‘తాత్కాలికం’తో ముప్పే

ABN , First Publish Date - 2022-07-01T13:57:05+05:30 IST

‘తాత్కాలిక’ టీచర్ల నియామకాలతో ముప్పేనని మద్రాస్‌ హైకోర్టు మదురై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. తాత్కాలిక ం కన్నా శాశ్వత నియామకాలు ఎందుకు

‘తాత్కాలికం’తో ముప్పే

- ఉపాధ్యాయుల నియామకంపై హైకోర్టు ఆగ్రహం

- టెంపరరీ పోస్టింగ్‌ నిలుపుదల ?


పెరంబూర్‌(చెన్నై), జూన్‌ 30: ‘తాత్కాలిక’ టీచర్ల నియామకాలతో ముప్పేనని మద్రాస్‌ హైకోర్టు మదురై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. తాత్కాలికం కన్నా శాశ్వత నియామకాలు ఎందుకు చేపట్టకూడదని ప్రశ్నించింది. ఉపాధ్యాయుల నియామకాలకు సంబంధించిన పరీక్షా నిబంధనల్ని పక్కనబెట్టి మరీ చేపట్టే నియామకాల్లో ఏ మేరకు నైపుణ్యముంటుందని నిలదీసింది. పాఠశాలల్లో తాత్కాలిక ఉపాధ్యాయుల నియామకాల వ్యవహారంలో రాజకీయ, అధికార యంత్రాంగ జోక్యం అధికంగా వుందంటూ పిటిషనర్‌ చేసిన ఆరోపణతో తాము ఏకీభవిస్తున్నట్లు తేల్చి చెప్పింది. ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి వివరాలను తమ ముందుంచాలని, ఆ తరువాత ఈ వ్యవహారమేంటో తాము తేలుస్తామని కటువుగా వ్యాఖ్యానిస్తూ తదుపరి విచారణ శుక్రవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు మదురై ధర్మాసనం న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఎం రమేష్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఏడాది పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగడంతో దానికి తగినంతగా ఉపాధ్యాయులు లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలిక నియామకాలకు దిగింది. 13,391 మంది తాత్కాలిక ఉపాధ్యాయులను నియమించాలని నిర్ణయించింది. ఇంటర్మీడియట్‌ టీచర్లకు నెలకు రూ.7,500, గ్రాడ్యుయేట్‌ టీచర్లకు రూ.10 వేలు, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్లకు రూ.12 వేలు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. పోస్టుల భర్తీలో ‘ఇల్లం తేడి కల్వి’ పథకంలో పనిచేస్తున్న వాలంటీర్లు, ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఉత్తీర్ణులైన వారికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది. ఆయా పాఠశాలల యాజమాన్యాలే చేపట్టవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే ఈ నియామకాల్లో రాజకీయ, అధికార యంత్రాంగ జోక్యం అధికమైందని, పలు అవకతవకలు జరుగతున్నాయంటూ మదురై ధర్మాసనంలో పిటిషన్‌ దాఖలైంది. ఈ పిటిషన్‌పై గురువారం విచారణ చేపట్టిన న్యాయమూర్తి రమేష్‌.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 


తాత్కాలిక నియామకాల నిలుపుదల  ?

తాత్కాలిక ఉపాధ్యాయుల నియామకాల్లో పలు అవకతవకలు జరుగుతున్నట్లు ఆరోపణలు వెలువడడం, హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఆ నియామకాలను నిలిపేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే దిండుగల్‌ జిల్లాలో మాత్రమే ఈ నియామకాలు నిలిపేసినట్లు అధికారవర్గాలు పేర్కొనగా, రాష్ట్ర వ్యాప్తంగా వాటిని నిలిపేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సచివాలయ వర్గాలు వివరించాయి.

Updated Date - 2022-07-01T13:57:05+05:30 IST