Maha Political Crisis: ముగిసిన మహారాష్ట్ర కేబినెట్ భేటీ.. సీఎం పదవిపై ఉద్ధవ్ తీసుకున్న నిర్ణయం ఇది..

ABN , First Publish Date - 2022-06-29T00:17:40+05:30 IST

మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం ఉత్కంఠ రేపుతున్న ప్రస్తుత తరుణంలో ముంబైలో కేబినెట్ భేటీ ముగిసింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే అధ్యక్షతన..

Maha Political Crisis: ముగిసిన మహారాష్ట్ర కేబినెట్ భేటీ.. సీఎం పదవిపై ఉద్ధవ్ తీసుకున్న నిర్ణయం ఇది..

ముంబై: మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం ఉత్కంఠ రేపుతున్న ప్రస్తుత తరుణంలో ముంబైలో కేబినెట్ భేటీ ముగిసింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే అధ్యక్షతన జరిగిన ఈ కేబినెట్ భేటీకి సంకీర్ణ ప్రభుత్వంలోని కాంగ్రెస్, ఎన్సీపీ మంత్రులు హాజరయ్యారు. సీఎం ఉద్ధవ్ ఠాక్రే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేబినెట్ సమావేశానికి హాజరయ్యారు. ఆదిత్య ఠాక్రే తప్ప శివసేన నుంచి మంత్రి పదవులు దక్కించుకున్న ఎమ్మెల్యేలంతా ఏక్‌నాథ్ షిండే క్యాంపులో ఉండటంతో ఉద్ధవ్ ఠాక్రే, ఆదిత్య ఠాక్రే మాత్రమే శివసేన నుంచి కేబినెట్ భేటీకి హాజరు కావడం గమనార్హం. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా రాజీనామా చేసేందుకు ఉద్ధవ్ సుముఖంగా లేనట్లు తాజా సమాచారం. ఏక్‌నాథ్ షిండే క్యాంపులో చేరిన మంత్రుల సంగతి పక్కనపెడితే మిగిలిన మంత్రుల మద్దతు ఉండటంతో సీఎం పదవిలోనే కొనసాగాలని ఉద్ధవ్ నిర్ణయించుకున్నట్లు తెలిసింది. కేబినెట్ భేటీ కంటే ముందు ఉద్ధవ్ ఠాక్రే సంకీర్ణ ప్రభుత్వంలో భాగమైన పార్టీల పెద్దలతో ఫోన్ ద్వారా చర్చలు జరిపినట్లు తెలిసింది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా, ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో ఉద్ధవ్ ఠాక్రే ఫోన్‌లో మాట్లాడినట్లు సమాచారం. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయవద్దని సోనియా, పవార్ ఉద్ధవ్‌కు సూచించినట్లు తెలిసింది.



కేబినెట్ భేటీ అనంతరం.. మహారాష్ట్ర మంత్రి సుభాష్ దేశాయ్ మాట్లాడుతూ.. బుధవారం కూడా మంత్రివర్గం భేటీ అవుతుందని చెప్పారు. ప్రభుత్వంలో అంతా సాధారణ పరిస్థితులే ఉన్నాయని చెప్పడం కొసమెరుపు. మరో మంత్రి షేక్ అస్లాం మాట్లాడుతూ.. మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం గురించి చర్చించాల్సిన అవసరమే లేదన్నారు. ముఖ్యమంత్రి ఉద్ధవ్‌కు తమ సంపూర్ణ మద్దతు ఉందని చెప్పారు. ఇదిలా ఉండగా.. ఏక్‌నాథ్ షిండే క్యాంపు కూడా ఉద్ధవ్ ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టేందుకు వేగంగా పావులు కదుపుతోంది. ఏక్‌నాథ్ షిండే క్యాంపులోని 9 మంది రెబల్ ఎమ్మెల్యేలు సంకీర్ణ ప్రభుత్వానికి తమ మద్దతు ఉపసంహరించుకున్నట్లు గవర్నర్‌కు లేఖ రాయాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఇక ఈ పరిణామాలపై మహారాష్ట్ర బీజేపీ వడివడిగా అడుగులేస్తోంది. మహారాష్ట్ర బీజేపీలో కీలక నేతగా ఉన్న ఫడణవీస్ ఢిల్లీకి వెళ్లి బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభంపై ఆయనతో చర్చలు జరిపారు. అమిత్‌షాతో కూడా ఫడణవీస్ చర్చలు జరిపే అవకాశమున్నట్లు తెలిసింది. 

Updated Date - 2022-06-29T00:17:40+05:30 IST