ఖైదీలను హింసించడం పోలీసుల అసమర్థతకు నిదర్శనం

ABN , First Publish Date - 2022-06-11T15:36:48+05:30 IST

విచారణ ఖైదీలను ప్రాణం పోయే వరకు చిత్రహింసలు పెట్టడం పోలీసు శాఖ అసమర్థతకు నిదర్శనమని మద్రాసు హైకోర్టు తీవ్రంగా ఖండించింది. పోలీసు శాఖ

ఖైదీలను హింసించడం పోలీసుల అసమర్థతకు నిదర్శనం

                                - హైకోర్టు 


ప్యారీస్‌(చెన్నై), జూన్‌ 10: విచారణ ఖైదీలను ప్రాణం పోయే వరకు చిత్రహింసలు పెట్టడం పోలీసు శాఖ అసమర్థతకు నిదర్శనమని మద్రాసు హైకోర్టు తీవ్రంగా ఖండించింది. పోలీసు శాఖ చిత్రహింసలు, లాకప్‌ మరణాలు తదితర పోలీసుల చర్యలకు వ్యతిరేకంగా ఫిర్యాదుచేసేందుకు అన్ని రాష్ట్రాల్లో ‘పోలీసు శాఖ ఫిర్యాదు కమిషన్‌’ను ఏర్పాటుచేయాలని సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ప్రకారం 2013లో రాష్ట్రంలో ఈ విభాగాలు ఏర్పాటయ్యాయి. రాష్ట్రస్థాయిలో హోం శాఖ కార్యదర్శి నేతృత్వంలో డీజీపీ, ఏడీజీపీలు సభ్యులుగాను, జిల్లాస్థాయిలో జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో పోలీసు ఎస్పీ, ఏఎస్పీలు సభ్యులుగా నియమితులయ్యారు. ఈ నియమాకాలను వ్యతిరేకిస్తూ మక్కల్‌ నీది మయ్యం పార్టీ ప్రిసీడియం ప్రధాన కార్యదర్శి ఏజీ మౌర్య, శరవణన్‌ దక్షిణామూర్తి మద్రాసు హైకోర్టులో వేర్వురుగా పిటిషన్లు దాఖలుచేశారు. ఈ పిటిషన్‌లను ప్రధాన న్యాయమూర్తి మునీశ్వరనాధ్‌ భండారీ, న్యాయమూర్తి ఎన్‌.మాలలతో కూడిన  ధర్మాసనం ముందు గతంలో విచారణకు రాగా న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రప్రభుత్వం వ్యవహరించలేదని, కమిటీల నియమాక చట్టాన్ని సవరించాలని సూచించారు. ఈ నేపథ్యంలో, మళ్లీ ఈ కేసుపై శుక్రవారం విచారణ జరిపిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మునీశ్వరనాధ్‌ భండారీ నేతృత్వంలోని ధర్మాసనం, విచారణ ఖైదీల పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తిస్తున్నారని, ప్రాణాలు పోయే వరకు చిత్రహింసలు చేయడం ఖండించదగ్గదని తెలిపారు. రిటైర్డ్‌ జడ్జి నేతృత్వంలో కమిటీ నియమించడంలో ప్రభుత్వం ఎందుకు వెనుకాడుతోందని హైకోర్టు సూటిగా ప్రశ్నించింది.

Updated Date - 2022-06-11T15:36:48+05:30 IST