Jul 25 2021 @ 15:18PM

రెహ్మాన్‌పై పరువునష్టం దావా కొట్టివేత

ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్‌.రెహ్మాన్‌పై దాఖలైన పరువునష్టం కేసును  హైకోర్టు కొట్టివేసింది. నగరానికి చెందిన మ్యూజిక్‌ ఈవెంట్‌ ఆర్గనైజర్‌ కాళియప్పన్‌ ఈ పిటిషన్‌ను దాఖలు చేయగా దీన్ని హైకోర్టు కొట్టివేసింది. ఈ కేసులోని పూర్వాపరాలను పరిశీలిస్తే, గత 2000లో రెహ్మాన్‌ సారథ్యంలో దుబాయ్‌లో ఒక సంగీత విభావరి కార్యక్రమాన్ని కాళియప్పన్‌ ఆర్గనైజ్‌ చేశారు. ఈ కార్యక్రమం లాభాలను తెచ్చిపెట్టకపోగా తీవ్ర నష్టాలను మిగిల్చింది. దీంతో మూడు కోట్ల రూపాయల నష్టపరిహారాన్ని రెహ్మాన్‌ నుంచి ఇప్పించాలని కోరుతూ కాళియప్పన్‌ మద్రాస్‌ హైకోర్టులో ఓ సివిల్‌ కేసు పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ మ్యూజికల్‌ నైట్‌ రైట్స్‌ను ఓ ప్రైవేటు సంస్థకు విక్రయించిన రెహ్మాన్‌ మంచి లాభాలను అర్జించారని, అందువల్ల ఆయన నుంచి రూ.3 కోట్ల నష్టపరిహారం ఇప్పించాలని అందులో పేర్కొన్నారు.

ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి ఆర్‌.సుబ్రమణ్యం విచారించారు. అపుడు రెహ్మాన్‌ తరపు న్యాయవాది హాజరై ఈ సంగీత విభావరి కార్యక్రమం వల్ల నష్టాలు రావడానికి, తమకు ఎలాంటి సంబంధం లేదని, ఈ కార్యక్రమం కోసం ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం మేరకు తమకు చెల్లించాల్సిన మొత్తాన్ని కూడా చెల్లించలేదని, పైగా తమ క్లయింట్‌ నుంచి నష్టపరిహారం కోరడం సబబు కాదని అందువల్ల పిటిషన్‌ను కొట్టివేయాలని ఆయన కోరారు. అలాగే, పిటిషన్‌దారుడు తరపు వాదనలు కూడా ఆలకించిన న్యాయమూర్తి ఈ పిటిషన్‌ను కొట్టివేస్తూ ఆదేశించారు. 

Otherwoodsమరిన్ని...