Padayatra: మహాపాదయాత్రకు ఆటంకం సృష్టించేలా వైసీపీ నేతలకు కుయుక్తులు

ABN , First Publish Date - 2022-09-25T16:47:06+05:30 IST

మహాపాదయాత్ర (Mahapadayatra)కు ఆటంకం కలిగించేలా వైసీపీ నేతలు కుయుక్తులు పన్నారు.

Padayatra: మహాపాదయాత్రకు ఆటంకం సృష్టించేలా వైసీపీ నేతలకు కుయుక్తులు

కృష్ణాజిల్లా (Krishna Dist.): అమరావతి రైతుల మహాపాదయాత్ర (Mahapadayatra)కు ఆటంకం కలిగించేలా వైసీపీ (YCP) నేతలు కుయుక్తులు పన్నారు. పాదయాత్ర కొనసాగే నందివాడ మండలం ప్రధాన రహదారికి అడ్డంగా మరమ్మత్తుల పేరుతో ఇసుక టిప్పర్ లారీ నిలిపివేశారు. ఆ టిప్పర్ లారీ నందివాడ ఎంపీపీ పేయ్యల అదాంకు చెందినదిగా గుర్తించారు. టిప్పర్ డ్రైవర్ అందుబాటులో లేకపోవడంతో, పోలీసులు జేసీబీ సహాయంతో టిప్పర్‌ను తొలగించారు. దీంతో పాదయాత్ర కొనసాగుతోంది.


కాగా నిన్న బొమ్ములూరు మీదుగా మహాపాదయాత్ర గుడివాడలోకి ప్రవేశించింది. అక్కడి శరత్‌ థియేటర్‌ సెంటర్‌ వద్ద కొంకితల ఆంజనేయ ప్రసాద్‌, మరో ఇద్దరు వైసీపీ నాయకులు పాదయాత్ర చేస్తున్న రైతులను, వారికి సంఘీభావం తెలిపేందుకు వచ్చిన వారిని రెచ్చగొడుతూ తొడలుచరిచారు. పాదయాత్రలో ఉన్నవారు కొంత సంయమనం పాటించినప్పటికీ... మరింతగా వైసీపీ నాయకులు రెచ్చగొడుతూ కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. దీనిని తట్టుకోలేకపోయిన ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు.... వచ్చే ఎన్నికల్లో మీసంగతి చూస్తామంటూ చెప్పును తీసి చూపించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పాదయాత్ర చేస్తున్న వారిని ముందుకువెళ్లకుండా పోలీసులు బారికేడ్లను ఏర్పాటుచేశారు.


వైసీపీ నాయకులకు, రైతులకు మధ్య వాగ్వాదం జరుగుతున్న సమయంలో పోలీసులు పాదయాత్ర చేస్తున్న రైతులను నెట్టివేశారు. దీనిపై స్వల్ప తోపులాట చోటుచేసుకుంది. నెహ్రూ చౌక్‌ సెంటర్‌ వద్దకు యాత్ర రాగానే.. దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను ఏలూరుకు చెందిన న్యాయవాది, రైతు అభినయశ్రీ సింధూర ‘అన్నా తొడగొట్టన్నా’ అని కోరారు. ‘నేనెందుకమ్మా నువ్వే పైకివచ్చి తొడగొట్టం’టూ ఆమెను ప్రభాకర్‌ ప్రోత్సహించారు. వ్యాన్‌పైకి వచ్చిన సింధూర తొడగొట్టి ‘గుడివాడ వచ్చా’మంటూ సవాల్‌ విసిరారు. వీకేఆర్‌ అండ్‌ వీఎన్‌వీ ఇంజనీరింగ్‌ కాలేజీ ప్రాంగణంలో మరోసారి ఆమె అదే పనిచేశారు. 

Updated Date - 2022-09-25T16:47:06+05:30 IST