మహా నీటి ప్రణాళిక

ABN , First Publish Date - 2022-01-19T06:17:27+05:30 IST

భవిష్యత్తులో తాగునీటికి ఇబ్బంది తలెత్తకుండా మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) అధికారులు తగిన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం యునైటెడ్‌ నేషన్స్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ (యూఎన్‌డీపీ) ఆధ్వర్యంలో నగర నీటి స్థితిస్థాపక ప్రణాళిక (సిటీ వాటర్‌ రిసిలియన్స్‌) రూపొందిస్తున్నారు.

మహా నీటి ప్రణాళిక

భవిష్యత్తు అవసరాలు, అందుబాటులో ఉన్న వనరులపై అధ్యయనం

భూగర్భ నీటి మట్టం పెంచేందుకు చర్యలు

రానున్న రోజుల్లో ఇబ్బందులు తలెత్తకుండా ముందు జాగ్రత్త

యూన్‌డీపీ ఆధ్వర్యంలో ప్రతిపాదనలు

స్వీడన్‌కు చెందిన సంస్థ సాంకేతిక సహకారం


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

భవిష్యత్తులో తాగునీటికి ఇబ్బంది తలెత్తకుండా మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) అధికారులు తగిన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం యునైటెడ్‌ నేషన్స్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ (యూఎన్‌డీపీ) ఆధ్వర్యంలో నగర నీటి స్థితిస్థాపక ప్రణాళిక (సిటీ వాటర్‌ రిసిలియన్స్‌) రూపొందిస్తున్నారు. 

నగరంలో తాగునీటికి ప్రస్తుతం 90 ఎంజీడీల వరకూ అవసరమవుతోంది. ప్రజలు తమ ఇతర అవసరాల కోసం దీనికి పది రెట్లు వరకూ నీటిని భూగర్భం నుంచి బోర్లు ద్వారా తోడుకుంటున్నారు. భవిష్యత్తులో నగర జనాభా మరింత పెరగనున్నది. ఈ నేపథ్యంలో నీటి వినియోగం భారీగా పెరుగుతుందని ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో జీవీఎంసీలో పనిచేస్తున్న యునైటెడ్‌ నేషన్స్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ (యూఎన్‌డీపీ) అంచనా వేస్తోంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని నగరంలో భూగర్భ జలాలను ఇప్పటి నుంచే అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం వుందని జీవీఎంసీకి యూఎన్‌డీపీ నివేదించింది. దీంతో నగరంలో భూగర్భ జలాలు పెంపొందించేందుకు తీసుకోవలసిన చర్యలపై ప్రతిపాదనలు అందజేయాలని జీవీఎంసీ కోరింది. ఈ మేరకు సిటీ వాటర్‌ రిసిలియన్స్‌ పేరుతో యూఎన్‌డీపీ అధికారులు భవిష్యత్తులో నీటి అవసరాలు, అందుబాటులో ఉన్న వనరులు, ఎదురయ్యే ఇబ్బందులు, వాటికి గల పరిష్కారాలపై సమగ్ర అధ్యయనం చేయనున్నారు. అలాగే భవిష్యత్తులో భూగర్భ జలాల క్షీణత, దానికి అడ్డుకట్ట వేసేందుకు తీసుకోవాల్సిన చర్యలు, నీటి నాణ్యతను పెంపొందించడం, వరదలు, తుఫాన్లతోపాటు వేసవిలో ఎద్దడి వంటి సమస్యలకు పరిష్కారాలను కూడా నివేదికలో పొందుపరచనున్నారు. దీనికి సాంకేతిక సహకారం అందించేందుకు స్వీడన్‌కు చెందిన స్టాక్‌హోమ్‌ ఇంటర్‌నేషనల్‌ వాటర్‌ ఇనిస్టిట్యూట్‌తోపాటు నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ అర్బన్‌ అఫైర్స్‌ (ఎన్‌ఏయూఏ) ముందుకు వచ్చినట్టు జీవీఎంసీ అధికారి ఒకరు తెలిపారు. ఈ  అధ్యయనంలో 12 అంశాలపై ప్రధానంగా దృష్టిసారించనున్నట్టు వివరించారు. ప్రభుత్వం, ప్రజా ప్రతినిధుల నుంచి సహకారం, ఆర్థిక వనరుల అనుకూలత, నిర్వహణ విధానంపై కూడా అధ్యయనం చేసి సూచనలు అందజేస్తారని తెలిపారు. దీనికి సంబంధించిన పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ కూడా ఇటీవల జరిగిందని, దీనికి జీవీఎంసీ కమిషనర్‌తోపాటు మేయర్‌ కూడా హాజరైనట్టు తెలిపారు. దీనికి సంబంధించి ఇంకా అధికారికంగా కమిషనర్‌ ఉత్తర్వులు జారీచేయాల్సి ఉందన్నారు. 

Updated Date - 2022-01-19T06:17:27+05:30 IST