మహా రగడ

ABN , First Publish Date - 2022-08-11T07:02:04+05:30 IST

విపక్ష కార్పొరేటర్లు ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డుల్లో ప్రొటోకాల్‌ ఉల్లంఘన, టిడ్కో ఇళ్ల డీడీల అంశాలపై అధికార, ప్రతిపక్ష సభ్యుల నడుమ చోటుచేసుకున్న వాద,ప్రతివాదనలతో జీవీఎంసీ కౌన్సిల్‌ సమావేశం దద్దరిల్లిపోయింది.

మహా రగడ

ప్రొటోకాల్‌ ఉల్లంఘనపై నిలదీసిన విపక్ష కార్పొరేటర్లు

తమపై పోటీ చేసి ఓడిపోయిన వైసీపీ నేతలతో

వార్డుల్లో కార్యక్రమాలను ప్రారంభింపజేయడమేమిటంటూ ఆగ్రహం

కలెక్టర్‌ సూచన మేరకు ప్రొటోకాల్‌ అమలు చేస్తామని కమిషనర్‌ ప్రకటన 

ఇప్పటివరకూ అందిన ఫిర్యాదులపై ఎటువంటి చర్యలు తీసుకున్నారో తెలపాలంటూ విపక్షాల పట్టు

పట్టించుకోకుండా అజెండాపై చర్చ ప్రారంభించాలని మేయర్‌ ఆదేశం

కార్యదర్శిని అడ్డుకున్న టీడీపీ సభ్యులు

ప్లకార్డులతో మేయర్‌కు వ్యతిరేకంగా నినాదాలు

విపక్ష సభ్యులను డిప్యూటీ మేయర్‌ కటుమూరి సతీష్‌ నెట్టేయడంతో వివాదం

ఇరువర్గాల మధ్య తోపులాట

 గందరగోళం మధ్యనే అజెండాలోని అంశాలను ఆమోదించినట్టు ప్రకటించిన మేయర్‌

టిడ్కో ఇళ్లకు కట్టిన డీడీలు తక్షణమే వెనక్కి ఇవ్వాలని ఎమ్మెల్యే వెలగపూడి డిమాండ్‌


విశాఖపట్నం, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి):

విపక్ష కార్పొరేటర్లు ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డుల్లో  ప్రొటోకాల్‌ ఉల్లంఘన, టిడ్కో ఇళ్ల డీడీల అంశాలపై అధికార, ప్రతిపక్ష సభ్యుల నడుమ చోటుచేసుకున్న వాద,ప్రతివాదనలతో జీవీఎంసీ కౌన్సిల్‌ సమావేశం దద్దరిల్లిపోయింది. ఒకానొక దశలో వైసీపీ, టీడీపీ కార్పొరేటర్ల నడుమ తోపులాట జరిగింది. ఈ గందరగోళం మధ్య చర్చ జరగకుండానే అజెండాలోని అంశాలను ఆమోదించినట్టు మేయర్‌ ప్రకటించేసి తన ఛాంబర్‌కు వెళ్లిపోయారు. ఆమె వైఖరిని ఖండిస్తూ విపక్ష సభ్యులు పోడియం ముందు బైఠాయించి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 

మేయర్‌ గొలగాని హరివెంకటకుమారి అధ్యక్షతన బుధవారం మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) సమావేశం ప్రారంభమైంది. ఎజెండాలోని అంశాలపై చర్చతో సమావేశం ప్రారంభిస్తున్నట్టు ఆమె ప్రకటించగా...జీరో అవర్‌ కోసం విపక్ష సభ్యులు పట్టుబట్టారు. అందుకు మేయర్‌ ససేమిరా అనడంతో టీడీపీ, జనసేన, సీపీఎం, సీపీఐ, బీజేపీ కార్పొరేటర్లు ఆమె పోడియం వద్దకు వెళ్లి నినాదాలు చేశారు. దీంతో మేయర్‌ గంటసేపు జీరో అవర్‌ ఇస్తున్నట్టు ప్రకటించారు. జీరో అవర్‌ ప్రారంభంలో తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు మాట్లాడుతూ టిడ్కో ఇళ్ల కోసం నగరంలో మూడేళ్ల కిందట 43,844 మంది డీడీలు కట్టారన్నారు. అందులో 25,590 మంది 430 చదరపు అడుగుల ఇళ్ల కోసం రూ.లక్ష చొప్పున, 365 చదరపు అడుగుల ఇళ్ల కోసం 6,781 మంది రూ.25 వేలు చొప్పున, 300 చదరపు అడుగుల ఇళ్ల కోసం 11,473 మంది రూ.500 చొప్పున మొత్తం రూ.80 నుంచి రూ.90 కోట్లు డీడీల రూపంలో జీవీఎంసీ కమిషనర్‌కు చెల్లించారన్నారు. ఆ మొత్తంలో రూ.40 కోట్లు ఒకసారి, రూ.12 కోట్లు మరోసారి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించగా, మిగిలిన మొత్తం జీవీఎంసీ కమిషనర్‌ ఖాతాలోనే ఉందన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనర్హులుగా తేల్చిన వారితోపాటు, అర్హులైనప్పటికీ ఇళ్లు దక్కని లబ్ధిదారులకు ఇప్పటికీ డీడీలు వెనక్కి ఇవ్వలేదన్నారు. నాలుగైదేళ్ల కిందట అప్పులు చేసి డీడీలు కట్టిన వారంతా ఇటు ఇళ్లు రాక, అటు డీడీలు వెనక్కి రాక తీవ్ర ఇబ్బంది పడుతున్నారన్నారు. తక్షణం వారి డీడీలను వెనక్కి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. దీనికి వైసీపీ ఫ్లోర్‌ లీడర్‌ బాణాల శ్రీనివాసరావు మాట్లాడుతూ టిడ్కో ఇళ్ల పాపం టీడీపీదేనని, ఆ పార్టీ ఎమ్మెల్యేగా వెలగపూడి రామకృష్ణబాబు దీనిపై ప్రశ్నించడం సరికాదనడంతో టీడీపీ కార్పొరేటర్లు గంధం శ్రీనివాసరావు, పల్లా శ్రీనివాసరావు, పీవీ నరసింహం లేచి అభ్యంతరం తెలిపారు. తమ ప్రభుత్వ హయాంలో టిడ్కో ఇళ్లు ఏ దశలో ఉన్నాయో...మూడున్నరేళ్ల వైసీపీ పాలన తర్వాత కూడా అక్కడే ఉన్నాయన్నారు. కేవలం పార్టీ రంగులు వేసుకున్నారే గానీ ఒక్క ఇటుక కూడా వేయలేదని ఎదురుదాడి చేశారు. దీంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొనడంతో మేయర్‌ జోక్యం చేసుకుని అధికారులతో వివరణ ఇప్పించారు. వీలైనంత త్వరలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు డీడీలను వెనక్కి ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 

అనంతరం టీడీపీ సహా విపక్ష కార్పొరేటర్లు తమ వార్డుల్లో  కార్యక్రమాల నిర్వహణ సమయంలో అధికారులు ప్రొటోకాల్‌ పాటించడం లేదని ప్లకార్డులు ప్రదర్శించడంతో మేయర్‌ చర్చకు అనుమతించారు. టీడీపీ కార్పొరేటర్‌ బమ్మిడి రమణ  (89వ వార్డు) మాట్లాడుతూ తన వార్డులో తనకు సమాచారం ఇవ్వకుండానే అభివృద్ధి పనులకు అక్కడి వైసీపీ సమన్వయకర్త కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించేస్తున్నారని, దీనిపై ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ భాస్కరబాబును అడిగితే ఎమ్మెల్యే లెటర్‌ తీసుకుని రావాలని చెబుతున్నారంటూ మండిపడ్డారు. ఎమ్మెల్యే నుంచి లెటర్‌ తెచ్చుకోవాలంటే తాను కార్పొరేటర్‌గా గెలిచింది ఎందుకో చెప్పాలని మేయర్‌ ప్రశ్నించారు. ప్రొటోకాల్‌ అమలు జరిగేలా తీర్మానం చేయాలని మేయర్‌ను కోరారు. ఏడో వార్డు కార్పొరేటర్‌ పిళ్లా మంగమ్మ మాట్లాడుతూ తమపై ఓడిపోయినవారు ఏ హక్కుతో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తున్నారని ప్రశ్నించారు. జనసేన కార్పొరేటర్‌ మూర్తియాదవ్‌ మాట్లాడుతూ తమ వార్డుల్లో ప్రొటోకాల్‌ ఉల్లంఘనపై ఇంతవరకూ అందిన ఫిర్యాదులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో సభకు కమిషనర్‌ వివరించాలని డిమాండ్‌ చేశారు. జనసేన కార్పొరేటర్‌ దల్లి గోవిందరావు మాట్లాడుతూ తన వార్డులో జరిగే పనులకు తనను పిలవొద్దని గాజువాక ఎమ్మెల్యే అధికారులకు చెబుతున్నారని, తాను వస్తే ఆయన రానని కూడా బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారని ఆరోపించారు. దీనికి సంబంధించిన ఆధారాలన్నీ తన వద్ద ఉన్నాయని, మేయర్‌ అనుమతిస్తే వాటిని సభలో ప్రదర్శిస్తానన్నారు. దీనిపై మేయర్‌ స్పందించి ఇకపై ఇలాంటి చర్యలకు పాల్పడిన అధికారులపై కఠిన చర్యలు తప్పవని, ప్రొటోకాల్‌ అమలుపై సభ్యులకు వివరణ ఇవ్వాలంటూ కమిషనర్‌ను ఆదేశించారు. జిల్లా కలెక్టర్‌ సూచన మేరకు తాము ప్రొటోకాల్‌ అమలు చేస్తామని ఆయన చెప్పడంతో సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఇంతవరకూ అందిన ఫిర్యాదులపై తీసుకున్న చర్యలను వివరించాలని పట్టుబట్టారు. ఈ దశలో జీరో అవర్‌ ముగిసినందున అజెండాలో అంశాలపై చర్చ ప్రారంభిస్తున్నట్టు మేయర్‌ ప్రకటించడంతో టీడీపీ, జనసేన, సీపీఎం, బీజేపీ సభ్యులు మేయర్‌ పోడియంను చుట్టుముట్టి ప్రొటోకాల్‌ అమలుపై తీర్మానం చేయాలని పట్టుబట్టారు. అయినప్పటికీ అజెండాలోని అంశాలను కార్యదర్శి నల్లనయ్య చదివి వినిపిస్తుండడంతో విపక్ష సభ్యులు ఆయన టేబుల్‌ వద్దకు వెళ్లి అడ్డుకున్నారు. ఆ సమయంలో డిప్యూటీ మేయర్‌ కటుమూరి సతీష్‌ ఆవేశంగా వెళ్లి టీడీపీ సభ్యులు గంధం శ్రీనివాసరావు, బొండా జగన్‌లను వెనక్కి నెట్టేయడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఇరువర్గాల అరుపులు, కేకలతో కౌన్సిల్‌హాలు దద్దరిలింది. 

ఐదు నిమిషాల్లో 16 అంశాలు ఆమోదం

సభలో ఒకవైపు తీవ్ర గందరగోళ పరిస్థితులు కొనసాగుతుండగానే ప్రధాన అజెండాలోని ఆరు అంశాలు, అనుబంధ అజెండాల్లోని ఆరు అంశాలతోపాటు టేబుల్‌ అజెండాలోని మరో నాలుగు అంశాలను ఎలాంటి చర్చ లేకుండా ఆమోదిస్తున్నట్టు మేయర్‌ ప్రకటించారు. అనంతరం వడివడిగా ఆమె తన ఛాంబర్‌కు వెళ్లిపోవడంతో విపక్ష సభ్యులు కొంతసేపు ఆమె పోడియం వద్ద బైఠాయించి మేయర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కౌన్సిల్‌హాలు నుంచి బయటకు వచ్చి పోర్టికో వద్ద పార్కింగ్‌ చేసి వున్న మేయర్‌ కారు ముందు బైఠాయించి నిరసన తెలిపారు. 


Updated Date - 2022-08-11T07:02:04+05:30 IST