‘మహా’ముస్తాబు

ABN , First Publish Date - 2022-05-25T05:25:00+05:30 IST

టీడీపీ మహానాడు జరిగే ప్రాంగణంలో సందడి సంద డి వాతావరణం కనిపిస్తోంది. ఆ కార్యక్రమ నిర్వహణకు సంబంధించిన పనులు చకచకా పూర్తవుతుండగా ఒకవైపు రాష్ట్ర, జిల్లాస్థాయి ముఖ్యనేతల పరిశీలనలు, మరోవైపు వివిధ ప్రాంతాల నుంచి ఉత్సాహంగా తరలివచ్చి ప్రాంగణాన్ని సందర్శిస్తున్న టీడీపీ కార్యకర్తలతో అక్కడ పండగ వాతావరణం నెలకొంది.

‘మహా’ముస్తాబు
ఆకట్టుకుంటున్న మండవవారిపాలెం గ్రామస్థులు ఏర్పాటు చేసిన స్వాగతఫ్లెక్సీ

నేతల పరిశీలనలు-ఉత్సాహంగా శ్రేణులు

సందడి సందడిగా మహానాడు ప్రాంగణం

చకచకా సాగుతున్న ఏర్పాట్లు, 

నేటి రాత్రికి కీలక పనులు పూర్తిపై దృష్టి

పరిశీలించిన యనమల, దేవినేని,  జిల్లా ముఖ్యనేతలు

జిల్లావ్యాప్తంగా తరలివచ్చి  చూసి వెళ్తున్న కార్యకర్తలు

నగరంలో అలంకరణ పనులు ప్రారంభం


తెలుగుదేశం పార్టీ మహానాడు జరిగే ప్రాంగణంలో సందడి సందడి వాతావరణం కనిపిస్తోంది. మహానాడు నిర్వహణకు సంబంధించిన పనులు చకచకా జరిగిపోతుండగా ఒకవైపు రాష్ట్ర, జిల్లాస్థాయి ముఖ్యనేతలు ఆ పనులు  పరిశీలనలు, మరోవైపు వివిధ ప్రాంతాల నుంచి ఉత్సాహంగా తరలివచ్చి ప్రాంగణాన్ని సందర్శిస్తున్న టీడీపీ కార్యకర్తలతో అక్కడ పండగ వాతావరణం నెలకొంది. ఎండలు తీవ్రస్థాయిలో ఉన్నప్పటికి ఒంగోలు పరిసర ప్రాంతాల నుంచే కాక జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా పెద్దసంఖ్యలో ద్వితీయశ్రేణి నాయకులు ప్రాంగణాన్ని చూసేందుకు వస్తున్నారు. 


ఒంగోలు, మే 24 (ఆంధ్రజ్యోతి) : టీడీపీ మహానాడు జరిగే ప్రాంగణంలో సందడి సంద డి వాతావరణం కనిపిస్తోంది. ఆ కార్యక్రమ నిర్వహణకు సంబంధించిన పనులు చకచకా పూర్తవుతుండగా ఒకవైపు రాష్ట్ర, జిల్లాస్థాయి ముఖ్యనేతల పరిశీలనలు, మరోవైపు వివిధ ప్రాంతాల నుంచి ఉత్సాహంగా తరలివచ్చి ప్రాంగణాన్ని సందర్శిస్తున్న టీడీపీ కార్యకర్తలతో అక్కడ పండగ వాతావరణం నెలకొంది. ఎండలు తీవ్రస్థాయిలో ఉన్నప్పటికీ ఒంగోలు పరిసర ప్రాంతాల నుంచే కాక జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ద్వితీయశ్రేణి నాయకులు ప్రాంగణాన్ని చూసేందుకు వస్తున్నారు. ఈ నెల 27, 28 తేదీల్లో మహానాడు ఒంగోలు వేదికగా జరగనున్న విషయం విదితమే. నగర సమీపంలోని మండవవారిపాలెం గ్రామ పొలాల్లో జరగనుండగా వారం క్రితం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు జిల్లా ముఖ్యనేతల సమక్షంలో ప్రాంగణంలో ఏర్పాట్ల పనులను ప్రారంభించారు. అప్పటి నుంచి శరవేగంగా పనులు సాగుతున్నాయి. తొలి రెండురోజులు భూమి చదును పనులు చేసి అనంతరం షెడ్ల నిర్మాణం చేపట్టారు.

ఎన్నెస్పీలో నాయకులతో సమావేశం

అనంతరం రాష్ట్ర నాయకులు ఎన్నెస్పీ అతిథిగృహంలో జిల్లా నాయకులతో సమావేశమై మహానాడు నిర్వహణకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. మరోవైపు మహానాడు ఒంగోలులో జరగనుండటం, అందుకు సంబంధించిన ఏర్పాట్లు వేగంగా పూర్తవుతున్న నేపథ్యంలో జిల్లాలోని టీడీపీ శ్రేణులు పెద్దసంఖ్యలో ప్రాంగణానికి తరలివస్తున్నారు. ఏర్పాట్లను ఆసక్తిగా తిలకించడంతోపాటు కార్యక్రమ వివరాలను ఆడిగి తెలుసుకోవడం కనిపిస్తోంది. అలా మంగళవారం జిల్లాలోని వివిధ ప్రాంతాలకు సంబంధించిన ద్వితీయశ్రేణి నేతలు అధికంగా ప్రాంగణం వద్దకు రావడం కనిపించింది. ఇదిలా ఉండగా మహానాడు రెండో రోజు జరిగే బహిరంగ సభకు జిల్లావ్యాప్తంగా భారీగా టీడీపీ శ్రేణులు తరలివచ్చేందుకు సిద్ధమవుతున్నారు. అందుకు వీలుగా ఆయా నియోజకవర్గాల్లో ముఖ్యనేతలు ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. 


ఒకే వేదికపై రెండు సభలు

ఒకే వేదికపై తొలిరోజు ప్రతినిధుల సభ, రెండోరోజు బహిరంగసభ జరగనుండగా దాదాపు 12 వేలమంది కూర్చునే విధంగా ప్రతినిధుల సభ షెడ్డు, దానికి దక్షిణంవైపు రక్తదాన శిబిరం, ఫొటో ఎగ్జిబిషన్‌తోపాటు మీడియా సెంటర్ల ఏర్పాటుకు నిర్మాణాలు పూర్తయ్యాయి. వేదిక నిర్మాణం చేస్తున్నారు. కొద్దిదూరంలో వేలాది మందికి భోజన సౌకర్యం కల్పనకు వీలుగా కర్రల షెడ్లు నిర్మిస్తున్నారు. మరోవైపు ప్రతినిధులకు ఇబ్బంది లేకుండా బయోటాయిలెట్లు, అలాగే ప్రాంగణానికి దగ్గరలోనే పార్కింగ్‌ సౌకర్యం కల్పిస్తున్నారు. అవి కూడా ఒక కొలిక్కి రాగా కీలకమైన ఆయా షెడ్ల అలంకరణ ఇతరత్రా పనులన్నీ బుధవారం సాయంత్రానికి పూర్తికానున్నాయి. పార్టీ రాష్ట్ర కార్యాలయానికి సంబంధించిన ఇద్దరు, ముగ్గురు కీలక వ్యక్తులు స్థానిక నేతలను సమన్వయం చేసుకుంటూ ముందుకుపోతున్నారు. నిత్యం పలువురు రాష్ట్ర, జిల్లా నేతలు సందర్శించి వాటిని పరిశీలన చేస్తూ సూచనలు చేస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, టీడీపీ కేంద్ర కార్యాలయ కార్యదర్శి టీడీ జనార్దన్‌లు మంగళవారం ప్రాంగణాన్ని సందర్శించారు. ఉమ్మడి జిల్లా టీడీపీ ముఖ్యనేతలైన ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, స్వామి, గొట్టిపాటి రవికుమార్‌, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జులు దామచర్ల జనార్దన్‌, ఉగ్రనరసింహారెడ్డి, బీఎన్‌ విజయకుమార్‌, దివి శివరాం, ఎరిక్షన్‌బాబు, ఇంటూరి నాగేశ్వరరావు, పమిడి రమేష్‌, ఒంగోలు పార్లమెంట్‌ పార్టీ అధ్యక్షుడు నూకసాని బాలాజీ, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామచర్ల సత్య ఇతర పలువురు ముఖ్యనేతలతో కలిసి ప్రాంగణాన్ని పరిశీలించారు. 


ఫ్లెక్సీలు.. పసుపు తోరణాలతో నగరం అలంకరణ

ఒంగోలు (కార్పొరేషన్‌), మే 24: స్వర్గీయ ఎన్టీఆర్‌ శతజయంతిని పురస్కరించుకుని ఒంగోలు సమీపంలో మండవవారిపాలెంలో నిర్వహిస్తున్న టీడీపీ మహానాడుకు ఒంగోలు నగరం, మండువవారిపాలెం ముస్తాబైంది. గత వారం, పదిరోజులుగా పనులు కొనసాగుతుండగా, గత రెండురోజుల నుంచి ఏర్పాట్లు మరింత పుంజుకున్నాయి. ఇప్పటికే ప్రతిరోజు రాష్ట్ర పార్టీశ్రేణులు విచ్చేసి ఏర్పాట్లను పరిశీలిస్తుండగా, ఒంగోలులో ఇక్కడి జిల్లా నేతలు, ఉమ్మడి ప్రకాశం టీడీపీ ముఖ్య నాయకులు నిరంతరం పర్యవేక్షణలో నిమగ్నమయ్యారు. మంగళవారం నాటికి నగరాన్ని పసుపుమయంగా మార్చే పనులు ఊపందుకున్నాయి. ప్రధానంగా నగర ప్రధాన వీధులు, జాతీయరహదారి, అలాగే పలు ఫంక్షన్‌ హాళ్ల వద్ద మహానాడు ఆహ్వాన ఫ్లెక్సీలు వెలిశాయి. పసుపురంగులతో కూడిన తోరణాలతో నగరాన్ని అలంకరిస్తున్నారు. పార్టీ ఉపాధ్యక్షులు దామచర్ల జనార్దన్‌, రాష్ట్ర కార్యనిర్వాహకకార్యదర్శి సత్య నిర్వహణ కమిటీలను నియమించగా, అందుకు అనుగుణంగా పార్టీశ్రేణులు వారికి కేటాయించిన పనుల్లో బిజీ అయ్యారు. స్థానిక నాయకులు నాగబోయిన చలపతి, కామేపల్లి శ్రీనివాసరావు, కొఠారి నాగేశ్వరరావు, పోలవరపు వెంకట్రామయ్య, ముత్తన శ్రీనివాసరావు వేదిక పనుల్లో సహకారం అందిస్తున్నారు. 

మేముసైతం అంటున్న మండవవారిపాలెం ప్రజలు 

పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఏటా నిర్వహించే మహానాడు ఈ ఏడాది ఒంగోలులో, అందులోనూ తొలిసారిగా మండవవారిపాలెంలో జరగడం తమకెంతో గర్వంగా ఉందని ఆ గ్రామప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రెండురోజులపాటు జరిగే ఈ సంబరంలో మేముసైతం అంటూ ప్రతి ఒక్కరూ ఉత్సాహం చూపుతున్నారు. ఇప్పటికే వేదికకు అవసరమైన తమ సొంత పొలాలను కేటాయించి, సహకారం అందించగా, వారం రోజులుగా పనులు చేస్తున్న వారికి, చూసేందుకు వస్తున్న పార్టీశ్రేణులకు సకల మర్యాదలు చేస్తున్నారు. గ్రామప్రజల సహకారంతో వేదిక నిర్మాణం వద్ద మజ్జిగ, అల్పాహారం, సాయంత్రం వేళ టీ, తాగునీరు అందిస్తూ భాగస్వాములవుతున్నారు. ముఖ్యంగా గ్రామపెద్దలతోపాటు, యువత, మహిళలు వేడుకలకు తమ బంధువులను సైతం ఆహ్వానించి తమ ఇళ్లలో వసతి కల్పిస్తున్నారు.ఈ సంబరం మరిచిపోలేని మధుర జ్ఞాపకం అంటూ గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 



Updated Date - 2022-05-25T05:25:00+05:30 IST