విచ్చలవిడిగా..

ABN , First Publish Date - 2021-06-18T05:51:39+05:30 IST

కరోనాకర్ఫ్యూను ఆసరా చేసుకుని అక్రమమద్యం వ్యాపారులు బరితెగిస్తున్నారు.

విచ్చలవిడిగా..

 ప్రభుత్వ దుకాణాల కంటే ఇవే ఎక్కువ

అక్రమ వ్యాపారానికి కలిసొచ్చిన కర్ఫ్యూ

వైన్‌ షాపుల్లో కొని.. బయటకు తరలింపు 

దీనిలో కొందరు సిబ్బంది చేతివాటం

బాటిల్‌పై రూ.50 నుంచి రూ.100 అదనం

కొన్ని ప్రాంతాల్లో  డోర్‌ డెలివరీ 

తెలంగాణ నుంచి ఆగని మద్యం అక్రమ సరఫరా


 ఏటీఎం అంటే.. ఎనీ టైమ్‌ మందు.. అనే విధంగా జిల్లాలో పరిస్థితి మారిపోయింది. బెల్టుషాపుల తరహాలో మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. కరోనా కర్ఫ్యూను ఆసరా చేసుకుని అక్రమ మద్యం వ్యాపారులు బరితెగిస్తున్నారు. ప్రభుత్వ వైన్‌షాపులు ఉన్న మండల కేంద్రాల్లో ఇటువంటి షాపులు పుట్టుకొస్తున్నాయి. దీనికి తోడు తెలంగాణ, గోవా మద్యం కూడా విక్రయిస్తున్నారు. ఇటీవల తాడేపల్లి మండలం గుండిమెడ గ్రామంలో బెల్టుషాపుల జోరును కట్టడి చేయాలంటూ గ్రామపెద్దలు ఏకంగా ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం పరిస్థితికి అద్దం పడుతోంది. మద్యాన్ని నియంత్రిస్తామని చెబుతున్న ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయకపోగా.. కనీసం  ఇటువంటి వాటిని కూడా కట్టడి చేయలేకపోవడం విమర్శలకు తావిస్తోంది. 

  

ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌, జూన్‌ 17: కరోనాకర్ఫ్యూను ఆసరా చేసుకుని అక్రమమద్యం వ్యాపారులు బరితెగిస్తున్నారు. ప్రభుత్వ మద్యం దుకాణం కొన్ని గ్రామాలకు కలిపి ఒకటి ఉంటే, బెల్టు షాపుల తరహాలో వీధుల్లోని షాపుల్లో మద్యం విక్రయిస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే మద్యం దుకాణాలకంటే ఇటువంటి ఇటువంటివి ఐదురెట్లు ఎక్కువగా పెరిగిపోయాయి. కర్ఫ్యూకు ముందు సాయంత్రం వరకు ప్రభుత్వ మద్యం దుకాణాలు ఉండటంతో అప్పట్లో పెద్దగా వీటి అవసరం లేకుండాపోయింది. అప్పటికీ ఒకటీ అరా అమ్మకాలు సాగినా ఇంతటి విచ్చలవిడిగా లేదు. తెనాలి పట్టణం, రూరల్‌ గ్రామాల పరిఽధిలో ఇటు వంటివి పుట్టగొడుగుల్లా వెలిశాయి. కొలకలూరు, నందివెలుగు, అంగ లకుదురు, సంగంజాగర్లమూడి మరికొన్ని గ్రామాల్లో కొన్ని ఇళ్లల్లోనే మద్యం  అమ్మేస్తున్నారు. పట్టణంలోని రైల్వేస్టేషన్‌, సుల్తానాబాద్‌, బుర్రిపాలెంరోడ్డు, వైకుంఠపురం, చినరావూరు, కఠెవరం రోడ్డు ప్రాంతాల్లో గుట్టుచప్పుడు కాకుండా అమ్మేస్తున్నారు. మార్కెట్‌సెంటర్‌ వంటిచోట్లయితే అంతా బహిరంగమే. ఒక వ్యక్తికే పరిమితికి మించి మద్యం సీసాలు అమ్మేసి, వాటిని రహస్యంగా దుకాణం దాటించేస్తున్నారు. 

 వేమూరు నియోజకవర్గంలో పలుచోట్ల క్వార్టర్‌ బాటిల్‌కు రూ.50 అదనంగా చెల్లిస్తే ఏ సమయంలోనైనా మద్యం అందుబాటులో ఉంటోంది.  ఎక్సైజ్‌ అధికారుల నిఘా కొరవడటంతో గ్రామాల్లో చిన్న చిన్న దుకాణాల్లో మద్యం సీసాల విక్రయాలు ప్రారంభం అయ్యాయి. చుండూరు మండలం మోదుకూరు, వలివేరు, చుండూరు, వేటపాలెంలో తెలంగాణా మద్యం ఇంటికే డోర్‌ డెలివరీ చేస్తున్నారు. భట్టిప్రోలు మండలలో దాదాపు 50పైగా నడుస్తున్నాయి.  

బాపట్ల పట్టణ, మండలంతోపాటు కర్లపాలెం, పిట్టలవానిపా లెం మండలాల్లో యథేచ్ఛగా మద్యం విక్రయాలు నిర్వహిస్తున్నారు. కొంతమంది వైన్‌షాపుల్లో పనిచేసే సిబ్బంది పెద్దమొత్తంలో మద్యం బాటిల్స్‌ ఒకరికే విక్రయిస్తూ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. కొందరు వాటిని తెచ్చుకొని బయట ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. ఇటీవల బాపట్ల పట్టణంలోని ఓ మద్యం దుకాణంలో బాటిల్స్‌పై లేబుల్‌ మా ర్చి అధిక ధరకు విక్రయిస్తున్న సిబ్బందిని అధికారులు పట్టుకు న్నారు. ఇటీవల భర్తిపూడి రైల్వేగేటు వద్ద, చీలురోడ్డుసెంటర్‌లో, పిన్నిబోయినవారిపాలెం, జమ్ములపాలెం, పట్టణంలో పోలీసులు మ ద్యం విక్రయిస్తున్నవారిని పట్టుకొన్నారు.

 పొన్నూరు పట్టణం, మండలంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వారిపై ఈ ఏడాదిలో ఇప్పటివరకు  41 కేసులు నమోదు చేశారు. వారి నుంచి లక్షలాది రూపాయల విలువచేసే మద్యం బాటిల్స్‌ స్వాధీనం చేసుకున్నారు. తాడికొండ, రావెల, మోతడక, పాములపాడు, పొన్నెకల్లు, లాం తదితర గ్రామాల్లో అక్రమ మద్యం అమ్మకాలు కొనసాగుతున్నాయి. సెబ్‌ అధికారుల తనిఖీలు తూతూ మంత్రంగా ఉన్నాయి. పెదకూరపాడు నియోజక వర్గంలోని బెల్లంకొండ, క్రోసూరు, అచ్చంపేట, పెదకూరపాడు, అమరావతి మండలాల్లోని గ్రామాల్లో  మద్యం విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. క్వార్టర్‌ బా టిల్‌పై రూ.50 అదనంగా అమ్ము తున్నారు. అచ్చంపేట మండలంలో తెలంగాణా నుంచి అక్రమంగా మద్యాన్ని తెచ్చి విక్రయిస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టు, మాదిపాడు బల్లకట్టు అక్రమ మద్యం రవాణాకు అడ్డాగా మారింది. 

వినుకొండ నియోజక వర్గంలో జోరుగా అక్రమ మ ద్యం వ్యాపారం నడుస్తోంది. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేస్తున్న సిబ్బందే బెల్టు షాపుల నిర్వాహకులకు  క్వా ర్టర్‌ బాటిల్‌కు రూ.10 నుంచి రూ.20 అదనంగా తీసుకొని అందజేస్తున్నారు. వీటిని  రూ.50 నుంచి రూ.100  అ దనంగా తీసుకొని అమ్ముతు న్నారు. చిలకలూరిపేట ప్రాం తంలో అక్రమమద్యం ఏరులై పారుతోంది. తెలంగాణ మద్యం అక్రమంగా తీసుకువచ్చి చిన్న  దుకాణాలకు సరఫరా చేస్తున్నారు.  ఈనెల 11న  మద్దిరాల వద్ద  మద్యాన్ని అక్రమార్కులు సమీప గ్రామాల్లోని నిర్వాహకులకు సరఫరా చేస్తుండగా పట్టుకున్నారు.

  సత్తెనపల్లి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో గుట్టుచప్పుడు కాకుండా కొంత మంది మద్యం విక్రయాలు జరుపుతున్నారు. రాజుపాలెం, ముప్పాళ్ల, సత్తెనపల్లి రూరల్‌, నకరికల్లు మండలాలకు చెందిన కొంతమంది వ్యక్తులు వైన్‌షాపుల వద్ద మద్యం బాటిళ్లు కొనుగోలుచేసి గ్రామాల్లో క్వార్టర్‌కు రూ.50  అదనంగా తీసుకొని విక్రయిస్తున్నారు. నకరికల్లు మండలంలో  సారా విక్రయాలు జోరుగా జరుగుతున్నాయి. తెలంగాణా నుంచి అక్రమ మార్గంలో వస్తున్న మద్యం పల్నాడులో ఏరులై పారుతోంది. 

తాడేపల్లి మండల గుండిమెడలో ఆడవాళ్లే మద్యం అమ్ముతూ పట్టుబడడం విశేషం. గుండిమెడ గ్రామంలో బెల్టుషాపుల జోరు.. స్పందించని అధికారులు.. ఇట్లు గ్రామపెద్దలు అంటూ ఇటీవలే ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం కలకలం సృష్టించింది. దీంతో పోలీసులు ఆ గ్రామంలో కౌన్సెలింగ్‌ నిర్వహించి, ముగ్గురు మహిళలను, ఓ వ్యక్తిని అరెస్టు చేసి వారి నుంచి 46 బాటిళ్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. తాడేపల్లి పట్టణంలో ప్రకాష్‌నగర్‌, సీతానగరం, కేఎల్‌రావు కాలనీ, నులకపేట, మండలంలోని వడ్డేశ్వరం, గుండిమెడ, కుంచనపల్లి, పెనుమాక, గ్రామాల్లో  విక్రయాలు జరుగుతున్నాయి. వీరంతా తాడేపల్లి, మంగళగిరిలోని కొన్ని వైన్‌షాపుల సిబ్బందితో కుమ్మక్కై బాటిల్‌కు రూ.20లు అదనంగా ఇచ్చి ఎక్కువ మొత్తంలో బాటిళ్లు తెచ్చి రూ.100 అదనంగా అమ్ముతున్నారు. తాడేపల్లి ప్రాంతంలో కొందరు లారీడ్రైవర్లు తెలంగాణ డ్యూటీలకు వెళ్లి అక్కడ నుంచి వచ్చేటప్పుడు మూడు నాలుగుకేసులు తెచ్చి స్థానికంగా అదనపు రేట్లకు అమ్ముతున్నారు. మహానాడు, కుంచనపల్లిలో వీరిని పోలీసులు పట్టుకుని అరెస్టు చేశారు. 

 మాచర్ల నియోజకవర్గంలో  దాదాపు అన్ని గ్రామాల్లో అక్రమ మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. వీరికి అధికార పార్టీనేతల అండదండలు ఉండడంతో వ్యాపారం జోరం దుకుంటోంది.  రెంటచింతల మండలంలో ఇటీవల 16 కేసులు నమోదయ్యాయి. దుర్గి మండలం అడిగొప్పుల నిదానంపాటి శ్రీలక్ష్మీ అమ్మవారి ఆలయం వద్ద చిల్లర దుకాణాల్లో మద్యం విక్రయిస్తున్నప్పటికీ అధికారులు ఎటువంటి చర్యలు తీసు కోవడం లేదు. మాచర్ల, కారంపూడి మండలాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో కూడా మద్యం విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు.  

నరసరావుపేట నియోజకవర్గంలోని గ్రామాలు, పట్టణంలో మద్యం  వ్యాపారం విచ్చలవిడిగా జరుగుతోంది. తెలంగాణ నుంచి మద్యం తీసుకొచ్చి ఙవిక్రయిస్తున్నారు. ఫోన్‌కాల్‌ ద్వారా వినియోగదారుడి వద్దకే మద్యం తీసుకెళ్లి విక్రయిస్తున్నారు. 

Updated Date - 2021-06-18T05:51:39+05:30 IST