మహా నీరా‘జనం’

ABN , First Publish Date - 2022-09-24T06:35:22+05:30 IST

మహా నీరా‘జనం’

మహా నీరా‘జనం’
రెడ్డిపాలెంలో సూర్యరథానికి స్వాగతం పలుకుతున్న పిన్నమనేని, రావి

అమరావతి రైతుల మహాపాదయాత్రకు అడుగడుగునా అపూర్వ స్వాగతం

మహాపాదయాత్రకు సంఘీభావంగా వెల్లువలా తరలి వచ్చిన జనం

కిక్కిరిసిన పెడన వీధులు..ఒక రాష్ట్రం..ఒకే రాజధాని అంటూ నినాదాలు

గుడివాడ నియోజకవర్గంలోకి యాత్ర ప్రవేశం.. రెడ్డిపాలెంలో ఘనస్వాగతం పలికిన  ప్రజలు, టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు


మచిలీపట్నం టౌన్‌/పెడన/గుడ్లవల్లేరు, సెప్టెంబరు 23: బైరాగి పాలెంలోని హర్ష కళాశాల నుంచి శుక్రవారం ఉదయం ప్రారంభమైన పాద యాత్ర హుస్సేన్‌పాలెం మీదుగా పెడన నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఫ్లై ఓవర్‌ వద్ద పాదయాత్రకు అఖండ స్వాగతం లభించింది. టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్‌, సీపీఎం, సీపీఐ నాయకులు పాదయాత్రకు ఎదురేగి డప్పు వాయిద్యాలు, తీన్మార్‌ వాయిద్యాలతో పాదయాత్రీకులకు స్వాగతం పలికారు. పెడన పట్టణంలోకి ప్రవేశించాక ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పలికారు. పాదయాత్రీకులపై భారీ పూల వర్షం కురిపించారు. ముఖ్యమైన కూడళ్లలో మహిళలు హారతులిచ్చారు. మునిసిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ బొడ్డు పద్మజా కుమారి, కౌన్సిలర్‌ అనుముల నాగమల్లేశ్వరమ్మ, తెలుగు మహిళలతో కలిసి గూడూరు రోడ్డు సెంటర్‌లో ఘనంగా స్వాగతం పలికారు. బస్టాండ్‌ సెంటర్‌లో సీపీఎం నాయకులు కలంకారీ కర్చీఫ్‌లను పంపిణీ చేశారు. పెడన పట్టణంలో నడక ముగిశాక మండలంలోని కొంకేపూడి, నడుపూరు గ్రామాల మీదుగా గుడి వాడ నియోజకవర్గంలోకి యాత్ర ప్రవేశించింది. పెడన నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి కాగిత కృష్ణప్రసాద్‌, రాష్ట్ర బీసీ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ బొడ్డు వేణు గోపాలరావు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ రావు, మాజీ డిప్యూటీ స్పీకర్‌ బూరగడ్డ వేదవ్యాస్‌, టీడీపీ గుడివాడ ఇన్‌చార్జి రావి వెంకటేశ్వరరావు, బందరు మునిసిపల్‌ మాజీ చైర్మన్‌ మోటమర్రి బాబా ప్రసాద్‌, గోపు సత్యనారాయణ, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ, ఆ పార్టీ పెడన నియోజకవర్గ నాయకుడు సమ్మెట బాబు, కాంగ్రెస్‌ నాయకులు ఎండీ మతీన్‌, సి.హెచ్‌.వి.అప్పారావు, ఆకురాతి జనార్దన్‌, పడమట బాబీ, కె.వి.నాగభూషణం, సీపీఎం నాయకులు గోరు రాజు, వాసా గంగాధర రావు, ఉట్ల పేరయ్యలింగం, పంచల నరసింహారావు, సీపీఐ నాయకులు కట్టా హేమసుందరరావు, మోదుమూడి రామారావు సంఘీభావం తెలిపారు.

పూలవర్షం

హుస్సేన్‌పాలెం సెంటర్‌లో అమరావతి రైతులపై సముద్రాలు, కృష్ణ, నాగ రాజు తదితరులు పూలవర్షం కురిపించారు. రథానికి గుమ్మడికాయలతో దిష్టి తీశారు. మహిళలు మంగళహారతులిచ్చారు. మహిళా రైతులకు పలువురు మహిళలు ఘన స్వాగతం పలికారు. అమరావతి రైతులకు హుస్సేన్‌పాలెంలో నడుము ఒంగిపోయిన 90 ఏళ్ళ వృద్ధ మహిళ స్వాగతం పలికి మహిళలతో పాటు పాదయాత్రలో పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

నూట ఎనిమిది టెంకాయలు కొట్టి.. 

తొమ్మిది గుమ్మడి కాయలతో దిష్టి తీసి..

పాదయాత్ర మధ్యాహ్నం గుడ్లవల్లేరు మండలానికి చేరుకుంది. మండల రైతులు, ప్రజలు భారీగా స్వాగతం పలికారు. గుడ్లవల్లేరు గ్రామం నుంచి వల్లభనేని వెంకట్రావు, పొట్లూరి రవికుమార్‌ ఆధ్వర్యంలో గ్రామస్థులు, రైతులు మజ్జిగ, వాటర్‌ బాటిల్స్‌, జామపండ్లను పంపిణీచేశారు. అడుసుమిల్లి రామ్మోహనరావు(చంద్రాల చిట్టిబాబు), అట్లూరి స్వరూప్‌ ఆద్వర్యంలో మం డలంలోని గ్రామాల నుంచి టీడీపీ శ్రేణులు యవత భారీ సంఖ్యలో తరలి వచ్చారు. గుడ్లవల్లేరు రైతులు, గ్రామస్థుల ఆద్వర్యంలో అమరావతి రైతులు మండల పొలిమేరకు రెడ్డిపాలెంలో అడుగు పెడుతుండగా నూట ఎనిమిది టెం కాయలు కొట్టి, తొమ్మిది గుమ్మడికాయలతో దిష్టి తీసి, పసుపు నీటితో మహిళలు వారపోసి, హారతులు ఇచ్చి సూర్యరథానికి, పాదయాత్ర రైతులకు ఘన స్వాగతం పలికారు.

టీడీపీ, బీజేపీ, జనసేన సంఘీభావం

గుడివాడ నియోజకవర్గం నుంచి టీడీపీ ఇన్‌చార్జ్‌ రావి వెంకటేశ్వరరావు, మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు, గుడివాడ అర్భన్‌ బ్యాంక్‌ చైర్మన్‌ పిన్నమనేని పూర్ణవీరయ్య( బాజ్జి), బీజేపీ నుంచి రాష్ట్ర నాయకుడు రామినేని వెంకటకృష్ణ, జనసేన నుంచి గుడివాడ పార్టీ ఇన్‌చార్జ్‌ బూరగడ్డ శ్రీకాంత్‌ తదితరులు యాత్రకు స్వాగతం పలికారు. 

పాదయాత్ర సాగిందిలా..

గుడ్లవల్లేరు మండలం రెడ్డిపా లెంలో ప్రారంభమై వడ్లమన్నాడు, వేమవరం, కొండాలమ్మ ఆలయం, పద్మాలపాలెం, కౌతవరం వరకూ సాగింది. అడుగడుగునా రైతులు పూలజల్లులు కురిపిస్తూ స్వాగతం పలికారు. కౌతవరం గ్రామ రైతులు రెండు క్వింటాళ్ల పూలను పాదయాత్రీకులపె చల్లారు. కౌతవరం సాయిబాబా మందిరంలో అమరావతి జేఏసీ రైతులు శివారెడ్డి, రాయపాటి శైలజ, కొలికలపూడి శ్రీనివాస్‌, గద్దె తిరుపతిరావు, బాలకోటయ్య, యుగంధర్‌ పూజలు నిర్వహించారు. వారిని ఆలయ చైర్మన్‌ కానూరి బాలు, సభ్యులు సన్మానించారు.

 ‘ఆంధ్రజ్యోతి’ ఉద్యమానికి ఊతమిస్తోంది

ఆంధ్రజ్యోతిలో అమరావతి రైతుల పాదయాత్ర కథనాలపై పాదయాత్రలో పాల్గొన్న రైతులు స్పందించారు. ఆంధ్రజ్యోతి తమ ఉద్యమానికి ఎంతో ఊతమిస్తోందని అమరావతి పరిరక్షణ సమితి ప్రతినిధులు రామిరెడ్డి, ఆకుల ఉమామమేశ్వరరావు పేర్కొన్నారు. రాయపాటి శైలజ కథనాలను చూసి ముగ్ధులయ్యారు.

విరాళాల వెల్లువ..

రాజధాని రైతుల మహాపాదయాత్రకు పెడన నియోజకవర్గం కృత్తివెన్ను మండల రైతులు రూ.1.75 లక్షలను విరాళంగా అందజేశారు. గుడ్లవల్లేరు మండలం వడ్లమన్నాడు రైతులు రూ.86 వేలు, వేమవరం రైతులు రూ.30 వేలు, కౌతవరంలో రూ. లక్ష 28 వేలు, కొంతమంది రైతులు రూ.5 వేల నుంచి రూ.20 వేల వరకు అందజేశారు. ఉలవలపూడి రైతులు రూ 15 వేలు, పెడనలో మునిసిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ బొడ్డు పద్మజాకుమారి రూ. 35 వేల ఒక్క రూపాయి విరాళంగా ఇచ్చి మద్దతు పలికారు.

చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించే యాత్ర

రాష్ట్రానికి ఏకైక రాజధాని అమరావతి ఉండాలంటూ అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినది అని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర అన్నారు. హర్ష కళా శాలలో బస చేసిన అమరావతి రైతులకు కొల్లు రవీంద్ర, టీడీపీ మచిలీపట్నం పార్లమెంటు అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు, తెలుగు రైతు మచిలీపట్నం పార్లమెంటు అధ్యక్షుడు గోపు సత్యనారాయణ అల్పాహారం వడ్డించారు. హర్ష కళాశాలలో డాక్టర్‌ రావి శ్రీనివాసరావు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. రైతులకు రూ. 20 వేల మందులు అందజేశారు. అనంతరం హర్ష కళాశాల వద్ద జరిగిన వేంకటేశ్వరస్వామి అర్చనల్లో కాగిత కృష్ణప్రసాద్‌తో పాటు కొల్లు రవీంద్ర, కొనకళ్ల నారాయణ, గొర్రెపాటి గోపీచంద్‌, మోటమర్రి బాబాప్రసాద్‌, పిప్పళ్ల కాంతారావు తెలుగు మహిళలు లంకిశెట్టి నీరజ, పాలపర్తి పద్మజపాల్గొన్నారు. కృష్ణాజిల్లాలో ప్రతి నియోజకవర్గంలోనూ రైతులు పార్టీలకతీతంగా అమరావతి రైతుల యాత్రలో పాల్గొంటున్నారని కొనకళ్ల అన్నారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని సీఎం జగన్మోహనరెడ్డి విరమించుకోవాలని ఆయన సూచించారు.






రాజధానిగా కొనసాగించాలని అమరావతి రైతులు చేపట్టిన మహాపాదయాత్ర 12వ రోజు శుక్రవారం ఉదయం బైరాగిపాలెం హర్ష కళాశాల నుంచి పెడన పట్టణంలోకి ప్రవేశించింది.  అమరావతి రైతులకు పెడనలో ప్రజలు బ్రహ్మరథం పట్టారు. నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల నుంచి ప్రజలు తరలివచ్చి పాదయాత్రలో పాల్గొని జై అమరావతి, జై జై అమరావతి, ఒక రాష్ట్రం ఒకే రాజధాని అంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినదించారు. పట్టణంలోని ప్రధాన రహదారి కిక్కిరిసిపోయింది. నియోజకవర్గంలో పూర్తయిన పాదయాత్ర గుడ్లవల్లేరు మండలం రెడ్డిపాలెంలో గుడివాడ నియోజకవర్గంలోకి ప్రవేశించింది. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, స్థానికులు స్వాగతం పలికి..పాదయాత్రకు నీరా‘జనాలు’ పలికారు.


Updated Date - 2022-09-24T06:35:22+05:30 IST