Sep 25 2021 @ 01:00AM

నా దగ్గరకు ఎందుకు రాలేదని అడిగా! -శర్వానంద్‌

‘‘దర్శకుడు అజయ్‌ భూపతి చాలామంది హీరోల దగ్గరకు (ఈ కథతో) వెళ్లాడు. నా దగ్గరకు ఎందుకు రాలేదని అడిగా. రెండు నెలలు ప్రయత్నించినా కలవడం కుదరలేదన్నాడు. తొలి సిట్టింగ్‌లో ఒక్క ప్రశ్న వేయకుండా ఓకే చేశా. ప్రశ్నించే అవకాశమూ ఇవ్వలేదు. ప్రతి ఒక్కరూ కుటుంబంతో చూసే చిత్రమిది. ఈమధ్య కాలంలో ఇలాంటి సినిమా రాలేదు’’ అన్నారు శర్వానంద్‌. సిద్ధార్థ్‌, ఆయన హీరోలుగా నటించిన చిత్రం ‘మహా సముద్రం’. అదితీరావు హైదరి, అనూ ఇమ్మాన్యుయేల్‌ హీరోయిన్లు. సుంకర రామబ్రహ్మం నిర్మాత. విజయదశమి సందర్భంగా అక్టోబర్‌ 14న విడుదల కానుంది. గురువారం ట్రైలర్‌ విడుదల చేశారు.


అజయ్‌ భూపతి మాట్లాడుతూ ‘‘సముద్రం ఒక్కోసారి ప్రశాంతంగా ఉంటుంది. ఒక్కోసారి ఎగసి పడుతుంది. మరి, ప్రశాంతంగా ఉండేది ఎవరు? ఎగసి పడేదెవరు? అనేది సినిమాలో చూడాలి.  మహా అనేది అమ్మాయి పేరు. శర్వా, సిద్ధూ, జగపతిబాబు, రావు రమేశ్‌ తదితర పాత్రల మధ్య భావోద్వేగమే ‘మహా సముద్రం’. ‘ఆర్‌ఎక్స్‌ 100’ తర్వాత ఇద్దరు హీరోలను పట్టుకోవడం కష్టం కావడంతో సినిమా ఆలస్యంగా ప్రారంభించా’’ అన్నారు. ‘‘సినిమాలో ఓ పాత్రకు సిద్ధార్థ్‌ను అనుకుంటున్నామనగానే... అతనే కావాలని పట్టుబట్టా. అనవసర పాత్రలు లేకుండా... కథలోంచి బయటకు వెళ్లకుండా తొమ్మిది పాత్రలతో సినిమాను అజయ్‌ భూపతి చక్కగా తీశాడు’’ అని శర్వానంద్‌ చెప్పారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు చేతన్‌ భరద్వాజ్‌, ఛాయాగ్రాహకుడు రాజ్‌ తోట పాల్గొన్నారు.