Abn logo
Feb 21 2020 @ 10:17AM

తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా శివరాత్రి వేడుకలు

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో శివరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. శివనామస్మరణతో శైవక్షేత్రాలు మారుమోగుతున్నాయి. భక్తులు ఉదయం నుంచే శివాలయాలకు చేరుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు.

తెలంగాణ:

వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంత్రులు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.

మంచిర్యాల: మహా శివరాత్రి సందర్భంగా చెన్నూరు, గూడెం, లక్షెట్టిపేట, మంచిర్యాల, వేలాల గోదావరి ఘాట్ల వద్ద వేలాది మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. వేలాల మల్లిఖార్జునస్వామి ఆలయం, కత్తెరశాల మల్లన్న, బుగ్గ రాజరాజేశ్వర స్వామి ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. 

నిర్మల్: జిల్లా వ్యాప్తంగా శైవక్షేత్రాల్లో శివరాత్రి శోభ సంతరించుకుంది. బాసర, సోన్, బ్రహ్మపురి వద్ద గోదావరిలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. శైవ క్షేత్రాల్లో భక్తుల పూజలు కొనసాగుతున్నాయి. కదిలి పాపహరేశ్వర ఆలయానికి భక్తులు పోటెత్తారు. 

కొమురం భీం జిల్లా: మహా శివరాత్రి సందర్భంగా వాంకిడి శివకేశవ ఆలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ఈజ్ గాం శివమల్లన్న జాతరకు  భక్తులు భారీగా తరలివస్తున్నారు. 

సూర్యాపేట: శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లాలోని పిల్లలమర్రి, నాగులపాటి అన్నారంలోని ప్రాచీన శివాలయాల్లో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మేళ్లచెరువు శ్రీస్వయంభూ శంభు లింగేశ్వర స్వామి ఆలయంలో ఎమ్మెల్యే సైదిరెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. 

గద్వాల: మహాశివరాత్రి సందర్భంగా  అలంపూర్ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.

మేడ్చల్: కీసర గుట్టలో శివరాత్రి వేడుకలు  వైభవంగా జరుగుతున్నాయి. ప్రభుత్వం తరపున మంత్రి మల్లారెడ్డి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్దసంఖ్యలో ఆలయానికి తరలివస్తున్నారు. 

భద్రాద్రి: మహాశివరాత్రిని పురస్కరించుకుని శివాలయాలకు భక్తులు పోటెత్తారు. అన్నపురెడ్డిపల్లి, మోతె వీరభద్ర స్వామి, పాల్వంచ రామలింగేశ్వర ఆలయాల్లో శివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. 

ఖమ్మం: జిల్లాలోని శైవ క్షేత్రాలకు భక్తులతో పోటెత్తాయి. తీర్ధాల సంగమేశ్వరాలయం, కూసుమంచి గణపేశ్వరాలయం, పెనుబల్లి నీలాద్రీశ్వరాలయం, బేతుపల్లి గౌతమేశ్వరాలయాల్లో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 


ఆంధ్రప్రదేశ్:

కృష్ణా: శివరాత్రి సందర్భంగా జగ్గయ్యపేట మండలం ముత్యాలకు భక్తులు పోటెత్తారు. వేకువజాము నుంచి కృష్ణానదిలో భక్తులు స్నానాలు ఆచరించి స్వామిని దర్శించుకుంటున్నారు. 

ప్రకాశం: జిల్లా వ్యాప్తంగా శైవలయాల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంది. త్రిపురాంతకం, భైరవకొన, జమ్ములపాలెం, సోపిరాలలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

ప.గో జిల్లా: శివరాత్రిని పుస్కరించుకుని పట్టిసీమ కేత్రానికి భక్తులు తరలివచ్చారు. అటు పాలకొల్లు క్షీరా రామలింగేశ్వరస్వామి ఆలయంలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. మరోవైపు పట్టిసీమ పట్టిసాచలక్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వీరభద్రేశ్వర స్వామికి వంశపారంపర్య ధర్మకర్తలు తొలిపూజ నిర్వహించారు.ద్వారకాతిరుమల శేషాచల కొండపై శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. శివనామస్మరణతో శివాలయం మారుమోగుతోంది. స్వామివారికి భక్తులు అభిషేకాలు నిర్వహించారు. ఐ.ఎస్.జగన్నాధపురం లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో నృసింహ సుదర్శన మహా యజ్ఞం నిర్వహించారు. 

తిరుపతి: కపిలతీర్థంలో శివరాత్రి సందర్భంగా  భక్తులు పోటెత్తారు. కపిలతీర్థం జలపాతం దగ్గర భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. ఆపై మహిళలు పిండి దీపాలు వెలిగించి పూజలు నిర్వహించారు.

తూ.గో: మహాశివరాత్రి సందర్భంగా గోదావరిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. రాజమండ్రి పుష్కర ఘాట్, కోటిలింగాల ఘాట్‌లో భక్తులు పోటెత్తారు. ఏలేశ్వరంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఏలేరు నది తీరంలో భక్తుల పుణ్యస్నానాలు ఆచరించారు. శివ భక్తుడు బదిరెడ్డి గోవిందు ఆలయంలో భక్తుల కోసం అన్న ప్రసాదం ఏర్పాటు చేశారు. అటు సామర్లకోట కుమారరామ భీమేశ్వర స్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు.

కృష్ణా: శివరాత్రిని పురస్కరించుకుని తోట్లవల్లూరు మండలం ఐలూరు రామేశ్వరస్వామి ఆలయానికి భక్తులు తరలివస్తున్నారు. స్వచ్ఛంద సంస్థలు సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. భక్తులకు మినరల్ వాటర్, ప్రసాదాలను పంపిణీ చేస్తున్నారు. 


Advertisement
Advertisement
Advertisement