Abn logo
May 11 2021 @ 02:15AM

ఆక్సిజన్ అవస్థలు లేని మధ్యప్రదేశ్

మనదేశంలో మెడికల్ ఆక్సిజన్ కొరత అసలే లేదు. సమస్య అంతా ఆక్సిజన్ రవాణా విషయంలోనే ఏర్పడుతోంది. సరిపడా క్రయోజనిక్ ట్యాంకర్లు లభ్యం కావడం ఒక సమస్య అయితే ఆక్సిజన్ ప్లాంట్లు ఉన్న కొన్ని రాష్ట్రాలు ఇతర రాష్ట్రాలకు ఆక్సిజన్ సరఫరాను అనుమతించకపోవడం మరో సమస్య. ఇతర రాష్ట్రాలకు చెందిన ట్యాంకర్లను ఆపవద్దని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ముఖ్యమంత్రుల సమావేశంలో చెప్పారు. హోంమంత్రిత్వ శాఖ మార్గదర్శకసూత్రాలు కూడా విడుదల చేసింది. అంతేకాక ఆక్సిజన్ ట్యాంకర్ల రవాణా యుద్ధ ప్రాతిపదికన జరిగేందుకు భారతీయ రైల్వే, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌ను కేంద్రం పెద్దఎత్తున ఉపయోగిస్తోంది. ఆక్సిజన్ రవాణాతో పాటు ఆక్సిజన్ నిర్వహణ సరిగా లేకపోవడం కూడా ఈ కొరతకు కారణమవుతోంది, కేవలం కొన్ని రాష్ట్రాలు మాత్రమే ఆక్సిజన్ నిర్వహణ సక్రమంగా చేయగలుగుతున్నాయి. మధ్యప్రదేశ్‌నే తీసుకోండి. ఢిల్లీతో పోలిస్తే అది చాలా పెద్ద రాష్ట్రం. ఆ రాష్ట్రంలో ఒక్క ఆక్సిజన్ ప్లాంట్ కూడా లేకపోయినప్పటికీ ఢిల్లీ కన్నా అతి తక్కువ ఆక్సిజన్‌తో అక్కడి ప్రభుత్వం తమ ప్రజల ప్రాణాలు కాపాడగలుగుతున్నది. ఇందుకు ప్రధాన కారణం మెడికల్ ఆక్సిజన్ లభ్యతను అది క్రమబద్ధీకరించడం. కేవలం ఆక్సిజన్ నిర్వహణకే మధ్యప్రదేశ్ ప్రభుత్వం నలుగురు ఉన్నతాధికారులతో ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందం ఆధ్వర్యంలో అన్ని జిల్లాలను అనుసంధానిస్తూ ఒక ఆక్సిజన్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. ఒక ఆక్సిజన్ ఎమర్జెన్సీ నంబర్‌ను రూపొందించి అన్ని జిల్లా, నోడల్ అధికారులకు అందజేశారు. ఈ కంట్రోల్ రూమ్‌లో రాత్రింబగళ్లు ఫోన్‌కాల్స్‌ను రిసీవ్ చేసుకునేందుకు అధికారులను నియమించారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు నిరంతరం ఈ కంట్రోల్ రూమ్‌లో పర్యవేక్షణ చేస్తూ ఎటువంటి ఎమర్జెన్సీ పరిస్థితినైనా ఎదుర్కొంటారు. ఈ టీమ్ సమర్థంగా ఆక్సిజన్ నిర్వహణ చేయడం వల్ల ఢిల్లీ కన్నా తక్కువ ఆక్సిజన్‌తోనే మధ్యప్రదేశ్ గట్టెక్కగలుగుతోంది, ఉదాహరణకు ఒక ఆక్సిజన్ బెడ్కు గంటకు పది లీటర్ల ఆక్సిజన్ అవసరం అయితే ఐసీయు బెడ్‌కు గంటకు 25 లీటర్లు అవసరం అవుతుంది. వంద మంది పేషంట్లకు 8 ఆక్సిజన్, 5 ఐసియు పడకలు ఉంటాయి. శిక్షణ పొందిన సాంకేతిక నిపుణులు, నర్సులు లేకపోవడం వల్ల కూడా లీకేజ్ ఎక్కువగా ఉంటుంది. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకుని సగటు ఆక్సిజన్ వినియోగాన్ని అంచనా వేసి రానున్న మూడు రోజులకు ఎంత ఆక్సిజన్ అవసరం అవుతుందో తదనుగుణంగా చర్యలు తీసుకుంటే పెద్దగా ఇబ్బందులు ఉండవని మధ్యప్రదేశ్‌లో అధికారులు అనుభవపూర్వకంగా గ్రహించారు. వివిధ జిల్లాల నుంచి వచ్చే డిమాండ్లను సార్థక్ పోర్టర్లలో నమోదు చేస్తున్నారు. మెడికల్ ఆక్సిజన్ సరఫరా దారులు, రీఫిల్ చేసేవారు, ఆక్సిజన్ సెల్ఫ్ జనరేటర్లు ఎంతస్థాయిలో ఉన్నాయో అంచనా వేయడం ద్వారా రాష్ట్ర అవసరాలకు తగ్గట్లు ఆక్సిజన్ను సేకరించడం ఇబ్బంది కాదని వారు తెలుసుకున్నారు. రాష్ట్రంలో మెడికల్ ఆక్సిజన్ ట్రక్కులు ప్రవేశించినప్పటి నుంచీ గమ్యస్థానం చేరే వరకూ ట్రాకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ప్రైవేట్ రవాణాదారులను గరిష్ఠస్థాయిలో ఉపయోగించుకున్నారు. ఏయే ఆసుపత్రులు క్రయోజెనిక్ ట్యాంకులు ఉపయోగించగలవో, ఏ జిల్లాల్లో రీఫిల్లింగ్ ప్లాంట్లు ఉన్నాయో, ఏ జిల్లాల్లో ఆక్సిజన్ సెల్ఫ్ జనరేటర్లు ఉన్నాయో వర్గీకరించి వాటి కేటాయింపును పర్యవేక్షించడం ప్రారంభించారు. నిజానికి మధ్యప్రదేశ్‌కు ఏప్రిల్ 1 వరకు కేవలం 180 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరా మాత్రమే జరిగేది. అయితే మే 6 నాటికి ఆ రాష్ట్రం 680 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను సమీకరించగలిగింది. ఢిల్లీ వంటి చిన్న రాష్ట్రం తమకు 900 మెట్రిక్ టన్నులు కావాలని న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే, సరైన సమర్థ నిర్వహణతో అంత స్థాయిలో ఆక్సిజన్ అవసరం లేదని మధ్యప్రదేశ్ నిరూపించింది. ఆక్సిజన్ వినియోగాన్ని సమర్థంగా ఆడిట్ చేయడం వల్లనే మధ్యప్రదేశ్‌లో కొవిడ్ కేసులు పెరుగుతున్నప్పటికీ, ప్రాణ వాయువు లేకపోవడం వల్ల మరణించే వారి సంఖ్య గణనీయంగా తగ్గింది.


సమర్థులైన అధికారులు సంక్షోభ సమయాల్లో తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తారనడానికి ప్రధాన ఉదాహరణ డీఆర్‌డీవో అధినేత సతీష్ రెడ్డి. నెల్లూరులో ఒక ఆసుపత్రిలో రోగులకు అత్యవసర ఆక్సిజన్ అవసరమైతే ఆయన ఆగమేఘాలపై రంగంలోకి దిగడంతో ఇస్రో నుంచి అవసరమైన సహాయం అందింది. సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో అతి తక్కువ సమయంలో దేశంలోని తొమ్మిది ప్రాంతాల్లో అత్యంతాధునిక సౌకర్యాలతో కొవిడ్ కేర్ ఆసుపత్రులు వెలిశాయి. డీఆర్‌డీవో యుద్ధ ప్రాతిపదికన ప్రముఖ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్లను నెలకొల్పి ప్రాణవాయువు కొరత లేకుండా చేసే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఢిల్లీలోని ఎయిమ్స్, ఆర్‌ఎంఎల్ ఆసుపత్రుల్లో ఆ ప్లాంట్లు పనిచేయడం ప్రారంభించాయి, అంతేకాక సిలిండర్ ఆధారిత ఆక్సిజన్ వ్యవస్థ వల్ల జరిగే వృథాను అరికట్టేందుకు డీఆర్‌డీఓ నియంత్రణ వ్వవస్థల్ని ప్రవేశపెట్టింది. ఇవే కాక డీఆర్‌డీవో ప్రయోగశాలలు వేయికి పైగా సిలిండర్లను దేశవ్యాప్తంగా సరఫరా చేస్తున్నాయి. డీఆర్‌డివోకు చెందిన నూక్లియర్ మెడిసిన్ సంస్థ కొవిడ్‌ను అరికట్టేందుకు ఒక మాలిక్యూల్ ఔషధం 2–-డిజిని కేవలం ఏడాదికాలంలో రూపొందించి ఉత్పత్తి ప్రారంభించడం అభినందనీయం. 


అధికారులను సమర్థంగా ఉపయోగించుకునే బదులు మన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వారిని రాజకీయాల కోసం ఉపయోగించుకుంటున్నారు. రాజకీయ ప్రత్యర్థులపై కేసులు బనాయించడం, కక్షసాధింపు చర్యలకు పాల్పడడం చేస్తున్నారు. జనజీవితాలను కొవిడ్ అతలాకుతలం చేస్తున్న సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో అమర్ రాజా బ్యాటరీస్, జువారీ, సంగం డైరీ వంటి వాటిపై చర్యలకు పాల్పడడంతో పాలకుల దృష్టి ఎక్కడ ఉన్నదో అర్థమవుతోంది. తెలంగాణలో కూడా ఆరోగ్య శాఖమంత్రిని తప్పించేందుకు అధికారులను వాడుకున్న వైనం, వారు వ్యవహరించిన తీరు ఒక ప్రజాస్వామ్య సమాజంలో ఆధునిక నియంతల వ్యవహార శైలికి అద్దం పడుతోంది. కరోనా విలయతాండవాన్ని అడ్డుకునేందుకు సర్వశక్తులు వినియోగించుకోవాల్సిన ముఖ్యమంత్రులు ఇప్పటికైనా ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మోదీని నిందిస్తే చాలు తమను ప్రజలు క్షమిస్తారని వారనుకుంటే అది పొరపాటే అవుతుంది.

వై. సత్యకుమార్

బిజెపి జాతీయ కార్యదర్శి

Advertisement