రెచ్చిపోతున్న మట్టి మాఫియా!

ABN , First Publish Date - 2022-05-16T06:53:20+05:30 IST

మట్టి మాఫియా రెచ్చిపోతోంది.

రెచ్చిపోతున్న మట్టి మాఫియా!

కలెక్టర్‌ రంజిత్‌ బాషాకు ఫిర్యాదు చేసిన కే సీతారామపురం వాసులు

 జగనన్న కాలనీల పేరుతో.. మట్టి దోపిడీ 

నిన్నటి వరకు గ్రావెల్‌.. నేడు మట్టి రవాణా 

 పదుల సంఖ్యలో పొక్లెయిన్లు.. వందల్లో ట్రిప్పులు 

 బాపులపాడు మండల పరిధిలో అడ్డగోలుగా చెరువుల తవ్వకం 

 తాజాగా కే సీతారామాపురం బాలాయి చెరువులో అక్రమ తవ్వకాలు 

 అధికార పార్టీ అండదండలతో ఇష్టారాజ్యం!

మట్టి మాఫియా రెచ్చిపోతోంది. ఇష్టారీతిన అక్రమాలకు తెగబడుతోంది. నిన్నటి వరకు గ్రావెల్‌ను తవ్వి తోడేసి, ఇప్పుడు మట్టినీ తరలిస్తోంది. ఒకటి కాదు రెండు కాదు.. పదుల సంఖ్యలో పొక్లెయిన్లతో, వందల ట్రిప్పులు తవ్వేసింది. వేలాది క్యూబిక్‌ మీటర్ల మట్టిని అమ్ముకుని సొమ్ము చేసుకుంటోంది.  బాపులపాడు మండలం పరిధిలోని చెరువుల్లో జరుగుతున్న ఈ అక్రమ తంతుపై గ్రామస్థులు మచిలీపట్నం కలెక్టర్‌ రంజిత్‌ బాషాకు ఫిర్యాదు చేయడంతో మాఫియా బాగోతం వెలుగు చూసింది.  

(ఆంధ్ర జ్యోతి, విజయవాడ / హనుమాన్‌ జంక్షన్‌ రూరల్‌ ):

బాపులపాడు మండలం కే సీతారామపురం గ్రామంలో సర్వే నెంబర్‌  437/2లో బాలాయి చెరువు ఉంది. దీని విస్తీర్ణం 77 ఎకరాలు. ఈ చెరువు స్థానిక వాటర్‌ ట్యాంక్‌గా ఉపయోగపడుతోంది. దీని పరిధిలో 200 ఎకరాల సాగు ఆయకట్టు ఉంది. వ్యవసాయ అవసరాలకు తాగునీటితోపాటు, పశువుల దాహార్తిని కూడా ఇదే తీరుస్తోంది. కిందటి ఏడాది ఈ చెరువులో ఎలాంటి అనుమతులూ లేకుండానే అధికార పార్టీ అండదండలతో కొందరు మట్టి తవ్వకాలు చేపట్టారు. అనుమతి లేకుండా చెరువు నుంచి ఇప్పటి వరకు 30 వేల ట్రిప్పుల మట్టిన తరలించుకుపోయి సొమ్ము చేసుకున్నారు. గ్రామస్థులు స్థానిక అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకు వెళ్లినా ఉపయోగం ఉండటం లేదు. అనుమతులు లేకపోయినా.. ఏ శాఖ అధికారి కూడా మట్టి తవ్వకాలను ఆపటానికి సాహసించటం లేదు. బాలాయి చెరువులోని చేపల వేటకు ఎలాంటి వేలం నిర్వహించలేదు. ఒకవేళ పాట నిర్వహించారనటానికి గ్రామంలో ఎలాంటి చాటింపు కూడా వేయలేదు. దీనిని బట్టి చూస్తే మట్టి తవ్వకాల కోసమే చేపలు పట్టుకోవటానికి పాట నిర్వహించలేదని తెలుస్తోంది. ఈ చెరువు తవ్వకాలకు అనుమతులు ఇచ్చినట్టుగా అధికారపక్ష నేతలు ప్రచారం చేస్తున్నారు. ప్రజలు మాత్రం ఇవన్నీ కట్టు కథలుగా కొట్టిపారవేస్తున్నారు. అధికారులు మాత్రం ఈ విషయంలో నోరు మెదపటం లేదు. 

కలెక్టర్‌ ఫిర్యాదులో దాగి ఉన్న అంశాలు ఇవీ  

  బాపులపాడు మండలం కే సీతారాంపురం ప్రజలు కలెక్టర్‌ రంజిత్‌ బాషాకు చెరువు పేరుతో గ్రామ సర్పంచ్‌, కొందరు స్థానిక నాయకులు వారి స్వలాభం కోసం గ్రామ అవసరాలకు ఉపయోగపడే చెరువులోని మట్టిన అక్రమంగా తవ్వుతున్నారు. గ్రామం నుంచి హనుమాన్‌ జంక్షన్‌ చాలా దగ్గరగా ఉండటం వల్ల మట్టి మాఫియా విజృంభిస్తోంది. స్థానిక గ్రామ పంచాయతీకి కానీ, ప్రభుత్వానికి కానీ నయాపైసా ఆదాయం లేకుండా మట్టిని తవ్వుకుంటున్నారు. జగనన్న కాలనీలకు మట్టి తోలుతున్నామని చెబుతున్నా, వాస్తవానికి జగనన్న కాలనీలకు కూడా ఈ మట్టి వెళ్లడం లేదు.  ఇటుక బట్టీలకు అమ్ముకుంటున్నారు. మే 11, 2022 నుంచి రోజుకు 60 ట్రాక్టర్లు సగటున 900 ట్రిప్పుల మేర మట్టిని తరలించుకుపోతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా చెరువును తవ్వుతున్నారు. 

అధికారుల ప్రేక్షకపాత్ర  

 అధికార పార్టీకి చెందిన నేతల కనుసన్నల్లోనే అక్రమంగా మట్టి తవ్వకాలు అనేక చోట్ల జరుగుతున్నాయి. ఈ వ్యవహారాలపై అధికారులకు ఫిర్యాదులు చేస్తుంటే రెవెన్యూ, పంచాయతీ, ఇరిగేషన్‌ శాఖల అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు. గతంలో ఎప్పుడూలేని విధంగా గ్రావెల్‌, మట్టి మాఫియా చెలరేగిపోతున్నా.. అధికారులు అధికార పక్షానికి దాసోహమంటున్నారు. ప్రజల నుంచి పెద్దఎత్తున తిరుగుబాటు వస్తున్నా అధికారుల నుంచి స్పందన ఉండటం లేదు.


Updated Date - 2022-05-16T06:53:20+05:30 IST