సరిహద్దులు దాటే హక్కు మీకెక్కడిది?

ABN , First Publish Date - 2022-03-12T14:18:58+05:30 IST

రాష్ట్ర జాలర్లు సముద్రంలో అంతర్జాతీయ సరిహద్దులు దాటి వెళ్లకూడదని మద్రాస్‌ హైకోర్టు ఆదేశించింది. అలా సరిహద్దులు దాటి ఇతర దేశాల జలాల్లో చేపలుపట్టే హక్కు వారికి లేదని స్పష్టం చేసింది. శ్రీలంక

సరిహద్దులు దాటే హక్కు మీకెక్కడిది?

- హద్దు మీరొద్దు

- ఇతర దేశాల జాలర్లు వస్తే మన సైన్యం అరెస్టు చేయడం లేదా?

- రాష్ట్ర జాలర్ల తీరుపై మద్రాసు హైకోర్టు అసంతృప్తి


పెరంబూర్‌(చెన్నై): రాష్ట్ర జాలర్లు సముద్రంలో అంతర్జాతీయ సరిహద్దులు దాటి వెళ్లకూడదని మద్రాస్‌ హైకోర్టు ఆదేశించింది. అలా సరిహద్దులు దాటి ఇతర దేశాల జలాల్లో చేపలుపట్టే హక్కు వారికి లేదని స్పష్టం చేసింది. శ్రీలంక ప్రభుత్వం అదుపులోకి తీసుకున్న జాలర్లలను విడిపించాలని కోరుతూ మద్రాస్‌ హైకోర్టుతో పాటు మదురై ధర్మాసనంలోనూ దాఖలైన పిటిషన్లను కూడా జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించి తదుపరి విచారణ వాయిదా వేసింది. ఈ మేరకు మద్రాస్‌ హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్‌ మునీశ్వర్‌నాధ్‌ భండారీ, న్యాయమూర్తి జస్టిస్‌ భరత చక్రవర్తితో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. 1974లో జరిగిన కచ్ఛాదీవు ఒప్పందం సక్రమంగా అమలయ్యేలా ఆదేశాలి వ్వాలని కోరుతూ అఖిల భారత జాలర్ల కాంగ్రెస్‌ జాతీయ ఉపాధ్యక్షుడు ఆమ్‌స్ట్రాంగ్‌ ఫెర్నాండో మద్రాసు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. భారత్‌-శ్రీలంక పడవలు, రెండు దేశాల సముద్ర ప్రాంతాల్లో సంచరించేలా 1974లో ఒప్పందంలో పేర్కొ న్నారని పిటిషనర్‌ గుర్తు చేశారు. అయితే ఈ ఒప్పందం సక్రమంగా అమలు కాకపోవడంతో రాష్ట్ర జాలర్లు తీవ్రంగా నష్టపోవడంతో పాటు శ్రీలంక సైన్యం చేతిలో చిత్రహింసలకు గురి కావాల్సి వస్తోందన్నారు. శ్రీలంక అరెస్ట్‌ చేసిన 68 మంది జాలర్లు, 21 పడవలు విడిపించేలా కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలను ఆదేశించాలని అభ్యర్థించారు. ఈ వ్యాజ్యంపై శుక్రవారం ధర్మాసనం ముందు విచారణ జరగ్గా. కచ్ఛాదీవి ఒప్పందంలోని అంశాలు సక్రమంగా అమలు కావడం లేదని, అందువల్లే భారత జాలర్లను లంక సైన్యం అరెస్టు చేస్తోందని పిటిషనర్‌ తరఫు న్యాయవాది తెలిపారు. ఈ సందర్భంగా ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. అంతర్జాతీయ సరిహద్దు జలాల్ని దాటేందుకు జాలర్లకు ఎలాంటి హక్కు లేదని స్పష్టం చేసింది. ఇతర దేశాలకు చెందిన జాలర్లు సరిహద్దులు దాటి వస్తే భారత సైన్యం కూడా వారిని అరెస్టు చేస్తోందని గుర్తు చేసింది. అయితే ఇదే అంశంపై హైకోర్టు మదరై ధర్మాసనంలోనూ పలు పిటిషన్లు పెండింగ్‌లో వున్నాయని ప్రభుత్వ న్యాయవాది గుర్తు చేయడంతో.. అన్నింటినీ కలిపి విచారిస్తామని స్పష్టం చేస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది. 

Updated Date - 2022-03-12T14:18:58+05:30 IST