఏది లేదో’ అది భౌతికాతీతమైనది. ‘ఆలయం’ అనేది ‘ఏది లేదో’ దానిలోకి ప్రవేశించడానికి ఒక రంధ్రం లాంటిది. ఈ దేశంలో కొన్ని వేల శివాలయాలు ఉన్నాయి, అందులో చాలా వాటిలో ఏ రూపమూ ఉండదు. ఒక సూచనా రూపం ఉంటుంది, సాధారణంగా అది ఒక లింగం అయి ఉంటుంది.


మహా మృత్యుంజయ మంత్రం

ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం 

ఉర్వారుకమివ బంధనాన్‌ మృత్యోర్‌ ముక్షీయ మామృతాత్‌ 

భావం: ‘‘అందరికి శక్తిని ఇచ్చే ముక్కంటి దేవుడు, సుగంధ భరితుడు అయిన శివుణ్ణి మేము పూజిస్తున్నాం. తొడిమ నుంచి పండు వేరు పడే విధంగా, మేము కూడా మరణం నుంచి, మర్త్యత్వం నుంచి విడుదల పొందాలి.’’

మహా మృత్యుంజయ మంత్రం పరమ మహిమాన్వితమైనదనీ, దీని పఠనం దీర్ఘ అనారోగ్యాలనూ, అపమృత్యు భయాన్నీ దూరం చేస్తుందనీ పెద్దల మాట. 


ఈశా యోగ కేంద్రంలో వేడుకలు

మహా శివరాత్రి సందర్భంగా తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లా వెల్లంగిరి పర్వత పాదాల దగ్గర ఉన్న ఈశా యోగా కేంద్రంలో నేటి (శుక్రవారం) సాయంత్రం ఆరు గంటల నుంచి ఎల్లుండి (శనివారం) ఉదయం ఆరుగంటల వరకూ సద్గురు జగ్గీవాసుదేవ్‌ నేతృత్వంలో వేడుకలు నిర్వహిస్తున్నారు. ధ్యానలింగం వద్ద పంచభూత ఆరాధనతో కార్యక్రమాలు మొదలవుతాయి. 


ఇవీ ప్రత్యేకతలు:

సంప్రదాయ యోగ శిక్షణ తరగతులు: యోగ సాధనలకు మహాశివరాత్రి సమయం ఎంతో శ్రేయస్కరమైనదిగా భావిస్తారు. ఈ నేపథ్యంలో ఈశా యోగా కేంద్రంలో అయిదు రోజుల పాటు యోగ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. 


108 తీరుల్లో చీర కట్టు: మనోహరమైన చీర కట్టు భారతీయతకు చిహ్నాలలో ఒకటి. చీరలు కట్టుకొనే 108 శైలులను ప్రదర్శించి, నేర్పించే కార్యక్రమం ఇది. దీనితో పాటు జానపద నృత్య, సంగీతాలను కూడా ఆస్వాదించవచ్చు.


ఆదియోగి దివ్యదర్శనం: ఈశా యోగా కేంద్రంలో మహాశివరాత్రి నాడు ఆదిగురువుగా ఆదియోగి ఆవిర్భవించిన ఘట్టాన్ని సద్గురు సమక్షంలో ప్రదర్శిస్తారు. 


‘యక్ష’ సాంస్కృతిక సమ్మేళనం: మూడు రోజుల ‘యక్ష’ సాంస్కృతిక సమ్మేళనంలో భాగంగా  సుప్రసిద్ధ సంగీత, నృత్య కళాకారుల ప్రదర్శనలు ఏర్పాటు చేశారు.


నడిరేయి ధ్యానం: మహాశివరాత్రి రోజున అర్థరాత్రి సమయంలో, ఈ వేడుకలను ప్రత్యక్షంగానూ, ప్రసార మాధ్యమాల ద్వారానూ వీక్షిస్తున్న వారిని ఒక శక్తిమంతమైన ధ్యాన స్థితిలోకి సద్గురు జగ్గీ వాసుదేవ్‌ తీసుకువెళ్తారు.


శివ యాత్ర: పవిత్రమైన వెల్లంగిరి పర్వతాల వద్దకు కాలినడకతో, సైకిల్‌ లేదా ఎడ్ల బండ్ల మీద చేరుకొని మహాశివరాత్రి వేడుకలలో పాల్గొనడానికి చేసే తీర్థయాత్ర- సద్గురు శివ యాత్ర.


పంచభూత ఆరాధన: యోగ విధానంలో ‘భూతశుద్ధి’ ఒక  ప్రక్రియ. సాధనతో మాత్రమే సాధ్యమయ్యే ఈ అనుభవాన్ని పంచభూత ఆరాధన ద్వారా భక్తులకు సద్గురు అందిస్తారు.


మహా అన్నదానం: ఈశా యోగా కేంద్రంలో మహాశివరాత్రి పర్వదినాన రాత్రి తెల్లవార్లూ జరిగే వేడుకలలో పాల్గొనే లక్షలాదిమందికి మహా అన్నదానం నిర్వహిస్తున్నారు.


మన సంస్కృతిలో ఎన్నో పండుగలు ఉన్నాయి. వాటిలో మహాశివరాత్రికి ఒక ప్రత్యేక విశిష్టత ఉంది. ప్రతి చాంద్రమాన మాసంలోని పధ్నాలుగో రోజును లేదా అమావాస్యకు ముందు రోజును (మాస) శివరాత్రి అంటారు. పంచాంగ సంవత్సరంలో వచ్చే పన్నెండు శివరాత్రులలో ఫిబ్రవరి - మార్చి నెలల్లో వచ్చే దానికి ఆధ్యాత్మికంగా గొప్ప ప్రాధాన్యం ఉంది. ఈ రాత్రి, భూమి ఉత్తర అర్ధగోళం ఎటువంటి స్థితిలో ఉంటుందంటే, దాని వల్ల మనిషిలోని శక్తి సహజంగానే ఉప్పొంగుతుంది. ఈ రోజు ప్రకృతి మనల్ని ఆధ్యాత్మిక శిఖరం వైపు నడిపిస్తుంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవడానికే... రాత్రంతా నిర్వహించుకొనేలా ఈ పండుగకు రూపకల్పన చేశారు పూర్వీకులు. మనం తెల్లవార్లూ జాగారం చేసి మన వెన్నెముకను నిటారుగా ఉంచడం ద్వారా ఆ శక్తులు సహజంగా పైకి ఎగసి పడడానికి దోహదం చేయవచ్చు. 


అందరిదీ ఈ వేడుక

ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారికి మహాశివరాత్రి ఎంతో పవిత్రమైనది. కుటుంబ జీవితం గడిపేవారు మహాశివరాత్రిని శివుడి పెళ్లి రోజుగా పరిగణిస్తారు. ప్రాపంచిక లక్ష్యాలతో ఉన్నవారు ఈ రోజును శివుడు తన శత్రువులందరినీ జయించిన రోజుగా చూస్తారు. సన్న్యాసులకు మాత్రం ఇది కైలాస పర్వతంతో శివుడు ఒకటయిన రోజు. ఆయన పరిపూర్ణ నిశ్చలత్వంతో, పర్వతంలా అయిపోయాడు. కానీ యోగ సంప్రదాయంలో శివుణ్ణి దేవుడిగా భావించరు, యోగ శాస్త్రానికి మూలకారకుడైన ‘ఆదియోగి’ లేదా ‘ఆదిగురువు’గా చూస్తారు. 


అన్నీ శక్తి రూపాలే!

ఇతిహాసాలను పక్కన పెడితే, ఆధ్యాత్మిక సాధనకు అత్యుత్తమమైన రోజు మహాశివరాత్రి. అందుకే దీనికి యోగ సంప్రదాయంలో ఇంత ప్రాముఖ్యం. జీవం ఉన్న ప్రతీదీ, మనకు తెలిసిన ప్రతి పదార్థం, మనకు తెలిసిన జగత్తు, ఖగోళం... ఇవన్నీ శక్తికి కోట్లాది రూపాల్లో వ్యక్తీకరణలే!  ఆధునిక విజ్ఞాన శాస్త్రం ఎన్నో దశల అధ్యయనం తరువాత ఈ సంగతి నిరూపించింది.  ఈ వాస్తవాన్ని ప్రతి యోగీ అనుభవపూర్వకంగా తెలుసుకుంటాడు. ‘యోగి’ అనే పదానికి అర్థం ‘ఆ (శక్తి) ఉనికి తాలూకు ఏకత్వాన్ని గ్రహించినవాడు’ అని! ఆ ఏకత్వం గురించీ, ఆ ఉనికి గురించీ తెలుసుకోవాలనే కోరిక ఉంటే - అదే యోగ! దీన్ని అనుభవంలోకి తెచ్చుకోవడానికి మహాశివరాత్రి మార్గ నిర్దేశనం చేస్తుంది. 


- సద్గురు జగ్గీవాసుదేవ్‌


Updated Date - 2020-02-21T06:02:32+05:30 IST