Madras High Court: మద్యంమత్తులో వాహనం నడిపితే సహచరులూ బాధ్యులే

ABN , First Publish Date - 2022-08-07T13:26:39+05:30 IST

బైక్‌, లేదా కారును నడిపే వ్యక్తి మద్యం సేవిస్తే అందుకు సహచరులు కూడా బాధ్యత వహించల్సిందేనని మద్రాస్‌ హైకోర్టు స్పష్టం చేసింది.

Madras High Court: మద్యంమత్తులో వాహనం నడిపితే సహచరులూ బాధ్యులే

పెరంబూర్‌(చెన్నై), ఆగస్టు 6: బైక్‌, లేదా కారును నడిపే వ్యక్తి మద్యం సేవిస్తే అందుకు సహచరులు కూడా బాధ్యత వహించల్సిందేనని మద్రాస్‌ హైకోర్టు స్పష్టం చేసింది. వాహనచోదకుడు మద్యం సేవించివున్నాడా లేదా అన్నది పక్కనున్న వారికి తెలియకుండా ఉండదని, మద్యం సేవించారని తెలిస్తే వారిని వారించకుండా ఉండిపోయారంటే, ఆ తరువాత ఘటనలకు వారు కూడా బాధ్యులేనని తేల్చిచెప్పింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ భరత్‌ చక్రవర్తి(High Court Judge Justice Bharat Chakraborty) ఇటీవల తీర్పు వెలువరించారు. చెన్నైకి చెందిన కళాశాల విద్యార్థి అన్బుసూర్య ఇటీవల తన కారులో తన స్నేహితుడు సెబాస్టియన్‌ కృష్ణన్‌, సోదరి డాక్టర్‌ లక్ష్మితో కలసి వెళ్తూ మెరీనా బీచ్‌(Marina Beach) సమీపంలో కొందరిని ఢీకొనడంతో ఓ పోలీసు, ఇద్దరు జాలర్లు మృతి చెందిన విషయం తెలిసిందే. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టగా అన్బుసూర్య డ్రైవింగ్‌ చేసినప్పుడు మద్యం మత్తులో వున్నట్లు తేలింది. దీంతో అన్బుసూర్యతో పాటు అతడి పక్కనున్న ఇద్దరిపైనా అన్నా స్క్వేర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే పోలీసులు తనపై కేసు నమోదు చేయడాన్ని సవాల్‌ చేస్తూ లక్ష్మి హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఆమె పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి జస్టిస్‌ భరత్‌ చక్రవర్తి నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. తన సోదరుడు మద్యం సేవించి వాహనం నడుపుతున్నట్లు తెలిసి కూడా ఆమె అడ్డు చెప్పలేదని, అందువల్ల జరిగిన దుర్ఘటనకు ఆమె సహకారం కూడా వున్నట్లేనన్న ప్రభుత్వ న్యాయవాది వాదనలతో ఏకీ భవిస్తున్నట్లు స్పష్టం చేశారు. మద్యం మత్తులో ఉండే డ్రైవర్‌(Driver) మాత్రమే ప్రమాదానికి కారణం కాదని, ఆ వాహనంలో ప్రయాణిస్తున్న వారికి కూడా సమాన బాధ్యత ఉంటుందని వ్యాఖ్యానించారు. అందువల్ల ఈ కేసు నుంచి డా.లక్ష్మిని తప్పించలేమని తేల్చి చెప్పారు. 

Updated Date - 2022-08-07T13:26:39+05:30 IST