మహా జన సంద్రం.. విజయ సంకల్పం

ABN , First Publish Date - 2022-07-04T08:27:40+05:30 IST

బీజేపీ తలపెట్టిన ‘విజయ సంకల్ప సభ’ దిగ్విజయమైంది. సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానం ఆదివారం కాషాయమయమైంది.

మహా జన సంద్రం.. విజయ సంకల్పం

  • ‘కాషాయ’ కళకళ.. పరేడ్‌ గ్రౌండ్‌ మిలమిల
  • బీజేపీ సభకు భారీగా తరలివచ్చిన ప్రజలు
  • మోదీ.. మోదీ అంటూ ఉత్సాహంగా నినాదాలు
  • ప్రధాని ‘తెలుగు’ మాటలకు అనూహ్య స్పందన


హైదరాబాద్‌, హైదరాబాద్‌ సిటీ, అడ్డగుట్ట, జూలై 3(ఆంధ్రజ్యోతి): బీజేపీ తలపెట్టిన ‘విజయ సంకల్ప సభ’ దిగ్విజయమైంది. సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానం ఆదివారం కాషాయమయమైంది. భారీగా తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో జనసంద్రంలా కనిపించింది. ‘‘మోదీ, మోదీ, మోదీ’’ నినాదాలతో ప్రాంగణం మార్మోగింది. ప్రజా సందోహాన్ని చూసి బీజేపీ అగ్ర నాయకత్వం ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైంది. రాష్ట్ర నాయకత్వం సంతోషంలో మునిగిపోయింది. రాష్ట్ర బీజేపీ చరిత్రలో ఈ స్థాయిలో జనం రావడం ఇదే తొలిసారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2004లో కూడా పరేడ్‌ గ్రౌండ్‌లో కమలనాథులు సభ నిర్వహించారు. అప్పుడూ జనం భారీగా హాజరయ్యారు. కానీ, నాటి స్పందనకు.. ఆదివారం సభ జరుగుతున్నంత సేపు కనిపించిన ఉత్సాహానికి వ్యత్యాసం ఉందంటున్నారు. 


మోదీ ప్రసంగం.. మిన్నంటిన హర్షధ్వానాలు

సభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తున్నంత సేపు పెద్దఎత్తున హర్షధ్వానాలు వినిపించాయి. ‘తెలంగాణ బీజేపీని ఆశీర్వదించడానికి ఎంతో దూరం నుంచి వచ్చిన కార్యకర్తలు, సోదరీ, సోదరీమణులు, మాతృమూర్తులకు నమస్కారం’’ అని తెలుగులో ప్రారంభించడంతో హర్షధ్వానాలు వెల్లువెత్తాయి. మోదీ తలవంచి నమస్కరించిన స మయంలో సభికుల నుంచి హర్షఽధ్వానాలు వెల్లువెత్తాయి. ఆయన 27 నిమిషాల ప్రసంగంలో నాలుగైదుసార్లు విరామం ఇవ్వాల్సినంత స్థాయిలో స్పందన వచ్చింది. ప్రధాని కూడా ఆ ఉత్సాహాన్ని చూసి పులకించిపోయారు. చిరునవ్వులు చిందిస్తూ, అభివాదం చేస్తూ ప్రసంగం కొనసాగించారు. ప్రధాని మాట్లాడుతున్న సమయంలో ఎల్‌ఈడీ తెరల ముందు నిల్చొని ఫొటోలు దిగేందుకు మహిళలు పోటీ పడ్డారు. బహిరంగ సభలో యువత, మహిళలే ఎక్కువగా ఉన్నారు. వేలాది మంది నిల్చొనే ప్రధాని ప్రసంగం విన్నారు. మోదీ తెలంగాణ చారిత్రక ప్రదేశాలను ప్రస్తావిస్తూ అనర్గళంగా మాట్లాడారు. 


వాహనాల్లోనే కాక.. స్వచ్ఛందంగా

జన సమీకరణకు రాష్ట్ర బీజేపీ పెద్దఎత్తున బస్సులు, ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. వాటిలోనే కాక ప్రజలు స్వచ్ఛందంగా హాజరయ్యారు. వాస్తవానికి సభ సాయంత్రం 4 గంటల నుంచి మొదలైంది. కానీ, మధ్యాహ్నం 2 గంటల నుంచే జనం రావడం కనిపించింది. సభ ప్రారంభానికి ముందే మైదానం నిండిపోయింది. మోదీని దగ్గరగా చూడవచ్చని జిల్లాల నుంచి వచ్చినవారు ముందుగా చేరుకునేందుకు పోటీ పడ్డారు. అగ్ర నాయకుల ప్రసంగాన్ని ఆద్యంతం ఆసక్తిగా విన్నారు. నృత్యాలు, డప్పులు తదితరాలతో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఉత్సాహ పరిచాయి.2 లక్షలమంది పట్టే సామర్థ్యం ఉన్న మైదానం నిండిపోగా.. రద్దీ పెరుగుతుండడంతో సాయంత్రం 6.30 సమయంలో 8వ నంబరు గేటును మూసివేశారు. రాత్రి 7 గంటల సమయంలో కూడా సికింద్రాబాద్‌, రాణిగంజ్‌, బేగంపేట్‌ వైపు వాహనాలు నిలిపి నడకదారిన మైదానానికి వస్తుండడం కనిపించింది.


 రైళ్లలో 50 వేల మంది రాక

తెలంగాణతో పాటు ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక, తదితర ప్రాంతాలకు చెందిన శ్రేణులు శనివారం రాత్రి నుంచే వివిధ రైళ్లలో సికింద్రాబాద్‌ స్టేషన్‌కు చేరుకున్నారు. ఆర్టీసీ బస్సులు, ఆటోలు, కాలినడకన పరేడ్‌ గ్రౌండ్‌కు తరలివెళ్లారు. రైళ్ల ద్వారానే దాదాపు 50 వేల మంది నగరానికి వచ్చినట్లు రైల్వే వర్గాలు తెలిపాయి. కాగా, వీరికి మెట్రో రైల్‌ సర్వీసులు ఉపయోగపడ్డాయి. సభ అనంతరం మెట్రోలో ప్రయాణించేందుకు ఆసక్తి చూపారు. దాంతో పరేడ్‌గ్రౌండ్‌, ప్యారడైజ్‌ మెట్రో స్టేషన్‌ల వద్ద తాకిడి భారీగా పెరిగింది. రాత్రి 10 గంటల వరకు రద్దీ కనిపించింది.

Updated Date - 2022-07-04T08:27:40+05:30 IST