మలయాళ దళిత అనుభవాల ‘మడినారు’

ABN , First Publish Date - 2021-08-16T09:15:40+05:30 IST

ఇతర భాషల్లో సమాంతరంగా వస్తున్న కథలు చదవడం గొప్ప పఠనానుభవం. భిన్న ప్రాంతా ల్లోని సామాజికతను అర్థం చేసుకోవడం, తులనాత్మక పరిశీలన చేయడం, కొత్తగా స్ఫూర్తి పొందడం...

మలయాళ దళిత అనుభవాల ‘మడినారు’

ఇతర భాషల్లో సమాంతరంగా వస్తున్న కథలు చదవడం గొప్ప పఠనానుభవం. భిన్న ప్రాంతా ల్లోని సామాజికతను అర్థం చేసుకోవడం, తులనాత్మక పరిశీలన చేయడం, కొత్తగా స్ఫూర్తి పొందడం, తెలియనిదేదో తెలుసుకోవడం... ఇవన్నీ తక్షణం పొందే ప్రయోజనాలు. అవి పొందా లంటే సరైన వాహిక అనువాదాలే. తమిళం, మలయాళం భాషల్నుంచి అనేక ప్రక్రియల్ని ప్రతిభావంతంగా అనువాదం చేసేవారిలో ఎల్‌.ఆర్‌.స్వామి ఒకరు. ఆయన ‘మడినారు’ మలయాళ దళిత కథల్ని తెలుగువారికి పరిచయం చేయాలనే ఆశయంతో తెలుగులోకి అనువదించారు. ఇందులో 23 కథలున్నాయి. అన్నీ దళిత సమస్యల్ని చిత్రించిన కథలు కావు. దళిత రచయితలు రాసిన కథలు. 


తెలుగులో ఇవే తొలి మలయాళ దళిత కథలు. నేడు మలయాళ సాహిత్యంలో దళిత సాహిత్యం ముఖ్యమైన ధార. ‘సరస్వతి శపథం’ (1892) దళితుల జీవితాన్ని ఆవిష్కరించిన నవల. మహాకవి కుమారన్‌ ఆశాన్‌, తకలి, బషీర్‌, కేశవదేవ్‌ రచనల్లోనూ దళిత సమస్యలు దర్శనమిస్తాయి. కానీ ఇవేమీ దళితులు రాసినవి కావు. సహానుభూతితో రాసిన కథల్లో ఆత్మ లోపిస్తుందంటారు. మలయాళంలో తొలిసారి సాహిత్య రచన చేసిన దళితుడు టి.కె.సి.వటుతల (1921-1988). ఆయన రాసిన ‘శిలువ జపమాల’, ‘రెండుతరాలు’ మొదలైన ఇతర కథలు ఆనాటి దళిత జీవితానికి అద్దం పడతాయి.


మతం మారడం వల్ల సమస్యలు తీరతాయని, వివక్షలు అడుగంటుతాయనే భావనతో కొందరు క్రైస్తవం తీసుకునేవారు. అందులోనూ ఎక్కువ తక్కువల్ని ఎదుర్కోవాల్సి వస్తుందనే వాస్తవాన్ని చిత్రించిన కథలు ఇందులో ఉన్నాయి. కొన్ని కథల్లో అయితే తన మతంలోకి తీసుకెళ్లే పాత్రలు కూడా కనిపిస్తాయి. రెండో తరం దళిత కథకుల్లో పాల్‌ చిరక్కోడ్‌ వంటి వారు నిజమైన దళిత జీవితాన్ని ఆవిష్కరిస్తున్నారు. మూడో తరం రచనల్లో తన ఉనికిని నిలబెట్టుకోవాలనే ఆతురత కనిపిస్తుంది. తమ గురించి తాము రాసుకున్నది 1970 చివరి దశలోనే. ‘మడినారు’ కథకులందరూ దళితులే.


పులయ కులంలోని వాడైన కోరన్‌ రెండు కాళ్ల జంతువుగానే బతికేడు. సంపాదించిందంతా సారాయి దుకాణానికే పోశాడు. అయితే తన కులం నుంచి నమ్మకాల నుంచి విశ్వాసాల నుంచి కొంచెం పక్కకు జరిగి మతం మారాడు. తనకేదో గొప్ప హోదా వచ్చినట్లుగా భావించాడు. ఒంట్లో బాగో లేనపుడు అతని గుడిసెలోకి జనప్రవాహం మొదలైంది. అతని కోసం ప్రార్థనలు చేసేవారు వచ్చేరు. చిరిగిన చాపకు బదులు నవారు మంచం వచ్చింది. డబ్బులిచ్చారు. బట్టలిచ్చారు. సపర్యలు చేయడానికి మసుషులొచ్చారు. దేవసికి (కోరన్‌కు మత మార్పిడి తర్వాత పెట్టిన పేరు) స్వస్థత చేకూరింది. పొలం పనులు మానేశాడు. తన కులం వారితో సంబంధాలు తెంచుకున్నాడు. క్రైస్తవ సమాజంతో స్నేహబంధాలు పెరిగాయి. మతం మారనని తెగేసి చెప్పిన భార్య చక్కిని కొట్టాడు. భార్యా పిల్లల్ని వదిలేసి చర్చిలోకి మకాం మార్చాడు. పురుడు, చావు వార్తలు, వివాహ సమయాల్లో పెట్టె మోయడం... ఈ పనులలో మతం మార్పును గర్వంగా చూసుకున్నాడు. తర్వాత కొన్నాళ్లకు తనను మాల దేవసిగానే చూస్తున్నారనే సంగతి అవగతమైంది. ఉన్నత కులం లోంచి వచ్చినవారు ‘కోరన్‌ దేవసి’ అని పిలిచేవారు. మాల వాసన పోని విధంగా సమాజం చూస్తుండటం బాధ కలిగించింది. ఆత్మాభిమానం దెబ్బతింది. అంచనాలు కూలిపోయాయి. ఏడిచాడు. తను తలచింది వేరు. ఆఖరికి మెడలో బరువుగా ఉన్న శిలువ, జపమాల ఫాదర్‌కు ఇచ్చేశాడు. ఇదీ వటుతల రాసిన ‘శిలువ జపమాల’ కథ.


పాల్‌ చిరక్కరోడ్‌ ‘ముట్టడి’ కథలో రామచంద్రన్‌ తండ్రి ఒక మత ప్రచారకుడు. తను గుమస్తా. తండ్రి ప్రసంగాల్లో చెబుతున్నంత సురక్షితం కాదు బతుకు అని తెలియడానికి ఎంతో కాలం పట్టలేదు. అందుకే రామచంద్రన్‌గా పేరు కూడా మార్చుకున్నాడు. దళిత క్రైస్తవులకు అట్టడుగు వర్గాలకుండే కేటాయింపులుండవు. గాయపడినవాడి లోకం నుంచి బయటపడాలి. తోటి ఉద్యోగిని పెళ్లి చేసుకున్నాడు. భార్యతో కలిసి దళితవాడకు వెళ్లాడు. చిరిగిన గుడ్డ ముక్కల్లా జనాలు కనిపిస్తారు. కోరికలు నేలమీదనే పడి ఉన్నాయి. అంతేకాదు. ఊళ్లో గౌరవ వాచకపు పిలుపులు ఎదురయ్యాయి. నగరానికి తిరిగొచ్చాడు. గోడ మీద దేవుళ్ల ఫొటోలున్నాయి. ‘‘మనను అనుగ్రహించే దేవుళ్లు’’ అంది భార్య. మర్నాడు ఒక అంబేడ్కర్‌ చిత్రంతో వచ్చాడు. దాన్ని గోడకు మేకు కొట్టి దేవుళ్ల పటాల పక్కన పెట్టాడు. ‘‘ఏమిటిది?’’ అని అడిగింది భార్య. ‘‘నన్ను అనుగ్రహించినవాడు’’ అని సమాధానం చెబుతాడు. అక్కడితో ఆగలేదు. ‘‘నీకు తెలుసా, ఇతడు మన రాజ్యాంగ శిల్పి కాకపోయి ఉంటే నువ్వు నేనూ పొలాల్లోని బురదలోనే కొట్టుకునేవాళ్లం’’ అంటాడు. తన తండ్రి పాడిన పాటల్లోకి గతంలోకి అతని మనసు ప్రయాణించడంతో కథ ముగుస్తుంది. 


జాన్‌.కె. ఎరుమేలి ‘అయితే కులం వద్దు’ కథ కుల ధ్రువీకరణ పత్రం పొందడానికి పడే పాట్లను తెలియజేస్తుంది. కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేసే యంత్రాంగంలో ఉండే లోటుపాట్లను ఈ చిన్న కథలో ఎండగట్టాడు రచయిత. 


ఉన్నత స్థితికి చేరింతర్వాత అవకాశవాదంతో పారిపోయేవారి గురించి నీగ్రో రాసిన కథ ‘చిరుతక్కున్ను’ చెబుతుంది. చిరుతక్కున్ను ఊరు పేరు. కాలేజీలో చదువుకునే క్రమంలో ‘‘ఒరేయ్‌..షెడ్యూలు’్డ’ అని పిలిచినా చిరునవ్వే సమాధానంగా గడిపాడు రవి. కృషితో బ్యాంకు మేనేజరు అయ్యాడు. గీతను పెళ్లాడాడు. ఆ తర్వాత వాడనూ వాడ జనాన్నీ మరిచాడు. ఒక జాతీయ స్థాయి సెమినారులో పాల్గొన్నపుడు తన ఊరును అధికార అవసరాల కోసం ప్రభుత్వం ఖాళీ చేయించి కబళించిందని తెలుసుకుంటాడు. ఊరు జ్ఞాపకాలు చుట్టు ముట్టాయి. ఊరెళ్లి తల్లిని కలుస్తాడు. వాటేసుకుంటాడు. పాదాల మీద పడి ఏడుస్తాడు. కులంలో పై స్థాయికెళ్లి తన గతాన్ని మరిచే వారికి గుణపాఠం ఈ కథ. 


రేఖారాజ్‌ ‘మడినారు’ కథ ఒకానొక సామాజిక అసమానతల గుట్టు విప్పే కథ. మత్తాయి కష్టజీవి. తను సొంతంగా పొలం కొని సేద్యం చేయాలనేది చిరకాల కోరిక. కొడుకు ఉద్యోగం లోకి చేరిన రెండేళ్లకు ఆ కోరిక తీరింది. ముందులో చేను అమ్మడానికి ఏ భూస్వామీ ఒప్పుకోలేదు. కడకు బతిమాలి కాళ్లు పట్టుకుని ‘‘తను కష్టించి పనిచేసే చెక్కలో కొంత భూమి ఇప్పించమని’’ ప్రార్థించాడు. అతని ప్రార్థన ఫలించింది. చేనైతే కొన్నాడు గానీ దళితుడి చేలో పనిచేయడానికి ఎవరొస్తారు? అతని చేలో పనికెళితే ఇక్కడ పని ఉండదన్నారు ఊళ్లో భూస్వాములు. కూలీలు రాలేదు. మడినారు తయారైంది. నీరు ఆపారు. ‘‘పితృదేవతలారా, నన్ను పరీక్షిస్తున్నారా?’ అంటూ వాపోయాడు. తెల్లవారుజామున చేను గట్టుకెళ్లి చూస్తే పొలం నిండా జనమే. క్రైస్తవుల చర్చి లోని పండుగనాడు కనబడేటంత జనం. ఎక్కువమంది ఆడకూలీలే. గర్భిణీ స్త్రీలున్నారు. పిల్లలున్నారు. వృద్ధులున్నారు. అంతా నారు నాటుతున్నారు. నారు నాటాక దక్షిణ భాగంలో ఉండే శ్మశానానికి వెళ్లిపోతున్నారు. మత్తాయి గాలికి వణికే ఆకులా ఒళ్లంతా ఒణుకుతూ వెనక్కి తిరిగి పరుగెట్టాడు. భార్యను కేకేసి నేలకి ఒరిగిపోయాడు. ఒక సంక్లిష్ట సమాజంలో దళితుల బతుకు వెతల తీరును కళ్లకు కట్టిందీ కథ. 


దళిత స్పృహ ఉన్న కథల్నే ప్రస్తావించాను. ఇంకా ఇందులో దళితుల్లో వర్గభేదాల్ని చిత్రించిన ‘సింహా సనం’, గగుర్పాటు కలిగించే అనైతికతతో కూడిన ముగింపుతో ‘సర్ప కాముకుడు’, వావివరసలు లేకుండా ప్రవర్తించే ‘కుందేళ్ల ప్రపంచం’, నలుగురు పెళ్లాల భయంకరాకారుడు సంచిన్‌ ‘ఒక రాక్షసుని పతనం’, అస్తిత్వవేదనని తెలియజేసే ‘మియా కుళ్పా’ వంటి కథలున్నాయి. ఈ కథలు చదివితే మనిషికి ప్రాంతాలకు అతీతమైన ఉమ్మడి సమస్యల పట్ల అవగాహన కలుగుతుంది. 


ఈ కథలు చదివిన తర్వాత ఇవేమీ తెలుగు వాతావరణానికి దూరంగా జరిగి రాసిన కథలుగా అనిపించవు. మన చుట్టూ ఉన్న సమాజాన్ని వేరే గొంతుతో చెప్పినట్టుంటాయి. సజీవ పాత్రలుగా మన చుట్టూ తిరుగాడుతుంటాయి. కథలన్నీ రచయితల అనుభవాల్లోంచి పలవరించినవే. వాస్తవికతను ప్రతిబింబించినవే. కథల్ని అనువదించి మనకు అందించిన ఎల్‌.ఆర్‌.స్వామి అభినందనీయుడు. 

దాట్ల దేవదానం రాజు

94401 05987

Updated Date - 2021-08-16T09:15:40+05:30 IST