రియల్‌ మాఫియా..!

ABN , First Publish Date - 2022-05-30T06:03:51+05:30 IST

పుట్టపర్తిలో ఆక్రమిద్దాం.. అమ్మేద్దాం.. అన్న విధంగా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు జోరు పెంచారు. ప్రభుత్వ భూములను దర్జాగా ఆక్రమించుకుని, అమ్మేస్తూ రూ.కోట్లు దండుకుంటున్నారు.

రియల్‌ మాఫియా..!

అధికార పార్టీ అండతో బరితెగింపు

వైసీపీ ముఖ్యప్రజాప్రతినిధి ఆశీస్సులు? 

అమ్మకానికి డీకేటీ భూములు

ప్రభుత్వ అసైన్డ, పోరంబోకు భూముల్లో పాగా

పలువురు అధికారులు, సిబ్బంది సహకారం


పుట్టపర్తి, ఆంధ్రజ్యోతి

పుట్టపర్తిలో ఆక్రమిద్దాం.. అమ్మేద్దాం.. అన్న విధంగా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు జోరు పెంచారు. ప్రభుత్వ భూములను దర్జాగా ఆక్రమించుకుని, అమ్మేస్తూ రూ.కోట్లు దండుకుంటున్నారు. శ్రీసత్యసాయి జిల్లా కేంద్రంగా పుట్టపర్తి ఏర్పాటుతో అందరి దృష్టి పట్టణంపై పడింది. ఈనేపథ్యంలో పుట్టపర్తి పరిసర గ్రామాల్లో ప్రభుత్వ, అసైన్డ, పోరంబోకు వాగులు, వంకలు ఆక్రమించి అమ్మేయడం, లేఔట్లు వేస్తూ ప్రజలకు అంటగడుతున్నారు. ప్రభుత్వ భూముల పక్కన పట్టాల భూమిని కొనుగోలు చేసి, ప్రభుత్వ భూమిని కలిపేసుకుంటున్నారు. వారికి పలువురు కిందిస్థాయి రెవెన్యూ ఉద్యోగులు పూర్తిస్థాయిలో సహకారం అందిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ఆక్రమిత భూములను అమ్మేయడం, వెంచర్లు వేసి, రియల్టర్లు రెచ్చిపోతున్నారు. వీరికి అధికార పార్టీ అండదండలకుతోడు ముఖ్య ప్రజాప్రతినిధి ఆశీస్సులు అందిస్తుండడంతో అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ భూముల్లో పాగా వేయడంతోపాటు సామాన్యుల పట్టా భూములను సైతం బలవంతంగా లాగేసుకుంటున్నారు. అనుమతులు కూడా లేకుండానే అసైన్డ భూముల్లో భారీ వెంచర్లు వేసి, ప్రజలకు అంటగడుతున్నారు. రెవెన్యూ అధికారులు అభ్యంతరం చెప్పకుండా వారికి మామూళ్లు ముట్టజెప్పి, బినామీ పేర్లతో ప్లాట్లు రాసిచ్చి, మిన్నకుండిపోయేలా చేస్తున్నారు. పుట్టపర్తి పరిసర గ్రామాల్లో అక్రమ లేఔట్లు, అసైన్డ భూముల కొనుగోళ్లలో ప్రధాన పాత్రధారులు.. ప్రత్యక్షంగా, పరోక్షంగా అధికార పార్టీ ముఖ్యనేతల ఆశీస్సులతో చెలరేగిపోతున్నారు.


బాబా భక్తుల ఆస్తులు  హాంఫట్‌

ఇతర ప్రాంతాల్లో ఉంటున్న సాయిబాబా భక్తులకు చెందిన పుట్టపర్తి పరిసర ప్రాంతాల్లోని భూములు, ఇళ్ల స్థలాలపై రియల్‌ మాఫియా కన్ను  పడింది. వాటికి నకిలీ ప్రతాలు పుట్టించి, యథేచ్ఛగా అమ్మేస్తున్న ఉదంతాలు ఇటీవలిగా వెలుగు చూస్తున్నాయి. అధికార పార్టీకి చెందిన రియల్‌ మాఫియా.. సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి వద్ద ప్రభుత్వ భూములను ఆక్రమించి, ప్లాట్లు వేసి అమ్మేస్తున్నారు. వీరికి అడ్డుచెప్పేందుకు అధికారులు భయపడుతున్నారు. ఈ ఆక్రమణలపై రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేసినా అధికార పార్టీనేతల ద్వారా వారిపై ఒత్తిళ్లు తీసుకొస్తున్నారు.


అందరి చూపు.. కప్పలబండ వైపు..

పుట్టపర్తి మండలంలో కప్పలబండ రెవెన్యూ పొలం స్థిరాస్తి వ్యాపారులకు బంగారు కొండగా మారింది. ఇక్కడే విలువైన అత్యధికంగా అసైన్డ భూములున్నాయి. ఈ భూములు సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి ముందు, వెనుక, మామిళ్లకుంట, కొత్తచెరువు రోడ్డు, రైల్వేస్టేషన ఎదురుగా ప్రధాన రహదారుల పక్కన విస్తరించి ఉన్నాయి. పుట్టపర్తి జిల్లా కేంద్రం ఏర్పాటుతో ఈ భూములు ఎకరా రూ.కోట్లలోకి చేరాయి. పైగా ప్రభుత్వ శాఖల పక్కాభవనాలు కప్పలబండ పొలాల్లో నిర్మించేందుకు అధికార యంత్రాంగం భూములను గుర్తించింది. దీంతో కప్పలబండ పొలం కేంద్ర బిందువుగా మారింది. అసైన్డ భూమి చేతులు మారడంతోపాటు వెంచర్లు వేసి, ప్లాట్లను ఇద్దరుముగ్గురికి విక్రయించడం పరిపాటిగా మారింది. ఈ భూముల్లో సంపన్నులకు కూడా ఎకరాలకు ఎకరాలు డీపట్టాలు ఇచ్చారు. పదేళ్ల కింద జరిగిన భూపంపిణీలో అర్హత లేకున్నా భూములు రాసిచ్చారు. ఇటీవల అధికార పార్టీ అండతో కొందరు రియల్టర్లు రైతుల నుంచి కొనుగోలు చేసి, పక్క భూములను సైతం కలిపేసుకుంటూ రూ.కోట్లు కొల్లగొట్టారు.


ఆక్రమిద్దాం... అమ్మేద్దాం...

ప్రభుత్వ భూముల్లో కనీస నిబంధనలు పాటించకుండా, అనుమతులు లేకుండా ప్లాట్లు వేసేస్తున్నారు. వ్యవసాయ భూమిని కన్వర్షన చేయకుండా ప్లాట్లు వేసి, ప్రజలకు అంటగడుతున్నారు. కప్పలబండ పొలంలో జ్యోతిర్లింగం వెనుక 213-4, 3 తదితర సర్వేనెంబర్లలో 4 ఎకరాల ప్రభుత్వ భూమిలో రియల్‌ వ్యాపారులు లేఔట్‌ వేసి, ప్లాట్లుగా విక్రయించారు. కప్పలబండ పొలంలో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి, రైల్వేస్టేషన ఎదురుగా, ఎయిర్‌పోర్టు సమీపాన అసైన్డ భూముల క్రయవిక్రయాలు, అక్రమ లేఔట్లపై ఫిర్యాదులు వచ్చినా.. చర్యలు చేపట్టలేదు. రియల్టర్లకు అధికార పార్టీ అండ ఉండడంతోనే అధికారులు చర్యలు చేపట్టలేకపోతున్నారన్న వాదనలు ఆ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. అధికార పార్టీలోని ముఖ్యనేతల ప్రమేయం ఉన్నందున బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు అధికారులు జంకుతున్నారు. ఇటీవల కొందరు రియల్‌ మాఫియాగా ఏర్పడి, అసైన్డ భూములు కొనుగోలు, ప్రభుత్వ భూములు కలిపేసుకుని విక్రయాలు, రైతులకు బెదిరింపులు, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి, యథేచ్ఛగా అమ్మకాలు సాగిస్తున్నారు.


అమ్మకానికి డీకేటీ భూములు

కప్పలబండ పొలంలో పేదలకు ఇచ్చిన డీ పట్టాల అమ్మకం యథేచ్ఛగా సాగుతోంది. సర్వే నెంబరు 182లో 129 ఎకరాల అసైన్డ భూమి ఉంది. దీనిని పలు సర్వే నెంబర్లుగా విడగొట్టి, పలువురు పేదలకు డీపట్టాలు ఇచ్చారు. వీటిపై కన్నేసిన రియల్‌ వ్యాపారులు పేద రైతుల నుంచి తక్కువకే కొనుగోలు చేసి, అమ్మేశారు. ఇలా 215-1, 215-2ఏ, 215 3ఏ, 275-10, 305, 301, 375, 374, 269, 270, 275, 374, 315, 302, 307, 308, 182, 179, 309-2, 314-1 నుంచి 4 వరకు పలు సర్వే నెంబర్లలో భూములు చేతులు మారాయి. జిల్లా ప్రకటనతో ఇప్పుడు డీ పట్టా ఉన్న రైతులు భూమి తమదేనంటూ అడ్డుకునే పరిస్థితి వచ్చి, వివాదాలకు దారితీస్తోంది. కప్పలబండ పొలంలో అసైన్డ భూములు వందల ఎకరాలు ఇతరుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. అసైన్డ భూముల్లో అనుమతులు లేకుండా లేఔట్లు వేస్తున్నా.. వారికి రెవెన్యూతోపాటు పలు ప్రభుత్వ శాఖల అధికారులు రోడ్లు, విద్యుత లైన్ల ఏర్పాటుకు తమవంతు సహకరిస్తున్నారు. పుట్టపర్తి చుట్టూ చివరకు కొండ గుట్టలను కూడా వదలడంలేదు. కొండలను తవ్వేస్తూ ఆక్రమించేస్తున్నారు.


అసైన్డ భూములు అమ్మినా, కొన్నా చర్యలు తప్పవ్‌..

అసైన్డభూములు కొన్నా, అమ్మినా చెల్లుబాటుకావు. అమ్మినట్లు విచారణలో తేలితే వాటిని ప్రభుత్వ భూములుగానే గుర్తిస్తాం. కప్పలబండ పొలంలో 39.01 ఎకరాల అసైన్డభూముల క్రయవిక్రయాలు సాగినట్టు మా విచారణలో తేలింది. అసైన్డ భూముల్లో కట్టడాలను వారంరోజుల్లోగా తొలగించాలని నోటీసులు జారీ చేశాం.

భాస్కర్‌నారాయణ, తహసీల్దార్‌, పుట్టపర్తి


Updated Date - 2022-05-30T06:03:51+05:30 IST