భార్య జీవితం కోసం.. సంచలన నిర్ణయం తీసుకున్న జైల్లో ఉన్న భర్త.. ఆమె కోసం ఆయన ఏం చేశాడో తెలిస్తే..

ABN , First Publish Date - 2021-10-10T16:53:54+05:30 IST

ఆయన ఓ..

భార్య జీవితం కోసం.. సంచలన నిర్ణయం తీసుకున్న జైల్లో ఉన్న భర్త.. ఆమె కోసం ఆయన ఏం చేశాడో తెలిస్తే..

ఇంటర్‌నెట్‌డెస్క్: ఆయన ఓ హత్య కేసు కింద జైలు జీవితం అనుభవిస్తున్నాడు. తాను జైల్లో ఉంటే.. బయట ఉన్న తన భార్య జీవితం నరకంగా ఉంటుంది అని ఆలోచించాడు. ఆమె జీవితం సంతోషంగా ఉండాలని.. అతనో పెద్ద నిర్ణయమే తీసుకున్నాడు. అతను తీసుకున్న నిర్ణయానికి భార్య, బంధువులందరూ షాక్‌కు గురయ్యారు. ఆ తర్వాత అతను చెప్పింది అర్థం చేసుకుని భార్య ఓకే చెప్పేసింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం..


గ్వాలియర్‌కు చెందిన రాజేష్ దూబే అనే వ్యక్తికి 11ఏళ్ల క్రితం వివాహం జరిగింది. కొన్ని రోజుల క్రితం అతను ఓ హత్య చేయడంతో.. కోర్టు జీవిత ఖైదు విధించింది. ఆయన ప్రస్తుతం గ్వాలియర్ సెంట్రల్ జైలులో శిక్షను అనుభవిస్తున్నాడు. భర్తకు శిక్ష పడడంతో భార్య కన్నీరుమున్నీరైంది. భార్య బాధను గమనించిన భర్త.. ఆమె కోసం ఓ కీలక నిర్ణయం తీసుకున్నాడు. తాను చేసిన తప్పుకు భార్య ఎందుకు బాధపడాలని ఆలోచించాడు.



ఆమె జీవితం బాగుండాలని హైకోర్టులోని డివిజన్ బెంచ్‌లో విడాకుల కేసు వేశాడు. భర్త తీసుకున్న నిర్ణయానికి భార్య ఆశ్చర్యపోయింది. తనకు విడాకులు వద్దని భార్య తెగేసి చెప్పింది. కానీ భర్త ఆమెకు వాస్తవాన్ని వివరించాడు. ‘‘తప్పు చేసింది నేను.. నా వల్ల నువ్వు జీవితం నాశనం చేసుకోకూడదు. నీకంటూ ఒక లైఫ్ ఉంది. నా వల్ల నువ్వు రోజూ బాధపడడం నన్నెంతగానో ఇబ్బంది పెడుతోంది. నువ్వు మళ్లీ పెళ్లి చేసుకో.. ’’అని చెప్పాడు. 


మధ్యప్రదేశ్ రాష్ట్రంలోనే ఇలాంటి కేసు నమోదు కావడం ఇదే మొదటిసారి. పిటిషనర్ భార్య జీవితం గురించి ఆలోచించి..  కోర్టు వారికి విడాకులు మంజూరు చేసింది. మామాలుగా ఓ విడాకుల కేసు విచారణకొస్తే.. కోర్టు ఆరు నెలల సమయం గడువు ఇస్తుంది. భార్యాభర్తలు తమ అభిప్రాయాలను మార్చుకొని మళ్లీ ఒకటవుతారని సమయమిస్తుంది. కానీ వీరి పరిస్థితి అర్థం చేసుకుని వెంటానే విడాకులు మంజూరు చేసింది.


గ్వాలియర్ సెంట్రల్ జైల్ సూపరిండెంట్ మనోజ్ సాహూ మాట్లాడుతూ రాజేష్ భార్యకు అతని నుంచి విడాకులు తీసుకోవడం ఇష్టం లేదన్నారు. భర్త చేసిన తప్పుకు భార్య జీవితం నాశనం కాకూడదనే తాము కూడా సహకరించామన్నారు. ఇదో సంచలన నిర్ణయమే అని అన్నారు. ఇలాంటి కేసు రాష్ట్రంలో నమోదు కావడం ఇదే మొదటిదన్నారు.

Updated Date - 2021-10-10T16:53:54+05:30 IST