100 మంది పోలీసుల రక్షణలో దళిత వరుడి పెళ్లి ఊరేగింపు

ABN , First Publish Date - 2022-01-29T23:31:19+05:30 IST

ఓ దళిత వరుడు పెళ్లి ఊరేగింపు సవ్యంగా సాగేందుకు ఏకంగా 100 మంది పోలీసులు మోహరించారు. వారి రక్షణ..

100 మంది పోలీసుల రక్షణలో దళిత వరుడి పెళ్లి ఊరేగింపు

నీముచ్: ఓ దళిత వరుడు పెళ్లి ఊరేగింపు సవ్యంగా సాగేందుకు ఏకంగా 100 మంది పోలీసులు మోహరించారు. వారి రక్షణ మధ్య ఆ పెళ్లి ఊరేగింపు ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగింది. మధ్యప్రదేశ్‌లోని నీముచ్ జిల్లా సర్సి గ్రామంలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు సర్వత్ర చర్చనీయాంశమైంది.


పెళ్లి ఊరేగింపు కోసం పోలీసులను ఎందుకు ఆశ్రయించాల్సి వచ్చిందన్న దానిపై దళిత పెళ్లికొడుకు రాహుల్ మేఘవాల్ మాట్లాడుతూ.. తాను పెళ్లి ఊరేగింపు నిర్వహించినా, గుర్రమెక్కినా ఏడాదిలోపు గ్రామం విడిచి వెళ్లాల్సి ఉంటుందని తమను హెచ్చరించారని పేర్కొన్నాడు. దీంతో తాము పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చిందని వివరించాడు. పోలీసులు, అధికారులు వచ్చి తమ ఊరేగింపునకు రక్షణ కల్పించినట్టు చెప్పాడు.


గూండాల నుంచి హెచ్చరికలు వచ్చిన తర్వాత వరుడి తండ్రి ఫకీర్‌చంద్ మేఘవాల్.. కలెక్టర్‌కు లేఖ రాస్తూ తన కుమారుడి వివాహానికి రక్షణ కల్పించాలని కోరారు. స్పందించిన  కలెక్టర్ ఆ కుటుంబానికి రక్షణ కల్పించాలని పోలీసులను ఆదేశించారు.


కలెక్టర్ ఆదేశాలతో మూడు పోలీస్ స్టేషన్ల నుంచి కదిలిన పోలీసులు పెళ్లి ఊరేగింపునకు రక్షణ కల్పించారు. ఊరేగింపులో పాల్గొన్న వారిలో తహసీల్దార్, ఎస్డీవోపీ, ఎస్డీఎంతోపాటు గ్రామం మొత్తం ఈ వేడుకకు కదిలొచ్చింది. పోలీసుల రక్షణలో డీజే హోరు, డ్యాన్స్‌ల మధ్య అంగరంగవైభవంగా ఊరేగింపు నిర్వహించారు.

 

గుర్రంపై ఊరేగిన వరుడు తన చేతిలో దేశ పౌరులందరికీ సమాన హక్కులు కల్పించే భారత రాజ్యంగం పుస్తకాన్ని పట్టుకోవడం గమనార్హం. మానస పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ కేఎల్ డాంగి మాట్లాడుతూ.. ఊరేగింపు చేపట్టే సమయంలో నిరసనలు ఎదురవుతాయన్న భయంతో కుటుంబసభ్యులు భయపడ్డారని, దీంతో రక్షణ కల్పించాల్సి వచ్చిందని పేర్కొన్నారు.


పోలీసులు, అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసి ‘బిందోళీ’ని శాంతియుతంగా నిర్వహించినట్టు చెప్పారు. ఇందుకు గ్రామస్థులు కూడా సహకరించారని, అందరూ కలిసి మెలసి జీవించాలని కోరారు.  

Updated Date - 2022-01-29T23:31:19+05:30 IST